కార్మిక సంఘాల భవిష్యత్ ఏంటీ? : కార్మికులతో కేసీఆర్ కీలక భేటీ

  • Published By: chvmurthy ,Published On : December 1, 2019 / 03:22 AM IST
కార్మిక సంఘాల భవిష్యత్ ఏంటీ? : కార్మికులతో కేసీఆర్ కీలక భేటీ

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు  వెళ్లినప్పటినుంచి సీఎం కేసీఆర్  ఆర్టీసీ ఉద్యోగ సంఘాలపై గుర్రుగా ఉన్నారు.  అనేక సందర్భాల్లో యూనియన్ నాయకుల మాటలు విని కార్మికులు సమ్మెకు వెళ్లారని సీఎం ఆరోపించారు.  అందుకే కార్మికులతో నేరుగా మాట్లాడేందుకు  అదివారం ,డిసెంబర్ 1న  ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారుతోంది. సీఎం కేసీఆర్ కార్మికులతో మాట్లాడి నేరుగా వారికి భరోసా కల్పిస్తారు  సరే …. మరి యూనియన్ల సంగతేంటి.. ఇప్పుడిదే ప్రశ్న అందరిలోనూ వినిపిస్తోంది. సమ్మె తర్వాత తిరిగి విధుల్లో చేరాలంటూ కార్మికులకు పిలుపునిచ్చే సమయంలో కూడా … ఆర్టీసీలో ఇక కార్మిక సంఘాలు ఉండనే ఉండవంటూ కేసీఆర్ స్పష్టంగా చెప్పేశారు. అందుకు తగ్గట్లే ఆర్టీసీలో యూనియన్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

ఇవాళ అన్ని డిపోల కార్మికులతో లంచ్ మీటింగ్ పెట్టినా… అసలు యూనియన్లను ఏ మాత్రం పట్టించుకోలేదు. వారిని కనీసం ఆహ్వానించనుకూడా లేదు. ఇప్పటికే… కార్మిక సంఘాల కోరలు పీకేందుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేసిన కేసీఆర్.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. బస్సు భవన్‌లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘం కార్యాలయానికి అధికారులు తాళాలు వేశారు. నేతలు కూడా డ్యూటీలు చేయాల్సిందే అంటూ ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. వారికి ఇచ్చే సౌకర్యాల్లో కూడా కోతపడింది. మరోవైపు… 50 రోజులకుపైగా సమ్మె చేసినా… ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు. దీంతో.. జేఏసీ నేతలపై కొంతమంది కార్మికులు కారాలు మిరియాలు నూరుతున్నారు. 

ఇక.. ఆదివారం, డిసెంబర్ 1న  సీఎంతో జరిగే సమావేశానికి హాజరయ్యే కార్మికులను డిపో మేనేజర్లు, డివిజనల్‌ మేనేజర్లు ఎంపిక చేశారు. పలానా వారిని సమావేశానికి పంపిద్దాం అని సూచించే అవకాశం కూడా ఒక్క నేతకు దక్కలేదు. సంక్షేమానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి.. ఇంకా యూనియన్లతో పనేముంది అనే అభిప్రాయం కార్మికుల్లో కలిగే అవకాశం ఉంది. యూనియన్లు లేకుండా సమస్యలను ఎలా పరిష్కరిస్తానే అంశాలను కూడ కార్మికులకు కేసీఆర్ వివరించనున్నారు. అయితే… ప్రగతి భవన్ మీటింగ్‌పై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. యూనియన్లను బలహీనపరిచేందుకే ఇష్టాగోష్టి ఏర్పాటు చేశారంటున్నారు. మొత్తంగా… కార్మికులతో చర్చించిన తర్వాత… ఆర్టీసీ కార్మిక సంఘాల పాత్ర ఎలా ఉండబోతోంది. ఇప్పుడు ఇదే అంశం ఆసక్తికరంగా మారింది.