India: భారత్‌పై దాడులకు ప్లాన్.. ఉగ్రవాదులు విడుదల.. నిఘావర్గాల హెచ్చరిక

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం రావడంతో ఉగ్రవాదులు మళ్లీ పెట్రేగిపోతున్నారు.

India: భారత్‌పై దాడులకు ప్లాన్.. ఉగ్రవాదులు విడుదల.. నిఘావర్గాల హెచ్చరిక

Jaish E

Jaish-e Attack India: అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం రావడంతో ఉగ్రవాదులు మళ్లీ పెట్రేగిపోతున్నారు. అఫ్ఘాన్‌లో రక్తపాతం సృష్టించిన టెర్రరిస్టులు ఇపుడు భారత్‌పై కన్నేశారు. తాలిబన్ల అండ చూసుకుని.. కశ్మీర్‌ను అల్లకల్లోలం చేయాలనుకొంటోంది జైష్-ఏ-మొహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ. జైష్-ఏ-మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్ తాలిబన్‌ నేత ముల్లా బరాదర్‌తో భేటి కావడం ఇందుకు బలం చేకూరింది. కాబూల్‌ నుంచి ఉగ్రవాదులను సరిహద్దుల్లో దింపుతోంది.

అఫ్ఘానిస్తాన్‌లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులు ఇపుడు భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. జైష్‌-ఎ-మహమ్మద్ మసూద్ అజహర్- తాలిబన్‌ నేత ముల్లా బరాదర్‌ను కలుసుకున్నారు. ఆగస్ట్‌ 17-19 తేదిల మధ్య అఫ్ఘానిస్తాన్‌లోని కాందహార్‌లో వీరు సమావేశం అయ్యారు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ వీరి భేటి నిర్వహించింది. భారత్‌పై దాడులే లక్ష్యంగా జైష్‌-ఎ-మొహమ్మద్‌ ప్లాన్‌ చేసింది. కశ్మీర్‌లో ఆపరేషన్‌కు మద్దతు ఇవ్వాలని తాలిబన్‌ నేత ముల్లా బరాదర్‌ను మసూద్ అజహర్ కోరినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా అఫ్ఘానిస్థాన్‌ జైలులో మగ్గుతున్న 100 మంది జైషే ఉగ్రవాదులను తాలిబన్లు రిలీజ్ చేశారు. వీరంతా తమ సొంతగూటికి చేరుకున్నారు. భారత్‌పై దాడులకు ప్లాన్‌ చేస్తున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులు ముందుగా జమ్ముకశ్మీర్‌ను టార్గెట్‌ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. ఆ తర్వాత JEM దేశంలోని ఇతర ప్రాంతాలలో దాడులు చేసే విధంగా ప్రణాళిక రచిస్తోంది. జైష్‌-ఎ-మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ ద్వారా దాడుల విషయం వెలుగులోకి వచ్చింది.

అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల విజయాన్ని ప్రేరణగా తీసుకుని జమ్ముకశ్మీర్‌ను వశపరచుకోవాలని ప్లాన్‌. ఇందుకోసం కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. అఫ్ఘాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత పాకిస్తాన్‌ బలగాలకు మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాట్లకు మరింత మద్దతు లభించనుంది. దీంతో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అయితే భారత్‌ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది. జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఈ సంవత్సరం జైష్‌-ఎ-మొహమ్మద్‌కు చెందిన చాలామంది ఉగ్రవాదులను హతమార్చాయి. జైషేకు చెందిన పాక్‌ కమాండర్‌ మహ్మద్‌ ఇస్మాయిస్, అబ్దుల్‌ రషీద్‌ గాజీలను జులైలో హతమార్చడం ద్వారా బలగాలు విజయం సాధించాయి. వీరిద్దరు కశ్మీరీ యువతను జైషే సంస్థలో చేర్పించేందుకు కృషి చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇకపై వచ్చే ముప్పును భద్రతా దళాలు ఎలా ఎదుర్కొంటాయనే దానిపై కశ్మీర్‌లో శాంతి ఆధారపడి ఉంది.