అందమైన దేశం అలా : ఇటలీలో 10వేలు దాటిన కరోనా మరణాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2020 / 01:16 PM IST
అందమైన దేశం అలా : ఇటలీలో 10వేలు దాటిన కరోనా మరణాలు

6కోట్ల జనాభా ఉన్న ఇటలీని కరోనా కాటు వేసింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశం ఇటలీనే. ఇటలీలో కరోనా సోకిన వారి సంఖ్య కూడా రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. ఒకరోజు 600మంది చనిపోతే,మరో రోజు 700మంది,మరోరోజు 800మంది అలా ఇటలీలో మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర ఇటలీలో కరోనా కేసుల సంఖ్య,మరణాల సంఖ్య భారీగా ఉంది.

ఇప్పటివరకు ఇటలీలో 92వేల 472 కరోనా కేసులు నమోదయ్యాయి. 12వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇటలీ తర్వాత ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశం స్పెయిన్. స్పెయిన్ లో దాదాపు 6వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక వైరస్ కారణంగా చైనాలో 3వేల 300మంది ప్రాణాలు కోల్పోగా, ఇరాన్ లో 2వేల 517మంది, ఫ్రాన్స్ లో 2వేల 314మంది, అమెరికాలో 2వేల 227మంది, బ్రిటన్ 1,019మంది ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాలో అయితే కేసుల సంఖ్య,మరణాల సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 6లక్షల 63వేల 748మందికి కరోనా సోకగా,30వేల 880 మంది కరోనాతో చనిపోయారు. లక్ష 42వేల 184మంది కరోనా నుంచి కోలుకున్నారు .199 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.

దాదాపు 1000మంది భారతీయులకు కరోనా సోకగా,25మరణాలు నమోదయ్యాయి. మనదేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 86మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, 24 గంటల్లో 6 రాష్ట్రాల్లో 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం(మార్చి 29,2020) చెప్పింది.