Covid Cases In USA : అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ..ఫ్లోరిడాలో భారీగా కేసులు

అమెరికాలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది.

Covid Cases In USA : అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ..ఫ్లోరిడాలో భారీగా కేసులు

Usa

Covid Cases In USA అమెరికాలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో ఐదో వంతు ఫ్లోరిడాలోనే వెలుగుచూస్తున్నాయి. దీంతో ఈ రాష్ట్రం ఇప్పుడు అమెరికాలో కరోనాకు కేంద్ర బిందువుగా మారింది.

శనివారం ఫ్లోరిడా రాష్ట్రంలో 21,683 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయింది. వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఒకరోజు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. జనవరి 7న నమోదైన 19,334 కేసులే ఇప్పటివరకు అత్యధికంగా ఉన్నాయి. ఈవారంలో ఫ్లోరిడా రాష్ట్రంలో 409 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం వైరస్ మరణాల సంఖ్య 39 వేలు దాటింది. కాగా, గతేడాది ఆగస్టు నెలలో ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక్క వారంలోనే 1266మంది కోవిడ్ తో చనిపోయిన విషయం తెలిసిందే.

మరోవైపు, ఫ్లోరిడా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. ప్రజలు ఫేస్ మాస్క్ ధరించడం,వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అన్న నిబంధనలు విధించడంపై రిపబ్లికన్ పార్టీకి చెందిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసెంటిస్ వెనకడుగు వేస్తున్నారు. కరోనా నియంత్రణకు ఆంక్షలు విధించే జిల్లా యంత్రాంగాల అధికారాలకు కోత విధించారు. వచ్చే నెల నుంచి స్కూల్స్ ప్రారంభించనున్న నేపథ్యంలో.. విద్యార్థులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. సీజన్ మార్పుల వల్లే కేసులు పెరుగుతున్నాయని గవర్నర్ డిసాంటిస్ చెబుతున్నారు. వేడి వాతావరణం వల్ల ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారని, ఏసీల ద్వారా వైరస్ వ్యాపిస్తోందని తెలిపారు.

ఇక, శనివారం అమెరికా వ్యాప్తంగా 51,898 కోవిడ్ కేసులు,241 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కోవిడ్ తో మృతి చెందినవారి సంఖ్య 629,315గా ఉండగా, మొత్తం కేసుల సంఖ్య 3,57,45,024కి చేరింది. కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 29,666,117కి చేరింది.