నీటి కష్టాలు : హైదరాబాద్ కి గోదావరి బంద్

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 05:21 AM IST
నీటి కష్టాలు : హైదరాబాద్ కి గోదావరి బంద్

హైదరాబాద్ నగరంలో 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. 48 గంటల పాటు పూర్తిగా వాటర్ సప్లయ్ ని నిలిపివేయనున్నారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో నీళ్లు రావని జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి పైప్ లైన్ల రిపేరీ కారణంగా వాటర్ సప్లయ్ లో ఇబ్బంది ఉందని.. అందుకే ఈ అసౌకర్యం కలిగిందని అధికారులు వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

బుధవారం ఉదయం నుంచి 48 గంటలపాటు పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. నగర దాహార్తిని తీర్చడంలో గోదావరి జలాలు కీలకం. దీంతో ఈ ప్రభావం సగం నగరంపై పడనుంది. తొలుత 3 రోజులపాటు నీటిని నిలిపివేయాలని భావించారు. అయితే ప్రజల ఇబ్బందులను గుర్తించి 2 రోజులకు తగ్గించారు.

రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తుండటంతో నీటి కష్టాలు తప్పవని నగరవాసులు ఆందోళన పడుతున్నారు. తొలి రోజు నీళ్లు రానివారు మళ్లీ మూడు రోజుల వరకు నిరీక్షించాలి. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకొకసారి సరఫరా చేస్తున్నారు. ఇలాంటివారు ఆరు రోజులపాటు వేచి చూడాలి. 3-6 రోజులపాటు ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తప్పవనే అంటున్నారు. నగరానికి ఇంతవరకు 460 మిలియన్ గ్యాలన్లను తరలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-13లో భాగంగా గజ్వేల్ మండల పరిధిలోని కొడకండ్ల దగ్గర గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటికి 3వేల ఎంఎం డయా గోదావరి పైపు లైన్ అడ్డంకిగా మారింది. దీంతో కెనాల్ పై నిర్మించిన వంతెన మీద నుంచి పైపులైన్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 16వ తేదీ నుంచి 18వ తేదీ ఉదయం వరకు ఈ పనులు చేపట్టనున్నారు.

ఈ ఏరియాల్లో నీటి సరఫరా బంద్ :

ఎర్రగడ్డ, బోరబండ, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్ గూడ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట, బంజారాహిల్స్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, మూసాపేట, బాలానగర్, భాగ్యనగర్, భరత్ నగర్, సనత్ నగర్;, బోరబండ, ఎన్ ఎఫ్ సీ, పోచారం, సింగపూర్ టౌన్ షిప్;, మౌలాలి, లాలాపేట, తార్నాక, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్, డిఫెన్స్ కాలనీ, గౌతంనగర్, ప్రశాంత్ నగర్, చాణక్యపురి, మల్కాజిగిరి, ఫతర్ బాలాయినగర్, అల్వాల్, న్యూ ఓయూ కాలనీ, కైలాసగిరి, హఫీజ్ పేట, మియాపూర్, మాతృశ్రీ నగర్, మయూరినగర్, చందానగర్, ఆర్సీపురం, పటాన్ చెరు, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి, బొల్లారం, అమీన్ పూర్, మల్లంపేట, జవహర్ నగర్, బాలాజీనగర్, కీసర, దమ్మాయిగూడ, నాగారం, చేర్యాల, ఆర్ జీకె, అహ్మద్ గూడ, దేవరాయాంజల్, లాలాపేట, తార్నాక, సీఆర్పీఎఫ్ మెస్, కంటోన్మెంట్ బోర్డు పరిధి, తుర్కపల్లి బయోటెక్ పార్క్.

48 గంటలు మాత్రమే నీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు చెబుతున్నా.. ఆ ప్రభావం నాలుగైదు రోజులపాటు ఉంటుందని తెలుస్తోంది. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి కష్టాలు తలుచుకుని వర్రీ అవుతున్నారు. ముందు జాగ్రత్తగా నీటిని పొదుపుగా వాడుకుంటున్నారు.