తీవ్ర విషాదం, నెల వ్యవధిలో ఒకే కాన్వెంట్‌కు చెందిన 13మంది నన్స్ కరోనాతో మృతి

  • Published By: naveen ,Published On : July 23, 2020 / 10:08 AM IST
తీవ్ర విషాదం, నెల వ్యవధిలో ఒకే కాన్వెంట్‌కు చెందిన 13మంది నన్స్ కరోనాతో మృతి

అమెరికా మిచిగాన్ లోని ఫెలీషియన్ సిస్టర్స్ కన్వెంట్ లో కరోనా కలకలం రేపింది. ఒకే కాన్వెంట్ కు చెందిన 13మంది సిస్టర్స్(నన్స్) ను పొట్టన పెట్టుకుంది. వీరిలో 12మంది సిస్టర్లు నెల రోజుల వ్యవధిలో కన్నుమూశారు. గుడ్ ఫ్రైడే రోజున సిస్టర్ మేరీ లూయిజా వావర్జినియాక్ కరోనాతో కన్నుమూశారు. ఆమె వయసు 99 ఏళ్లు. నెల ముగిసేసరికి మరో 11మంది కరోనాకు బలయ్యారు. మరో 17మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఓ సిస్టర్ జూన్ నెలలో కన్నుమూసినట్టు అవర్ లేడీ ఆఫ్ హోప్ ప్రావిన్స్ క్లినికల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ సీనియర్ నోయెల్ మేరీ గాబ్రియేల్ తెలిపారు.

సిస్టర్లు అందరూ కాన్వెంట్ లో చాలా కాలం నుంచి మెంబర్లుగా ఉన్నారు. అక్కడే నివసించే వారు. ప్రార్థనలు చేసేవారు. ఇతరులతో కలిసి పని చేశారు. రిటైర్మెంట్ కు ముందు వారంతా స్కూల్ టీచర్లుగా, ప్రొఫెసర్లుగా, ప్రిన్సిపాల్స్ గా, లైబ్రేరియన్స్ గా పని చేశారు.

సిస్టర్ మేరీ లూయిజా వావర్‌జినియాక్ స్థానిక మంత్రి దగ్గర పనిచేశారు. సిస్టర్ విక్టోరియా మేరీ ఇండిక్(69) నర్సింగ్ విద్యార్థుల కోసం ఫెలిసియన్ సిస్టర్స్ మిషన్‌ను నడిపించారు. సిస్టర్ రోజ్ మేరీ వోలాక్(86) వాటికన్ సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ లో కార్యదర్శిగా ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు. సిస్టర్ థామస్ మేరీ వాడోవ్స్కీ(73) క్యాంప్‌బెల్ సూప్ వాణిజ్య పోటీలో నాయకత్వం వహించారు.

కరోనాతో 13మంది నన్స్ మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నన్స్ మరణం తీరని లోటుగా అభివర్ణించారు. 1918 ఇన్ ఫ్ల్యూంజా తర్వాత ఈ స్థాయిలో నన్స్ చనిపోవడం ఇదే తొలిసారి. కరోనా దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా 61మంది ఫెలీషియన్ సిస్టర్స్ చనిపోయి ఉంటారని అంచనా. ఏప్రిల్ లో విస్కాన్ సిన్ లో లేడీ ఆఫ్ ఏంజిల్స్ కాన్వెంట్ లో ఆరు మంది సిస్టర్లు కొవిడ్ కారణంగా మృత్యువాతపడ్డారు. కరోనా తీవ్రత పెరగడంతో అప్రమత్తమైన సిబ్బంది, మార్చి నెల నుంచి కాన్వెంట్ లోకి సందర్శకులను రానివ్వడం లేదు. కరోనా కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేశారు. అయినప్పట్టకి కరోనా వైరస్ కాన్వెంట్ ని చేరింది. చాలా వేగంగా వ్యాపించింది. ఒకే కాన్వెంట్ కు చెందిన 13మంది సిస్టర్స్ ప్రాణాలు బలి తీసుకుంది.