ఆరేళ్ల పాటు మిలియన్ల దూరం ప్రయాణించి భూమికి చేరిన ఆస్టరాయిడ్ శాంపుల్

ఆరేళ్ల పాటు మిలియన్ల దూరం ప్రయాణించి భూమికి చేరిన ఆస్టరాయిడ్ శాంపుల్

ఆరేళ్ల పాటు ప్రయాణం చేసి మిలియన్ల దూరం ప్రయాణించిన జపాన్ క్యాప్సుల్ సక్సెస్‌ఫుల్‌గా భూమి మీదకు చేరింది. ఆదివారం నిర్దేశించిన రీతిలో ఉత్తర ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల ప్రాంతంలో దిగిన ఈ వస్తువుని సైంటిస్టులు జాగ్రత్తలతో సేకరించారు. ఈ నమూనాల విశ్లేషణ ద్వారా సౌర కుటుంబం, భూమి ఆవిర్భావం వివరాలతోపాటు జీవం పుట్టుకకు సంబంధించిన కీలక అంశాల గురించి మరింత తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.

భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే ఆస్టరాయిడ్ నుంచి నమూనాల సేకరణకు జపాన్‌.. 2014లో హయాబుసా-2 స్పేస్‌షిప్‌ను ప్రయోగించింది. 2018లో ఆ ఖగోళవస్తువును చేరింది. ఏడాదిన్నరపాటు అక్కడే ఉన్న షిప్ కొన్ని పరిశోధనలు చేసి రియూగు ఉపరితలం, లోపలి పొరల నుంచి శాంపుల్స్‌ను సేకరించింది.



ఆ తర్వాత రిటర్న జర్నీకి సంవత్సర కాలం పట్టింది. ఈ నౌక 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే ఆస్టరాయిడ్ శాంపుల్స్‌తో కూడిన క్యాప్సూల్‌ను విడిచిపెట్టింది. ఆదివారం తెల్లవారుజామున.. భూవాతావరణంలోకి (120 కిలోమీటర్ల ఎత్తులో) ప్రవేశించింది. గాలి రాపిడి వల్ల తలెత్తిన వేడితో అది అగ్నిగోళంగా మారింది. ముందుగా ప్లాన్ ఊహించిన సైంటిస్టులు దానికి హీట్ గార్డ్ ఉంచడంతో సేఫ్ గా భూమి వైపుకు వచ్చింది.

భూమికి 10 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు క్యాప్సూల్‌లోని పారాచూట్‌ విచ్చుకొని, వేగాన్ని నిరోధించింది. ఆస్ట్రేలియాలోని ఉమెరాలో జనావాసాలు తక్కువ ప్రాంతంలో ఆదివారం ఉదయం ల్యాండ్‌ అయింది. దిగిన ప్రాంతాన్ని తెలియజేస్తూ జపాన్‌ శాస్త్రవేత్తలకు సంకేతాలు పంపింది.



ల్యాండింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు 70 మందికిపైగా జపాన్‌ సైంటిస్టులు కొద్దిరోజులుగా తీవ్రంగా శ్రమించారు. ఈ క్యాప్సూల్‌ వెడల్పు 40 సెంటీమీటర్లే. రెండు గంటలపాటు గాలింపు జరిపిన అనంతరం హెలికాప్టర్‌ బృందాలు సేకరించగలిగాయి. ఈ క్యాప్సూల్‌పై ఆస్ట్రేలియాలోని ఒక ల్యాబ్‌లో ప్రాథమిక భద్రతా తనిఖీలు నిర్వహిస్తారు. వచ్చేవారం దాన్ని జపాన్‌ తరలిస్తారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల జపాన్‌ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

క్యాప్సూల్‌ను భూ వాతావరణంలోకి విడిచిపెట్టేసిన హయాబుసా-2 మరో పనిమీద ప్రయాణిస్తుంది. పదేళ్ల పాటు ప్రయాణించి ‘1998కేవై26’ అనే గ్రహశకలాన్ని చేరుకుంటుంది. ఉల్కలు భూమిని ఢీకొట్టకుండా నిరోధించే విధానాలపై పరిశోధన సాగించే ప్రయత్నం ఇది.