North Korea : ఉత్తర కొరియాలో కీలక మార్పులు..కిమ్ సోదరికి అధ్యక్ష బాధ్యతలు?

ఉత్తరకొరియా ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్..తన సోదరికి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ కి సలహాదారుగా

10TV Telugu News

North Korea ఉత్తర కొరియా ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్..తన సోదరికి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ కి సలహాదారుగా ఉన్న ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కి తాజాగా ప్రమోషన్ లభించింది. ఇటీవల జరిగిన సుప్రీం పీపుల్స్​ అసెంబ్లీ( రబ్బర్ స్టాంప్ పార్లమెంట్)సమావేశాల్లో.. కిమ్​ నేతృత్వంలోని దేశ వ్యవహారాల కమిషన్​ సభ్యురాలుగా ఆయన సోదరి కిమ్​ యో జోంగ్​ను ఎన్నుకున్నారు. తాజా నియామకంతో..ఇకపై దేశం తీసుకునే కీలక నిర్ణయాలపై ఇక నుంచి కిమ్ యో జాంగ్ ముద్ర ఉండనుంది. ఇప్పటికే.. వర్కర్స్​ పార్టీ సీనియర్​ నేతగా దక్షిణ కొరియాతో సంబంధాలను చూస్తున్న ఆమెకు ప్రస్తుతం మరో బాధ్యత అప్పగించటంతో.. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వంలో తమ కుటుంబ సభ్యుల పాత్ర ఉండాలని కిమ్​ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కిమ్ యో జోంగ్ కూడా తన అన్న కిమ్ జోంగ్ ఉన్ తో కలిసి స్విట్జర్లాండ్ లోని స్కూల్ లో చదువుకున్న విషయం తెలిసిందే.

ఇక కిమ్ యో జాంగ్‌కు సహాయం చేసేందుకు మరో ఏడుగురిని కూడా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియమించారు. గురువారం ఎనిమిది మందితో కూడిన లిస్ట్‌ ప్రకటించగా.. అందులో యంగ్‌ అండ్‌ ఓన్లీ ఉమెన్‌గా చోటు సంపాదించుకుంది కిమ్‌ యో జోంగ్‌. అయితే కమిషన్‌లో ఇంతకు ముందున్న తొమ్మిది మంది సభ్యుల్ని అర్థాంతరంగా తొలగించింది నార్త్‌ కొరియా స్టేట్‌ అసెంబ్లీ. 9 మంది కీలక వ్యక్తుల్లో కొందరు రిటైర్ కాగా మరికొందరిని కిమ్ జాంగ్ ఉన్ తప్పించారు. తప్పించిన వారిలో వైస్ ప్రెసిడెంట్, దేశ ఆర్థిక వ్యవస్థకు అదే సమయంలో కిమ్ జాంగ్ ఉన్ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుడిగా గత పదేళ్ల నుంచి పనిచేస్తున్న 82 ఏళ్ల పాక్ పాంగ్ జు, అమెరికాతో గతంలో దౌత్యం కోసం ప్రయత్నించిన చోయి సన్‌ హుయి కూడా ఉన్నారు. కాగా, ఈ మధ్యే ఉత్తరకొరియా ప్రయోగించిన హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష పాక్ పాంగ్ జు నేతృత్వంలోనే జరిగింది.

కీలక వ్యవహారాల్లో  కిమ్ వెన్నంటే

కాగా,అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు దక్షిణకొరియా నాయకుడు మూన్ జే-ఇన్‌తో.. కిమ్ జోంగ్ ఉన్ శిఖరాగ్ర సమావేశాలు సహా అనేక కీలక సమావేశాల్లో కిమ్ యో జోంగ్..తన సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ కి చాలా దగ్గరగా కనిపించింది. ఉత్తరకొరియాలో ఆమె ఖచ్చితమైన రాజకీయ పాత్రపై చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదోఒకరోజు ఆమె సోదరుడి స్థానంలో నార్త్ కొరియా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశముందని ఊహాగాలు వినిపించాయి. గతేడాది అనారోగ్య కారణంతో కొన్ని రోజుల పాటు కిమ్ జాంగ్ ఉన్ బయటకు రాలేదు. ఆ సమయంలో సోదరి కిమ్ యో జాంగ్ దేశ బాధ్యతలను తీసుకున్నట్లు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. అంటే పరోక్షంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. అయితే అధికారికంగా దీన్ని ఎవరూ ధృవీకరించలేదు. ఇక 2018లో దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్‌ వేదికగా జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో కిమ్ యో జాంగ్ ఉత్తరకొరియా బృందాన్ని ముందుండి నడిపించింది.

కిమ్ కంటే ప్రమాదకారి

అయితే కిమ్ కంటే కిమ్ యో జోంగ్ మరింత ప్రమాదకారి అని అంతర్జాతీ అంశాలపై అవగాహన ఉన్న విశ్లేషకులు చెబుతుంటారు. ఇక ఈ మధ్యకాలంలో పలు కీలక ప్రకటనలు చేస్తూ ప్రపంచ దేశాల దృష్టిని తన వైపు మరల్చుకుంటోంది కిమ్ యో జాంగ్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన పై కామెంట్స్ చేయడం, ఉత్తరకొరియా చేస్తున్న క్షిపణి ప్రయోగాలను సమర్థించుకోవడం, అదే సమయంలో ఇతర దేశాలతో సత్సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఇటు అంతర్జాతీయ మీడియానే కాకుండా ఇతర దేశాల నాయకుల దృష్టి కూడా ఆకట్టుకునేలా వ్యవహరిస్తోంది. ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య యుద్ధానికి తన సోదరుడు కిమ్ జాంగ్ ఉన్ ముగింపు పలకాలంటే ముందుగా అమెరికా దక్షిణ కొరియాలు తమ దేశంపై అనుసరిస్తున్న విధానాలను నిలిపివేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాదు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక కిమ్ యో జాంగ్ నియామకాన్ని అత్యంత దగ్గరగా పరిశీలిస్తున్నాయి ప్రపంచ అగ్రదేశాలు. కిమ్ కంటే కిమ్ యో జోంగ్ మరింత ప్రమాదకారి అని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతుంటారు.

ALSO READ  భారత్ లోకి నిషేధిత డ్రగ్స్ అసలు ఎలా వస్తున్నాయో తెలుసా

నార్త్ కొరియాతో స్నేహానికి సై-అమెరికాపై కిమ్ విమర్శలు

మరోవైపు, ఉభయ కొరియాల మధ్య వివాదం కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. దక్షిణ కొరియాతో మెరుగైన సంబంధాల కోసం సుముఖత వ్యక్తం చేశారు ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్ . శాంతి స్థాపనలో భాగంగా ఏడాదికిపైగా మూసివున్న సరిహద్దులను తెరవడానికి సిద్దమని కానీ, పెండింగ్​లో ఉన్న చాలా సమస్యలపై చర్చించి, పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఉత్తరకొరియా పార్లమెంట్​లో బుధవారం పలు అంశాలపై ప్రసంగించిన కిమ్​ జోంగ్​ ఉన్​..ఉభయ కొరియాల మధ్య శాంతి స్థాపనను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అయితే.. ఇరు దేశాల మధ్య తలెత్తిన సమస్యలను స్వతంత్రంగా పరిష్కరించడానికి ప్రయత్నించేందుకు బదులుగా.. అమెరికా, అంతర్జాతీయ సహకారాన్ని దక్షిణ కొరియా కోరుకోవటం సరికాదన్నారు. సోదరి కిమ్​ యో జోంగ్​ చెప్పినట్లు దక్షిణ కొరియా ద్వంద్వ వైఖరిని విడనాడాలన్నారు. ఉభయ కొరియాల మధ్య సంబంధాలు క్లిష్టమైన కూడలిలో ఉన్నాయని తెలిపారు. మరోవైపు,అమెరికాపై కిమ్​ విమర్శలు గుప్పించారు​. చర్చలకు పిలవటం తమ పట్ల శత్రుత్వాన్ని కప్పిపుచ్చుకునే నీచమైన ఆలోచనగా అభివర్ణించారు.

అయితే కిమ్​ ప్రకటన.. అమెరికా,దక్షిణకొరియా​ మధ్య చీలిక తెచ్చే ప్రయత్నంగా స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా నేతృత్వంలో విధించిన ఆంక్షలు, ఇతర చర్యల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు దక్షిణ కొరియా సాయాన్ని కిమ్​ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం క్షిపణి పరీక్షలు చేపట్టిన ఉత్తర కొరియా.. అమెరికాపై విమర్శలు దాడిని పెంచింది. అలాగే దక్షిణ కొరియాతో షరతులతో కూడిన చర్చలకు పిలుపునిచ్చింది. ఇక,ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన క్షిపణి పరీక్షలపై తక్షణం చర్చించాలని అమెరికా, యూకే, ఫ్రాన్స్​ అభ్యర్థన మేరకు గురువారం అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసింది ఐరాస భద్రతా మండలి.

ALSO READ  గడ్డం నుంచి గాలిపటాల వరకు.. తాలిబన్ ప్రభుత్వం ఏమేం బ్యాన్ చేసిందో తెలుసా

×