కరోనా రోగులను పసిగట్టే శక్తి శునకాలకు ఉంది, స్టడీ

  • Published By: naveen ,Published On : July 29, 2020 / 08:40 AM IST
కరోనా రోగులను పసిగట్టే శక్తి శునకాలకు ఉంది, స్టడీ

విశ్వాసానికి మారుపేరు శునకాలు. పెంపుడు జంతవుల్లో మనిషికి అత్యంత విశ్వాసమైన ఈ జాగిలాలే.. కేసులు చేధించడానికి, బాంబులు కనిపెట్టడానికి పోలీసులకు ఉపయోగపడతున్నాయి. వాటికి మరింత ట్రైనింగ్ ఇస్తే కరోనాను కూడా పసిగడతాయని శాస్త్రవేత్తలు చెప్పడమే కాదు నిరూపించారు కూడా. స్నిప్పర్స్ డాగ్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో సక్సెస్ అయ్యారు.



ట్రైనింగ్ ఇస్తే కచ్చితత్వంతో కరోనా రోగులను గుర్తిస్తాయి:
కరోనా రోగుల్ని కచ్చితంగా గుర్తించాలంటే ఇప్పటివరకూ ఉన్న ఏకైక మార్గం టెస్టులు. అయితే ఆర్మీ కుక్కలు ఈ టెస్టులకు సమానమైన కచ్చితత్వంతో కరోనా బారిన పడ్డవారిని పట్టిస్తున్నాయి. జర్మనీకి చెందిన యూనివర్శటీ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌ జరిపిన అధ్యయనంలో ఈ కుక్కల సామర్థ్యం బయటపడింది.



8 కుక్కలకు శిక్షణ, 94శాతం కచ్చితత్వంతో కరోనా రోగులను గుర్తించాయి:
ఆర్మీకి చెందిన ఎనిమిది కుక్కలకు శాస్త్రవేత్తలు ముందుగా వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపు వెయ్యి మంది నుంచి సేకరించిన లాలాజలం(సలైవా) శాంపిళ్లను వాటి ముందు ఉంచారు. కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిళ్లు కూడా వీటిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆర్మీ శునకాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. కరోనా రోగుల నమూనాలను 94 శాతం కచ్చితత్వంతో గుర్తించాయి. జర్మన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సహకారంతో వెటర్నరీ మెడిసిన్ హన్నోవర్ యూనివర్సిటీ ఈ స్టడీ కండక్ట్ చేసింది. సరైన ట్రైనింగ్ ఇస్తే, సలైవా ద్వారా కరోనా రోగులను శునకాలు పసగడతాయని తెలుసుకున్నారు.

వాసనలు పసిగట్టే శక్తి కుక్కల్లో మనిషి కన్నా 10వేల రెట్లు ఎక్కువ:
వివిధ రకాల వాసనలను పసిగట్టే శక్తి మనుషుల్లో కంటే కుక్కల్లో వెయ్యి నుంచి 10వేల రెట్లు ఎక్కువని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఓ శాస్త్రవేత్త చెప్పారు. కరోనా రోగుల్లోని జీవ క్రియలు ఆరోగ్యవంతుల కంటే భిన్నంగా ఉంటాయని ఈ తేడాలను కుక్కులు వాసన ద్వారా సులువుగా గుర్తించగలవని ఆయన తెలిపారు. శునకాల బుర్ర చాలా పదునైందని, పలు రకాల వాసనలు పసిగట్టడంలో మనిషి బ్రెయిన్ కన్నా 40 రెట్లు ఎక్కువ అని చెప్పారు. యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. వివిధ రకాల రోగాల మధ్య వ్యత్యాసాన్ని శునకాలు కనిపెట్టగలవో లేదో తెలుసుకునేందుకు కొత్త ఆధ్యయనాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.


క్యాన్సర్, షుగర్, మలేరియా వంటి వ్యాధులను గుర్తించడానికి జాగిలాలను ఉపయోగిస్తున్నారు:
పూర్వం ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవులు, కుక్కలు పెంచుకునేవారు. కుక్కలు బాణం విసిరినట్లు తిన్నగా పరిగెడితే భూకంపం వస్తుందని పూర్వీకులు నమ్మేవారు. ముఖ్యంగా కుక్కలకు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి వాసన పసిగడితే దేన్నయినా ఇట్టే గుర్తించగలవు. ఈ ప్రత్యేకమైన లక్షణాలు కుక్కల్లో ఉండడంతో మనుషుల్లో క్యాన్సర్, షుగర్, మలేరియా వంటి వ్యాధులను గుర్తించడానికి వాటిని ఉపయోగిస్తున్నారు.

శునకాలకు ట్రైనింగ్ కోసం 5లక్షల డాలర్లు కేటాయింపు:
కాగా, ఇదో గొప్ప విషయంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. శునకాల ద్వారా చాలా వేగంగా కరోనా రోగులను గుర్తించడం ద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. 7 నెలలుగా ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి డాక్టర్లు, సైంటిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, లండన్, అమెరికా వంటి దేశాల్లో వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించడానికి స్నిప్పర్ డాగ్స్‌కు శిక్షణ ఇస్తున్నారు. బ్రిటన్ గవర్నమెంట్ ఏకంగా 5 లక్షల డాలర్లను కేటాయించింది. వారి శ్రమ, ప్రయత్నం వృథా కాబోదని కొత్త స్టడీ నిరూపించింది. కరోనా వైరస్ రోగులను పసిగట్టే శక్తి శునకాలకు ఉందని కొత్త స్టడీ నిరూపించడం వారిలో ఆనందం నింపింది.