Chinese spy balloon: ముప్పు ఉండదని చెప్పినా కూల్చేస్తారా..? అమెరికాలో స్పై బెలూన్ కూల్చివేతపై ఘాటుగా స్పందించిన చైనా ..
అమెరికా గగనతలంలో చైనాకు చెందిన స్పై బెలూన్ కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు రోజుల తరువాత అమెరికా రక్షణశాఖ సముద్ర గగనతలంపై దానిని యుద్ద విమానం సహాయంతో కూల్చివేసింది. బెలూన్ కూల్చివేతపై చైనా తీవ్రంగా స్పందించింది. బెలూన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినా వినకుండా కూల్చేస్తారా? అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. అమెరికా అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించిందంటూ చైనా ఆగ్రహం వ్యక్తంచేసింది.

Chinese spy balloon: అమెరికా గగనతలంలో చైనాకు చెందిన స్పై బెలూన్ కలకలం రేపిన విషయం తెలిసిందే. దాదాపు మూడు బస్సుల పరిమాణం కలిగిన అతి పెద్ద బెలూన్‌ను తమ గగనతలంపై తిరుగుతుండటాన్ని అమెరికా గుర్తించింది. అయితే, దానిని తొలుత కూల్చివేయాలని భావించినప్పటికీ.. కూల్చివేస్తే ప్రజలకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనతో ఆ ప్రయత్నాన్ని అమెరికా విరమించుకుంది. గత రెండు రోజులుగా నిశితంగా స్పై బెలూన్‌ను ఆ దేశ మిలటరీ పరిశీలిస్తుంది. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ఆదేశాల మేరకు స్పై బెలూన్‌ను కూల్చివేశారు. యుద్ధ విమానాల సాయంతో ఆ బెలూన్‌ను అట్లాంటిక్ సముద్ర గగనతలంపైకి తీసుకొచ్చి పేల్చివేసినట్లు అమెరికా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Chinese spy balloon: చైనా స్పై బెలూన్ ను కూల్చేసిన అమెరికా
ఎఫ్-22 యుద్ధ విమానాన్ని వినియోగించి స్పై బెలూన్‌ను పేల్చివేశారు. దక్షిణ కాలిఫోర్నియా మార్టల్ బీచ్ ప్రాంతంలో ఈ బెలూన్ శకలాలు పడ్డాయి. వాటిని సేకరించేందుకు మిలటరీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. స్పై బెలూన్‌ను కూల్చడంపై చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికాకు గట్టి వార్నింగ్ సైతం ఇచ్చింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని అమెరికాను కోరినప్పటికీ, మా మాటను లెక్కచేకుండా స్పై బెలూన్‌ను కూల్చివేయటం సరైన నిర్ణయం కాదని చైనా పేర్కొంది. దీనిపై మా నిరసన తెలియజేస్తున్నామని, ఇలా చేయడం ద్వారా అమెరికా అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘించిందని చైనా పేర్కొంది.
Chinese spy balloon: అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్ కలకలం
అమెరికా గగనతలంపై స్పై బెలూన్‌ను గుర్తించిన కొద్దిగంటల్లోనే అది చైనాకు చెందిన బెలూన్ అని, దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదని మేం అమెరికాకు సూచించామని, అంతేకాదు, ఈ స్పై బెలూన్ వల్ల అమెరికాకు ఎలాంటి మిలిటరీ ముప్పు లేదని ముందే చెప్పామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. జనవరి 28న ఈ బెలూన్ అలాస్కాలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి జనవరి 30న బెలూన్ కెనడా గగనతలంలోకి ప్రవేశించింది. ఇదిలాఉంటే జనవరి 31న ఇది మళ్లీ కెనడా నుండి ఇడాహెు మీదుగా అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది. చైనా గూఢచర్య బెలూన్ ఎగురుతున్న మెటన్న ప్రాంతంలో అమెరికా అణు క్షిపణి క్షేత్రం ఉంది.
చైనాకు చెందిన స్పై బెలూన్ అమెరికా గగనతలంలో ఎగరడంతో చైనా పర్యటనకు వెళ్లాల్సిన అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తన పర్యటను అర్ధాంతరంగా వాయిదా వేసుకున్నాడు. ఇలాచేయడాన్ని చైనా తప్పుబట్టింది. అమెరికా గగనతలంపై తిరిగే చైనా స్పై బెలూన్ వల్ల ఎవరికీ హాని జరగదని చైనా ప్రకటన విడుదల చేసింది. ఈ బెలూన్ వాతావరణ పరిశోధనకు సంబంధించిందని, బలమైన గాలులు కారణంగా అది నిర్ణీత మార్గందాటి బయటకు వచ్చిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. అమెరికా మాత్రం చైనా విజ్ఞప్తిని కొట్టిపారేసింది. అమెరికా ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ఆదివారం ఆ బెలూన్‌ను అమెరికా మిలిటరీ కూల్చివేసింది.