మాస్క్ పై మాస్క్ వేసుకోవాలంటున్న అమెరికా నిపుణుడు

మాస్క్ పై మాస్క్ వేసుకోవాలంటున్న అమెరికా నిపుణుడు

double masking wearing : కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కులు కీలక పాత్ర పోషిస్తాయని మొదటి నుంచి వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే మాస్క్‌పై మాస్క్‌ ధరించడం వల్ల ఈ వైరస్‌ నుంచి మరింత రక్షణ లభిస్తుందని అమెరికా అంటువ్యాధులు నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. ఈ విధానాన్ని డబుల్ మాస్కింగ్ అంటారు. మీరు అప్పటికే ఒక మాస్కుతో ముఖాన్ని కప్పి ఉంచితే..దానిపై ఇంకో లేయర్ ఉండేలా చూసుకోండి. అది మరింత బాగా పని చేయనుందని ఫౌచీ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు వెలుగుచూస్తోన్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

మొదటి మాస్క్‌తో అక్కడక్కడా ఏవైనా ఖాళీలు మిగిలిపోతే, రెండో మాస్క్‌ వాటిని పూరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ విధానం వల్ల శ్వాసించేప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగదని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అయితే మాస్కుల్లో నాణ్యత తప్పనిసరని మరొకరు వివరించారు.  వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉన్న దగ్గర ఈ రెండు మాస్కులతో అవసరం ఉంది. బయటప్రదేశాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉన్న దగ్గర వాటి వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. మిగతాప్పుడు ఒక మాస్కు సరిపోతుందని ఆంటోనీ ఫౌచీ తెలిపారు.

సర్జికల్, క్లాత్‌ మాస్క్‌ను కలిపి ధరించడం వల్ల ఉపయోగం ఉంటుందన్నారాయన. ఇక…కరోనా టీకాల సామర్థ్యంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతున్నందున..రెండు మాస్కులు ధరించడమే మనముందు ఉన్న మంచి అవకాశమని కొద్ది రోజుల క్రితం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అభిప్రాయపడ్డారు.