భారత్‌పై చైనా మరో కుట్ర, దేశాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టాలని స్కెచ్

భారత్‌పై చైనా మరో కుట్ర, దేశాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టాలని స్కెచ్

china cyber attack on india: సరిహద్దుల్లో కవ్వింపులు మానని డ్రాగన్ కొత్త స్కెచ్ వేసింది. ఇండియాపై కనిపించని దెబ్బకొట్టేందుకు ప్లాన్ అమలు చేసింది. ఏకంగా సైబర్ దాడులకు తెగబడింది. విద్యుత్ వ్యవస్థపై చైనా టార్గెట్ చేసింది.

ఆయుధాలతో కాకుండా కనిపించని విధంగా దెబ్బకొట్టాలని ప్లాన్:
ఇండియాపై మొదట్నుంచి అక్కసు వెళ్లగక్కుతున్న చైనా బోర్డర్ లో కవ్వింపులకు పాల్పడుతోంది. సరిహద్దులను ఆక్రమిస్తుండగా భారత్ ధీటుగా జవాబిస్తోంది. ప్రతీ దాంట్లోనూ భారత్ పోటీకి వస్తుండటంతో కంటిలో నలుసుగా మారిన ఇండియాపై భారీ అటాక్ చెయ్యాలని చైనా స్కెచ్ వేసింది. ఆయుధాలతో కాకుండా కనిపించని విధంగా దెబ్బకొట్టాలని చూస్తూ కన్నింగ్ ప్లాన్ అమలు చేస్తోంది.

సంచలన విషయాలు బయటపెట్టిన అమెరికా సంస్థ:
లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్న సమయంలో.. భారత్‌ విద్యుత్‌ గ్రిడ్‌లపై సైబర్‌ దాడులు చేసి.. దేశాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టాలని చైనా ప్రయత్నించిందా? మన దేశాన్ని దిగ్బంధనం చేయాలనుకుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గతేడాది(2020) భారత్‌-చైనాల మధ్య నెలలపాటు నెలకొన్న ప్రతిష్టంభన కాలంలోనే భారత్‌ విద్యుత్‌ రంగంపై డ్రాగన్‌ సైబర్‌ దాడులకు పాల్పడిందంటూ అమెరికా సంస్థ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ సంచలన విషయాలను బయటపెట్టింది.

చైనా హ్యాకర్ల భారీ సైబర్ దాడి:
గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా హ్యాకర్లు భారీ సైబర్ దాడికి దిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12 భారత ప్రభుత్వ రంగ సంస్థల కంప్యూటర్ నెట్ వర్క్ లను చైనా అధికార సైబర్ గ్రూపులు టార్గెట్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ 12 సంస్థల్లో విద్యుత్ రంగానికి చెందినవే అధికంగా ఉన్నట్లు అమెరికాకు చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ అనే అధ్యయన సంస్థ వెల్లడించింది. దేశంలో అతిపెద్ద విద్యుత్ సంస్థ అయిన ఎన్టీపీసీతో పాటు విద్యుత్ డిమాండ్ సరఫరాను క్రమబద్దీకరించి పవర్ గ్రిడ్ ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే 5 ప్రధాన ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లపై సైబర్ దాడి జరిగింది.

ముంబైలో చీకట్ల వెనుక చైనా:
2020 మే లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఈ దాడి మొదలైంది. భారత్ లోని విద్యుత్ వ్యవస్థను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రత్యేకమైన మాల్ వేర్ ను ఆ సంస్థల సర్వర్ లలోకి చొప్పించారు. 2020 అక్టోబర్ 13న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యుత్ గ్రిడ్ విఫలమైంది. 2గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోడ్ డిస్పాచ్ సెంటర్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ముంబై నగరంలో బ్లాక్ ఔట్ సంభవించింది. రైళ్లు రద్దయ్యాయి.

ముంబై, థానే, నవీ ముంబైలలో ఆఫీసులన్నీ మూతపడ్డాయి. ఆసుపత్రులకు ప్రత్యేక ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. ముంబై శివారు ప్రాంతాల్లో ఏకంగా 12గంటల పాటు కరెంట్ పోయింది. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో ముంబైలో జనజీవనం స్థంభించిపోయింది. అప్పట్లో అది ఎందుకు జరిగింది అనేది తెలియనప్పటికి, దాని వెనుక చైనా హ్యాకర్లు ఉన్నారని ఆలస్యంగా బయటపడింది.

మే లో గల్వాన్‌ లోయలో ఘర్షణ చెలరేగితే.. ఆ తర్వాత నాలుగు నెలలకే ముంబైలో జరిగిన ఈ విద్యుత్‌ అంతరాయానికి సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికా సంస్థ అంటోంది. ఆ ఉద్రిక్తతల సమయంలో భారత పవర్‌గ్రిడ్‌పై సైబర్‌ నేరగాళ్లు గురిపెట్టారని, భారత్‌ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని ఓ సంకేతమివ్వడమే చైనా ఉద్దేశమని సదరు సంస్థ తెలిపింది.

మేడిన్ ఇన్ చైనా వల్లే సమస్య:
సరిహద్దుల నుంచి భారత్ వెనుకడుగు వేయకపోతే దేశమంతా అంధకారం నింపేసేలా చైనా ప్లాన్ చేసింది. అయితే చిన్న ఇబ్బందులతో అప్పట్లో సమస్య పరిష్కారం అయ్యింది. దీని వెనుక చైనా ఉందని తేలడంతో డ్రాగన్ ఇంకా ఏయే వ్యవస్థలను టార్గెట్ చేసిందోనన్న టెన్షన్ నెలకొంది. భారత్ విద్యుత్ వ్యవస్థలో వాడే ఎక్కువ పరికరాలు చైనా నుంచే వస్తున్నవి కావడం సమస్యకు మూలం అంటున్నారు నిపుణులు.