Israel Palestine Conflict: ఇజ్రాయెల్ ప్రతిదాడికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గాజా.. అంత్యక్రియలూ కష్టమే అవుతున్నాయి
ప్రధాన మార్చురీ కంటే ఫ్రీజర్ ట్రక్కుల్లో మృతదేహాలను ఉంచే సామర్థ్యం ఎక్కువగా ఉందని, 20 నుంచి 30 మృతదేహాలను కూడా టెంట్‌లలో ఉంచుతున్నారని యాసర్ అలీ చెప్పారు.

Israel Palestine Conflict: హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడి అనంతరం మృతదేహాలు వీధుల్లో చిందరవందరగా ఉన్నాయి. గాజాలోని ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ మృతదేహాలను నిల్వ చేయడానికి ఆసుపత్రి మార్చురీలలో ఖాళీ స్థలం లేదని, అందువల్ల మృతదేహాలను ఐస్‌క్రీమ్ ఫ్రీజర్ ట్రక్కులలో ఉంచుతున్నామని చెప్పారు. నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్ వైమానిక దాడులలో మరణించిన పాలస్తీనియన్ల మృతదేహాలకు ఆసుపత్రులు లేదా శ్మశానవాటికలో స్థలం దొరకడం లేదు.
డెయిర్ అల్-బలాహ్‌లోని షుహదా అల్-అక్సా ఆసుపత్రికి చెందిన డాక్టర్ యాసర్ అలీ మాట్లాడుతూ, ఆసుపత్రి మార్చురీ కేవలం 10 మృతదేహాలను మాత్రమే ఉంచగలదని, అందువల్ల పెద్ద సంఖ్యలో మృతదేహాలను ఉంచడానికి, తాము ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీల నుంచి ఐస్ క్రీమ్ ఫ్రీజర్ ట్రక్కులను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ ట్రక్కులను సాధారణంగా సూపర్ మార్కెట్లలో డెలివరీ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు ఈ ట్రక్కులు హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య కొనసాగుతున్న వినాశకరమైన యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్లకు తాత్కాలిక శవాగారాలుగా మారాయి.
ప్రధాన మార్చురీ కంటే ఫ్రీజర్ ట్రక్కుల్లో మృతదేహాలను ఉంచే సామర్థ్యం ఎక్కువగా ఉందని, 20 నుంచి 30 మృతదేహాలను కూడా టెంట్‌లలో ఉంచుతున్నారని యాసర్ అలీ చెప్పారు. గాజా సంక్షోభంలో ఉందని, యుద్ధం ఇలాగే కొనసాగితే చనిపోయిన వారిని పూడ్చలేమని అన్నారు. పెరుగుతున్న మృతదేహాల కారణంగా గాజాలోని శ్మశానవాటికలు నిండిపోతున్నాయని అలీ అన్నారు. మృతదేహాలను పూడ్చేందుకు మరిన్ని శ్మశానవాటికలు కావాలని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: అధికారం అందుకే, మతంలో చెప్పిందీ అదే.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
అదే సమయంలో, గాజా నగరంలో సామూహిక సమాధులను అధికారులు సిద్ధం చేస్తున్నారని ప్రభుత్వ మీడియా కార్యాలయ అధిపతి సలామా మరూఫ్ చెప్పారు. అల్-షిఫా ఆసుపత్రి మార్చురీలో పెద్ద సంఖ్యలో మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు చేయడానికి బంధువులు రావడం లేదని ఆయన అన్నారు. దాదాపు 100 మృతదేహాలను ఖననం చేసేందుకు అత్యవసర శ్మశానవాటికలో సామూహిక సమాధిని సిద్ధం చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 2,300 మందికి పైగా మరణించారని, 10,000 మందికి పైగా గాయపడ్డారని గాజా అధికారులు వెల్లడించారు.