Telangana Assembly : పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.

Telangana Assembly
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండో రోజు (ఆదివారం) సమావేశాల్లో భాగంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చజరిగింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇదిలాఉంటే.. సభ ప్రారంభమైన వెంటనే మున్సిపల్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Also Read: ZPTC MPTC elections : జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల
తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ జరిగింది. చర్చ జరుగుతున్నందుకు ఆర్డినెన్స్ కుదరదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ చట్టం తెచ్చినట్లు చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొన్నారు. దీనికోసమే ఈ బిల్లు తెచ్చినట్లు తెలిపారు. అయితే, చర్చ అనంతరం మున్సిపల్ చట్టసవరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. దీంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశముంది.
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ బిల్లు తెచ్చామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు బీఆర్ఎస్ తరపున స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే, బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలని అన్నారు. బలహీన వర్గాల గురించి ఇప్పుడే మాట్లాడటం లేదు.. గతంలో కూడా బీసీల కోసం కేసీఆర్ గట్టిగా మాట్లాడారని అన్నారు. కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ పెట్టాలని ప్రధాని దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ గా బీసీలను చేశాం. బీసీ బిల్లులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉందని అన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి.. బీసీలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్ బిల్లును తెచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతుంది. గతంలో బీసీ బిల్లుకు బీఆర్ఎస్ చిత్తశుద్దితో కృషి చేసిందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఐదు మంది బీసీలను రాజ్యసభకు పంపించిందని చెప్పారు.
చర్చ అనంతరం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభలో అల్లోపతిక్ మెడికల్ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు.