నాడు తిండి కోసం..నేడు చదువు కోసం : వైరల్ ఫొటో చిన్నారికి స్కూల్లో అడ్మిషన్

  • Published By: venkaiahnaidu ,Published On : November 11, 2019 / 02:20 AM IST
నాడు తిండి కోసం..నేడు చదువు కోసం : వైరల్ ఫొటో చిన్నారికి స్కూల్లో అడ్మిషన్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఒక ఖాళీ గిన్నె ని చేతిలో పట్టుకొని ఓ తరగతి ఎదుట నిల్చొని విద్యార్థుల వైపు దీనంగా చూస్తున్న ఫొటోను ‘ఆకలి చూపు’ అనే శీర్షికతో మూడు రోజుల క్రితం ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిడం,అది వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

గుడిమల్కాపూర్‌లోని దేవల్ జామ్ సింగ్ ప్రభుత్వ పాఠశాల మురికివాడలలో ఉండడంతో ఒక ఫోటో జర్నలిస్ట్ ప్రస్తుత డెంగ్యూ వ్యాప్తి ని ఉద్దేశించి ఆ పాఠశాలలో ఉన్న సదుపాయాలను, శుభ్రతని ఫోటో తీయడానికి వెళ్ళాడు. ఈ సందర్భంలోనే ఓ చిన్నారి ఒక ఖాళీ గిన్నె ను పట్టుకొని నడుచుకుంటూ వెళ్లి ఒక తరగతి ముందు నిల్చొని విద్యార్థుల వైపు దీనంగా చూస్తుంది. దీన్ని గమనించిన ఆ ఫోటో జర్నలిస్ట్ ఈ చిన్నారిని ఒక ఫోటో తీసాడు. ఆ ఫొటోని చూసి చిన్నారుల హక్కుల కోసం పనిచేసే ఎంవీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ జాతీయ కన్వీనర్ వెంకట్ రెడ్డి చలించిపోయారు.

వెంటనే ఆ చిన్నారి పేరు దివ్య అని తెలుసుకుని, వెంటనే దివ్య నివసించే స్థలం..తన తల్లిదండ్రులు గురించి పూర్తిగా వివరాలు తెలుసోకమని వెంకట్ రెడ్డి తన కోఆర్డినేటర్ ని పంపించాడు. ఆ బాలిక తల్లిదండ్రులు చెత్త వేరుకునే వారని తెలుసుకున్న వెంకట్ రెడ్డి తన టీమ్ తో సహా దివ్య నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లి ఆ పాఠశాలలో చేర్చుకుని చదివే హక్కు, ఆహార హక్కు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఆ చిన్నారి పేరెంట్స్ తో మాట్లాడి స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించాడు వెంకట్ రెడ్డి. ఈ విషయాన్నీ తన ఫేసుబుక్ పోస్ట్ ద్వారా.. ఇకపై దివ్య చదువుకుంటూనే కడుపు నిండా తినగలదు అంటూ తెలియచేసాడు. జర్నలిస్ట్ తీసిన ఒక్క ఫొటో ఆ చిన్నారి జీవితాన్నే మార్చేసింది. దివ్య భవిషత్తు బాగుండాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుకుంటున్నారు.