వాహనదారులకు గమనిక : ట్యాంక్ బండ్ క్లోజ్

  • Published By: madhu ,Published On : November 9, 2019 / 01:32 AM IST
వాహనదారులకు గమనిక : ట్యాంక్ బండ్ క్లోజ్

ఆర్టీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్ ట్యాంక్ బండ్‌ను మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రాఫిక్ అదనపు సీపీ అనీల్ కుమార్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీల నేతలు, ఆందోళనకారులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఉండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. 

> సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు కవాడీగూడ వైపు మళ్లింపు.
> తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు వెళ్లే వారు ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి వైపుకు మళ్లింపు.
> హిమాయత్ నగర్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాళ్లు బషీర్ బాగ్ వైపు మళ్లింపు.
> ఓల్డ్ ఎమ్మెల్యే రూట్ నుంచి వచ్చే వాహనదారులు పీసీఆర్ జంక్షన్ దగ్గర దారి మళ్లింపు.
> ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనదారులు ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నెక్‌లెస్ రోడ్, మింట్ కాంపౌడ్ వైపు మళ్లింపు.
> హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకుని బషీర్ బాగ్ వైపు వెళ్లాలి. 
> ఎస్‌బీ‌హెచ్ గన్ ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్ విగ్రహం నుంచి కేఎల్‌కే బిల్డింగ్ వైపు మళ్లింపు.
> ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి నెక్లెస్ రోటరీ వద్ద మింట్ కాంపౌడ్ లేన్ వైపు వెళ్లాలి.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ట్యాంక్‌బండ్‌పై సకల జనుల సామూహిక దీక్ష నిర్వహించి తీరతామన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని కార్మిక సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. కార్మికుల నిరసన దీక్షకు అనుమతి లేకపోవడంతో.. ట్యాంక్‌బండ్‌కు వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. ఆర్టీసీ జేఏసీ ట్యాంక్ బండ్‌పై సకల జనుల సామూహిక దీక్ష తలపెట్టింది. దీనికి.. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై.. జేఏసీ, విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా.. నిరసన దీక్ష చేపట్టి తీరతామని విపక్ష నాయకులు తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని.. రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి.
Read More : అయోధ్య తీర్పు : హైదరాబాద్‌లో బలగాల మోహరింపు