ఆస్ట్రాజెనె‌కా ‘కరోనా వ్యాక్సిన్’ 3వ దశ ట్రయల్స్ నిలిపివేత

  • Published By: venkaiahnaidu ,Published On : September 9, 2020 / 08:11 PM IST
ఆస్ట్రాజెనె‌కా ‘కరోనా వ్యాక్సిన్’ 3వ దశ ట్రయల్స్ నిలిపివేత

క‌రోనా వైరస్‌ ని కట్టడి చేసే వ్యాక్సిన్‌ కోసం దేశాలన్ని ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా’ స్పూత్నిక్‌ వి”పేరుతొ కరోనా వ్యాక్సిన్‌ ని అభివృద్ధి చేసి,మార్కెట్ లోకి కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మిశ్రమ స్పందన వెలువడింది.

ఇక, ప్రపంచ దేశాలన్ని ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌ మీదనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో షాకింగ్‌ న్యూస్‌ వెలుగు చూసింది. 3వ దశ ప్రయోగాలలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. భారత్ సహా పలు దేశాలలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ ని ప్రయోగిస్తుండగా… బ్రిటన్‌ లో ఆస్ట్రాజెనెకా టీకాను తీసుకున్న ఓ వాలంటీర్ తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడని గుర్తించారు. దీంతో తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ని తాత్కలింగా నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌యోగ ప్రామాణిక ప్ర‌క్రియ‌, వ్యాక్సిన్ భ‌ద్ర‌త‌పై పూర్తిస్థాయి స‌మీక్ష కోసం ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది


ఇప్పటికే రెండు దశల ట్రయల్స్‌ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్‌… మిగతావాటికంటే ముందుగా మార్కెట్‌లోకి రావడానికి అవకాశముందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు వస్తూనే ఉంటాయని, అలాంటి సందర్భాలలో పరీక్షలు నిలిపేయడం సహజమేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది

మరోవైపు, ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై ఫార్మా దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఆక్స్‌ఫ‌ర్డ్, ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ భారత్‌లో నిలిపి వేయలేదని వివరించింది. పరీక్షలు కొనసాగుతున్నాయనీ ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని సీరం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి బ్రిటన్లో ట్రయిల్స్ నిలిపివేసినా.. త్వరలోనే పునఃప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. అయితే భారత విషయానికి వస్తే ట్రయల్స్ ‌కు ఎలాంటి ఆటంకం లేదని పేర్కొంది. ఈ టీకాకు సంబంధించి మనదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.