జానపదాల పులకరింత..మట్టి పాటల మహిళా మణిపూస కనకవ్వ..

జానపదాల పులకరింత..మట్టి పాటల మహిళా మణిపూస కనకవ్వ..

Women’s Day Kanakavva Special : 64ఏళ్ల వయస్సులో మట్టి పాటల జాతరలా యూట్యూబ్ లో సంచలనాలు రేపుతోంది పల్లెటూరి మహిళా మణిపూస కనకవ్వ. ఆమె గొంతు ఎత్తి పాడితే మట్టి పరిమళాలు మనస్సును కమ్మేస్తుంది. కనకవ్వ పాడిన మేడారం జాతర పాటు కనకవ్వ జీవితాన్ని మార్చేసింది..64 ఏండ్ల వయస్సులోనూ కనకవ్వ నేటికీ చాలా ఉత్సాహంగా ఉంటారు. భర్తతో కలిసి తనకున్న కొద్దిపాటి పొలంలో స్వయంగా వ్యవసాయం చేస్తారు. పొలం పనులు చేసుకుంటూ కూడా కనకవ్వ పాడే పాటలకు ప్రకతిసైతం పులకించి పోతుంది. కమ్మగా పాడే కోయిలమ్మ కూడా కనకవ్వ పాటల్ని శ్రద్ధంగా వింటుంది. జానపద పాటలను తల్లి దగ్గరే నేర్చుకున్నారామె. అమ్మ పాడుతుంటే అలవోకగా ఆ పాటల్ని నేర్చేసుకున్నారు కనకవ్వ. చిన్నతనంలో కూలీ పనులకు వెళ్లిన సమయంలో తోటికూలీలు పాడుతుంటే గొంతుకలిపేది.

‘సమ్మక్క సారక్క వీరుల జాతరా.. మన మేడారంలో అడవివాసుల అమరుల జాతరా.. మూలవాసుల మన్నెం జాతర.. మన మేడారంలో పచ్చని అడవిలో పవిత్ర జాతర’ అంటూ సాగే పాట యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఊపేసింది. ఆరుపదుల వయస్సు దాటిన ఓ జానపద గాయకురాలు తమ స్వరకంఠంతో 16వ శతాబ్దానికి చెందిన అడవి దేవతలను కీర్తిస్తూ పాడిన పాటతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. 60 ఏళ్లలో ఏం చేస్తాంలే అనుకునేవారికే కాదు యువతకు కూడా కనకవ్వ స్ఫూర్తి అనటం ఎటువంటి అతిశయోక్తి లేదు.

గొట్టె కనకవ్వ. 64ఏళ్ల వయసులో జానపద పాటలు పాడుతూ యూట్యూబ్ ని ఉర్రూతలూగిస్తోంది. కనకవ్వ పాటలకు యూబ్యూట్‌లో మిలియన్ల వ్యూస్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. ఆమె పాటు యూట్యూబ్ లో వచ్చిదంటే చాలు ఇక వ్యూస్ వర్షమే కురుస్తుంది.

వ్యవసాయమే కుటుంబం..గానమే ఆమె ప్రాణం..
కనకవ్వ సొంతూరు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్ధిపేటలోని అక్కన్నపేట మండలంలోని బొడిగేపల్లి గ్రామం. చిన్నప్పటినుంచీ కనకవ్వ జానపద గీతాలను అలవోకగా అద్భుతంగా పాడేది. పంట పోలాలు, గ్రామ పరిసరాల్లో తన సోదరితో కలిసి జానపద పాటలను అద్భుతంగా పాడుతున్న సమయంలో కొంతమంది యువకులు ఆమె పాడిన పాటల్ని వీడియోలను రికార్డు చేసి టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలకు వచ్చిన ఆదరణ అంతాఇంతా కాదు.

కనకవ్వ పాటలకు రికార్డుల వాన కురవాల్సిందే..
కనకవ్వను జానపద సహజ గాయిని. ఆమె గొంతెత్తి పాడితే మట్టి పరిమళాలు గుభాళిస్తాయి. తన తల్లి నుంచి నేర్చుకున్న చరిత్ర పాఠాలను ఆమె పాటల రూపంలోకి గొంతెత్తి పాడతారు. ఒక్క మేడారం పాటే కాదు..ఆమె పాడిన పాటల్నీ హైలెట్టే. చక్కటి రికార్డులనే సొంతం చేసుకున్నాయి. వాటిలో ప్రధానంగా ‘గిన్నె రామా, గిన్నె రామా’ అనే పాట అత్యద్భుతం. మంచి స్పందన వచ్చింది. మేడారం జాతర ప్రత్యేక పాటను చింతమళ్ల యాకయ్య(యశ్‌పాల్) రచించిన సాహిత్యం ఒక ఎత్తయితే.. కనకవ్వ వాయిస్ పాటకు అదనపు మైలేజీని తీసుకొచ్చిందంటే అతిశయోక్తి కాదు.

ఆడుతూ పాడుతూ పొలం పనులు చేస్తూ కనకవ్వ పాటలు
పాటలను పాడటమంటే నాకు ఎంతో ఇష్టం..పాటలు పాడుతుంటే సమయం తెలియదు..అలసటా తెలియదు అంటోందీ 64 ఏళ్ల కనకవ్వ. కనకవ్వ పాటలు తెలంగాణలోని ప్రతి పల్లెనా వినిపిస్తాయి. ఆనందాలు పంచుతాయి. ఆడి నెమలీ మాటలకు గంగధారి, గొబ్బియల్లో గొబ్బియల్లో పాటలతో పాటు హైదరాబాద్ మహానగరం, సంక్రాంతి 2021 పాటలు కూడా యూట్యూబ్ లో వైరల్‌గా మారాయి. అలా కనకవ్వ గొంతు మట్టి పరిమళాలు మరింతగా విస్తరించాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుందాం..