Ukraine Russia War : యుక్రెయిన్ – రష్యా యుద్ధంలో కీలక పరిణామం

కీలకమైన పోర్ట్ సిటీ మరియుపోల్‌ పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది రష్యా. అజోవ్‌ స్టీల్‌ ప్లాంట్‌ మినహా నగరమంతా తమ చేతుల్లోనే ఉందని రష్యా ప్రకటించుకుంది.

Ukraine Russia War : యుక్రెయిన్ – రష్యా యుద్ధంలో కీలక పరిణామం

Ukraine Russia War : 57 రోజుల బాంబుల వర్షం.. 10వేల మంది పౌరుల దుర్మరణం.. దాదాపు 100శాతం శిథిలమైపోయిన నగరం.. యుద్ధం మొదలైన దగ్గర నుంచి మరుభూమిగా మారిపోయిన మరియుపోల్‌ను ఎట్టకేలకు రష్యా స్వాధీనం చేసుకుంది. యుక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా పైచేయి సాధించింది. మరియుపోల్‌కు యుక్రెయిన్‌ నుంచి విముక్తి కల్పించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. కీలకమైన పోర్ట్ సిటీ మరియుపోల్‌ పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యా.. ఇక డాన్‌బాస్‌పై పూర్తిగా ఫోకస్‌ చేయనుంది. అజోవ్‌ స్టీల్‌ ప్లాంట్‌ మినహా నగరమంతా తమ చేతుల్లోనే ఉందని రష్యా ప్రకటించుకుంది. నాలుగు రోజుల్లో అజోవ్‌ స్టీల్ ప్లాంట్‌ను పుతిన్‌ స్వాధీనం చేసుకుంటామన్నారు. స్టీల్‌ ప్లాంట్‌లోనే ఇంకా 2వేల మంది యుక్రెయిన్‌ సైనికులు ఉన్నట్లు సమాచారం.

అయితే స్టీల్‌ ప్లాంట్‌పై దాడి చేయకుండా నగరం మొత్తం మోహరించాలంటూ తమ సైన్యానికి పుతిన్‌ ఆదేశించారు. ఈగ కూడా బయటకు వెళ్లకుండా నగరం బ్లాక్‌ చేయాలన్నారు పుతిన్‌. అయితే నగరంలోనే ఇంకా దాదాపు లక్ష మంది పౌరులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇక కీలకమైన పోర్ట్ సిటీని రష్యా ఆక్రమించుకోవడంతో ఇంకా నగరంలోనే ఉండిపోయిన ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై యుక్రెయిన్‌ సైనికులు దృష్టి సారించారు. వృద్ధులు, మహిళలు, పిల్లల తరలింపునకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారిని జపోరిజిజియాకు పంపించనున్నారు. ఆ ప్రాంతం సురక్షితంగా ఉండడంతో పాటు అక్కడ ఆహారం, మందులు, తాగునీరు లభిస్తుందని మరియుపొల్‌ మేయర్‌ తెలిపారు. అయితే మరియుపోల్‌ను పూర్తిగా దిగ్బందించిన రష్యా.. పౌరుల తరలింపును అడ్డుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

TATA Steel: యుక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్యాన్ని నిలిపివేసిన టాటా స్టీల్

ఈ 57 రోజుల యుద్ధంలో రష్యాకు మిగిలిన నగరాలు ఒక ఎత్తైతే.. మరియుపోల్‌ మరో ఎత్తు..! క్రిమియాతో మిగిలిన యుక్రెయిన్‌ నగరాలను కలిపే ప్రాంతమిది. అందుకే రష్యా మొదటి నుంచి మరియుపోల్‌నే టార్గెట్‌ చేసింది. ఒకప్పుడు నిత్యం వెలుగుల కాంతులతో మెరిసిపోయిన మరియుపోల్‌లో ఇప్పుడు చీకటి రాజ్యమేలుతోంది. ఈ 57రోజుల యుద్ధం.. ఎడతెగని విషాదాన్ని నింపింది. ఒకప్పుడు మనుషులు స్వేచ్ఛగా తిరిగిన వీధులు ఇప్పుడు భయాంకరంగా కనిపిస్తున్నాయి. ప్రతిఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షించే మరియుపోల్‌లో రష్యా దురాక్రమణ దారుణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే 10వేల మంది పౌరులు బాంబు దాడులు,కాల్పుల్లో మరణించగా.. అనేక కట్టడాలు నేలమట్టమయ్యాయి. దాదాపు మూడున్నర లక్షల మంది వలసబాట పట్టారు. మరో లక్ష మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి రష్యా సైనికులు అది కూడా అందినివ్వకుండా చేస్తున్నారు. సాయం చేసే చేయి లేక.. ఆపదలో ఆదుకునే తోడులేక నిర్జీవంగా మారిపోయింది. రష్యా దాడులతో దాదాపు 100శాతం శిథిలమైపోయింది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా మరియుపోల్‌ను తిరిగి నిర్మించడం సాధ్యం కాదని ఇప్పటికే అధికారులు తేల్చేశారంటే అక్కడ విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకొవచ్చు..!

Warrior Dog : యుక్రెయిన్‌తో రష్యా వార్ లో వారియర్‌గా మారిన కుక్క..వేలమంది ప్రాణాలను కాపాడింది

అటు మరియుపొల్‌లో రోజుల తరబడి పోరాడుతున్న యుక్రెయిన్‌ దళాలు విసుగెత్తిపోయి చేతులేత్తాశాయి. తమకు ఇవే చిట్టచివరి రోజులయ్యేలా ఉన్నాయనీ, కొన్ని గంటలు, మహా అయితే కొన్ని రోజులకు మించి పోరాడలేమని యుక్రెయిన్‌ కమాండర్‌ మేజర్‌ వొలీనా చెప్పిన కొన్ని గంటలకే మరియుపోల్ రష్యా స్వాధీనంలోకి వెళ్లిపోయింది. ఇక యుద్ధం మొదలైన తర్వాత ఒక్క మరియుపోల్‌లోనే 14వందల మంది యుక్రెయిన్‌ సైనికులను మట్టుబెట్టామని రష్యా ప్రకటించింది. మరియుపోల్‌ స్వాధీనంతో రష్యా సైన్యాన్ని పుతిన్‌ అభినందించారు.