హిందువులకు క్షమాపణ చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడు

  • Published By: venkaiahnaidu ,Published On : July 28, 2020 / 06:12 PM IST
హిందువులకు క్షమాపణ చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడు

ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెతాన్యూహు పెద్ద కుమారుడు య‌యిర్(29) నెతాన్యూహూ హిందువుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాయిర్ ఇటీవల చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది.

ఆ ట్వీట్ లో ఆయన భారతీయుల ఇష్టదైవం దుర్గామాత ముఖం స్థానంలో… నెతన్యాహు అవినీతి కేసుల్లో ప్రాసిక్యూటర్ గా వ్యవహరిస్తున్న లియత్ బెన్ ఆరి ముఖాన్ని ఉంచి పోస్టు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అనేక అవినీతి ఆరోపణలు రాగా, వాటిపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే యాయిర్ దుర్గామాత ట్వీట్ చేశారు.

అయితే దీనిపై భారత్ నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందనలు వచ్చాయి. వెంటనే తప్పు తెలుసుకున్న యాయిర్ క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశారు.

ఇజ్రాయెల్ రాజకీయ నేతలను ఉద్దేశించి ఓ సెటైరికల్ పేజీలో మీమ్ పోస్ట్ చేశాను. ఆ మీమ్ లో ఉన్నది భారతీయుల దేవత అని, ఎంతోమందికి ఆమె ఆరాధ్య దేవత అని తెలుసుకోలేకపోయాను. కానీ భారత మిత్రుల నుంచి వచ్చిన సందేశాలతో నిజం తెలుసుకున్నాను. వెంటనే ఆ ట్వీట్ తొలగించాను. నన్ను క్షమించండి అంటూ వినమ్రంగా స్పందించారు.