UK Virus: రెండేళ్ల చిన్నారికి కరోనా ‘కొత్త స్ట్రెయిన్’

UK Virus: రెండేళ్ల చిన్నారికి కరోనా ‘కొత్త స్ట్రెయిన్’

2 years girl UK Corona new strain tests positive  in meerut : యూకే నుంచి ఇండియాకు వచ్చిన రెండేళ్ల పాప శాంపిల్స్‌లో యూకే కొత్త స్ట్రెయిన్ వైరస్ బైటపడింది. కానీ ఆ పాపకు సంబంధించిన మిగతా కుటుంబ సభ్యుల్లో మాత్రం కొత్త వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. ఇది కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అనే చెప్పాలి. యూకేనుంచి ప్రపంచ దేశాలకు శరవేగంగా వ్యాపిస్తున్న కొత్త కరోనా ‘స్ట్రెయిన్’ భారతదేశానికి కూడా పాకింది. దేశంలో స్ట్రెయిన్ కేసులు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. బ్రిటన్ నుంచి భారత్ వచ్చి 20మందికి కొత్త కరోనా స్ట్రెయిన్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది.

దీంతో భారత్ వాసుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చిన చాలామందికి పరీక్షలు చేయగా 20మందికి నిర్ధారణ అయ్యింది. పెండింగ్ లో ఉన్న రిపోర్టులు వస్తే కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. కొత్త కరోనా సోకిన వారిలో రెండేళ్ల పాప కూడా ఉంది. బ్రిటన్ నుంచి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన మీరట్ కు చెందిన రెండేళ్ల చిన్నారికి కొత్త కరోనా సోకింది.

పాత కరోనా చైనాలోని ఊహాన్ లో పుడితే కొత్త కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. యూకేలో పుట్టిన కొత్త స్ట్రెయిన్ ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. ఇప్పటికే మనదేశంలో పలువురు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా రెండేళ్ల బాలికకు కూడా యూకే వైరస్ నిర్ధారణ అయింది. మీరట్‌కు చెందిన ఓ ఫ్యామిలీ ఇటీవలే యూకే (బ్రిటన్) నుంచి ఇండియాలోని ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు తిరిగొచ్చింది.

వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అది కొత్త స్ట్రెయినా? కాదా ? అని తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఐతే ఆ కుటుంబంలోని రెండేళ్ల పాప శాంపిల్స్‌లో యూకే వైరస్ బయటపడింది. కానీ మిగతా కుటుంబ సభ్యుల్లో మాత్రం కొత్త వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. బాధితులు మీరట్‌లోని టీపీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు చెప్పారు.

కొత్త రాకతో మీరట్ అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. బాధితుల చుట్టు పక్కల పరిసరాలను సీల్ చేశారు. ఇంతకు ముందు మనదేశంలో ఆరు కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులోని NIMHANSలో మూడు, హైదరాబాద్ CCMBలో రెండు, పుణె NIVలో ఒక పాజిటివ్ కేసు నమోదయింది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఎప్పటిలాగే మాస్క్‌లు ధరించి.. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. అజాగ్రత్తగా ఉండడం ఎంత మాత్రమూ మంచిది కాదని చెబుతున్నారు.

వాక్సిన్ వస్తోంది.. కరోనా వైరస్ పీడ విరగడయింది.. అని అందరూ అనుకుంటున్న శుభసమయంలోనూ యూకేలో కొత్త రకం కోవిడ్ ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. సాధారణ వైరస్ కంటే 70శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త స్ట్రెయిన్ తో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌ నుంచి సంబంధాలను తెంచుకున్నాయి. విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేశాయి. యూకే తర్వాత పలు దేశాల్లోనూ కొత్త రకం కరోనా వైరస్ బయటపడుతోంది. దాంతో పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్ దిశగా వెళ్తున్నాయి. కొత్త వైరస్ నేపథ్యంలో భారత అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఆర్టీ పీీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వస్తే ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు. నెగెటివ్ వచ్చినా క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.