సముద్రంలో కూలిన విమానం : 62 మంది గల్లంతు, కుటుంబసభ్యుల్లో ఆందోళన

సముద్రంలో కూలిన విమానం : 62 మంది గల్లంతు, కుటుంబసభ్యుల్లో ఆందోళన

Indonesian plane : ఇండోనేషియాకు చెందిన ఎయిర్‌ బోయింగ్‌-737 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లో విమానం జావా సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 56 మంది ప్రయాణికులతో సహా..మొత్తం 62 మంది ఉన్నారు. విమాన శకలాలు సముద్రంలో కనపించడంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

62 మందితో :-
62 మందితో జకార్తాలోని సూకర్నో-హట్టా విమానాశ్రయం నుంచి బయలుదేరిన బోయింగ్‌ 737-500 విమానం అరగంట తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. రాడార్ డేటాబాక్స్ ప్రకారం మధ్యాహ్నం 1.56 గంటలకు జకార్తా నుంచి బయలుదేరిందని.. మధ్యాహ్నం 2.40 గంటలకు కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై నేషనల్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది.

సెర్చ్ ఆపరేషన్ :-
విమానంలో 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 62 మంది ఉన్నారు. కాలిమంటన్ నుంచి పోంటియానక్‌కు వెళ్లే దిశలోనే విమానం కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. జకార్తా నుంచి పోంటియానక్‌ వెళ్లేందుకు 90 నిముషాల సమయం పడుతుందని విమానయాన సంస్థ తెలిపింది. అదృశ్యమైన ఈ విమానం జాడను కనుగొనేందుకు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

జావా సముద్రంలో :-
మరోవైపు ఈ విమానం జావా సముద్రంలో కూలినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.. థౌజండ్ ద్వీపాల్లో విమాన శకలాలను జాలర్లు గుర్తించారు.. అవి విమానానికి చెందినవేనని అనుమానిస్తున్నారు.. విమానం జాడ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు శ్రీవిజయ విమానయాన సంస్థ తెలిపింది. ఇక అదృశ్యమైన విమానం 27 ఏళ్ల నాటిదిగా గుర్తించారు..

ప్రమాదాలు :-
2018 అక్టోబర్‌ 29న ఇండోనేషియాలోని లయన్‌ ఎయిర్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానం జకార్తాలో టేకాఫ్‌ అయిన 12 నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో విషాదం నింపింది. ఎక్కువ రద్దీకి తోడు మౌలిక వసతులు సరిగా లేకపోవడం, భద్రతా ప్రమాణాలు కూడా పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.