Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌ ఇండియా టూర్ రద్దైందా..? ఎందుకు రద్దు చేసుకున్నారు.. అసలు కారణం ఏమిటంటే..

డొనాల్డ్ ట్రంప్ ((Donald Trump) ఈ ఏడాది ఇండియాలో జరిగే క్వాడ్ సమిట్‌కు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఈ టూర్‌ను ట్రంప్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌ ఇండియా టూర్ రద్దైందా..? ఎందుకు రద్దు చేసుకున్నారు.. అసలు కారణం ఏమిటంటే..

Donald Trump

Updated On : August 31, 2025 / 8:01 AM IST

Donald Trump : అమెరికా, భారతదేశం మధ్య సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు తరువాత ఇరు దేశాల మధ్య దూరం క్రమంగా పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఇండియాలో జరిగే క్వాడ్ సమిట్‌కు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఈ టూర్‌ను ట్రంప్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్, మోదీ బంధం బెడిసిందంటూ న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది.

Also Read: Modi Xi Jinping Meet: ఏడేళ్ల తర్వాత చైనాలో ప్రధాని మోదీ.. రేపే జిన్ పింగ్ తో కీలక భేటీ.. పుతిన్ తోనూ సమావేశం..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మరోవైపు భారతదేశం పట్ల ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా భారత్ – పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు భారతదేశంను ఒప్పించానని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఈ పరిణామాలు ప్రధాని నరేంద్ర మోదీకి ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ట్రంప్ వ్యవహారశైలి పట్ల, ఆయన తీరుపట్ల మోదీ సహనం కోల్పోతున్నారని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ పరిణామాలు క్రమంగా భారత్, అమెరికా సంబంధాలను దెబ్బతీస్తున్నాయని చెప్పుకొచ్చింది.

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు భారతదేశంను ఒప్పించానని ట్రంప్ పదేపదే చెప్పుకోవడం, రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై భారీగా టారిఫ్‌లు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఎస్ సీవో సమిట్ కోసం చైనాలో పర్యటిస్తున్నారు. రష్యాకు ఇండియా మరింత దగ్గరవుతుండగా.. చైనాతోనూ సంబంధాలను మెరుగుపర్చుకుంటోంది. అందుకే ట్రంప్ ఇండియా టూర్ ను రద్దు చేసుకుని ఉంటారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

గత కొన్ని నెలలుగా జరిగిన పరిణామాలతో మోదీ, ట్రంప్ మధ్య బంధం బలహీనం అయిందని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ట్రంప్ టూర్ రద్దు విషయం ప్రెసిడెంట్ షెడ్యూల్ నిర్వహించే వర్గాల ద్వారా తెలిసిందని వివరించింది. అయితే, న్యూయార్క్ టైమ్స్ కథనంపై ఇటు ఇండియా గానీ, అటు అమెరికా గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.