దేశంలో తయారైన మొదటి కరోనా వ్యాక్సిన్‌కి చైనా ఆమోదం

దేశంలో తయారైన మొదటి కరోనా వ్యాక్సిన్‌కి చైనా ఆమోదం

చైనా తన దేశంలో తయారైన మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగ ఫార్మా దిగ్గజం సినోఫార్మ్ ఈ వ్యాక్సిన్‌ని తయారు చేసింది. దేశంలో అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ ఇదే కాగా.. చైనా షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లుగా గురువారం(31 డిసెంబర్ 2020) అధికారిక ప్రకటన వచ్చింది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలిక ఫలితాల్లో టీకా 79.34 శాతం సామర్థ్యాన్ని మరియు 99.52 శాతం యాంటీబాడీ-పాజిటివ్ మార్పిడి రేటును చూపించినట్లుగా సినోఫార్మ్ ప్రకటనలో వెల్లడించింది.

సినోఫార్మ్అనుబంధ సంస్థ చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్(CNBG) బీజింగ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ ఇన్స్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ బుధవారం చైనా యొక్క నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ నుండి అధికారిక అప్రువల్ పొందింది. ఈమేరకు నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ హెడ్ చెన్ షిఫీ ఓ ప్రకటన చేశారు.

కరోనా కట్టడి కోసం అభివృద్ధి చేసిన తమ వ్యాక్సిన్‌ 79.3 శాతం ప్రభావంతో పనిచేస్తోందని చైనా సంస్థ సినోఫార్మ్‌ ప్రకటించింది. తుది దశ ప్రయోగ ఫలితాల ద్వారా ఈ విషయాన్ని చెబుతున్నట్లు స్పష్టం చేసింది. చైనాలో 10 లక్షల మందికి పైగా వైద్య సిబ్బంది, ఇతరులు ఇప్పటికే సినోఫార్మ్‌, సినోవాక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను వేయించుకున్నారు. ఆ వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్న సమయంలోనే అత్యవసర వినియోగం కింద వాటికి అనుమతులు వచ్చాయి. ఇప్పుడు ప్రజలకు కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది.