Afghanistan : గడ్డం నుంచి గాలిపటాల వరకు.. తాలిబన్ ప్రభుత్వం ఏమేం బ్యాన్ చేసిందో తెలుసా

తాము మారిపోయాం..గతంలోలా ప్రవర్తించం అంటూ మొన్నటివరకు కబర్లు చెప్పిన తాలిబన్లు..అధికారంలోకి రాగానే మళ్లీ తమ పాత విధానాలనే కొనసాగిస్తున్నారు. మ‌హిళల‌ హ‌క్కులు కాపాడుతాం

Afghanistan : గడ్డం నుంచి గాలిపటాల వరకు.. తాలిబన్ ప్రభుత్వం ఏమేం బ్యాన్ చేసిందో తెలుసా

Afghan (12)

Afghanistan తాము మారిపోయాం..గతంలోలా ప్రవర్తించం అంటూ మొన్నటివరకు కబర్లు చెప్పిన తాలిబన్లు..అధికారంలోకి రాగానే మళ్లీ తమ పాత విధానాలనే కొనసాగిస్తున్నారు. మ‌హిళల‌ హ‌క్కులు కాపాడుతాం.. వారు ఉద్యోగాలు కూడా చేయొచ్చు.. వారి స్వేచ్ఛ‌కు సంకెళ్లు వేయ‌బోము అంటూ అఫ్ఘ‌ాన్ ఆక్ర‌మ‌ణ త‌ర్వాత తాలిబ‌న్లు చెప్పిన మాట‌లు. కానీ.. ఆ మాట‌ల‌న్నీ నీటి మూట‌లేన‌ని తేల్చేస్తున్నాయి వారి చ‌ర్య‌లు. తాలిబ‌న్లు తీసుకుంటున్న నిర్ణ‌యాలు మ‌హిళ‌ల ఆశ‌ల‌కు, ఆశ‌యాల‌కు గొడ్డ‌లిపెట్టుగా మారుతున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు-15న కాబూల్ ఆక్రమణతో ఒక్క పంజ్ షీర్ ఫ్రావిన్స్ తప్ప పూర్తిగా దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న తాలిబన్..ఈ నెల ప్రారంభంలో దేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చినప్పటినుంచి తాలిబన్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తూ ముఖ్యంగా మహిళల హక్కులను కాలరాస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల స్వేచ్చను హరించివేస్తూ అసలు తాలిబన్ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలను ఒక్కసారి చూద్దాం.

మహిళలు క్రీడల్లో పాల్గొనటంపై నిషేధం
అప్ఘాన్ మహిళలు(దేశపు మహిళా క్రికెట్ టీమ్ కూడా) క్రీడల్లో పాల్గొనడటంపై తాలిబన్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. మహిళలు షరియా చట్టం లేదా ఇస్లాం చట్టం ప్రకారం ఆటలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. క్రీడల్లో పాల్గొన్నప్పుడు మహిళల శరీర భాగాలు బహిర్గతం అవుతాయన్న కారణంగా క్రీడలపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబాన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ తెలిపారు.

ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం
మహిళల ఆశ్లీలతను సాకుగా చూపిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాలపై ఆప్ఘానిస్తాన్‌లో నిషేధం విధించారు. స్టేడియాల్లో మహిళా ప్రేక్షకులు ఉంటున్నారని.. అక్కడ మహిళలు డ్యాన్స్‌లు చేస్తున్నారని.. అదంతా కూడా తమ ఆచారాలకు విరుద్దమని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. అందువల్లే ఐపీఎల్ ప్రసారాలను ఆఫ్గనిస్తాన్‌లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆప్ఘాన్‌లోని ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్లకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఐపీఎల్ 2021 యూఏఈ లీగ్ అప్ఘానిస్తాన్ లో ప్రసారం కాదు. ఇదిలా ఉంటే పలు వినోద కార్యక్రమాలపై కూడా తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

ALSO READ ఆనాటి బహిరంగ కఠిన శిక్షలు మళ్లీ వస్తాయ్‌ : తాలిబన్లు

సంగీతం మరియు మహిళల వాయిస్ పై బ్యాన్
అప్ఘానిస్తాన్ ని తాలిబన్లు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పటి నుంచి దేశంలో సంగీతం మూగబోయింది.దేశంలో మ్యూజిక్ పై తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించింది. అదేవిధంగా కాందహార్ ఫ్రావిన్స్ లో టీవీ మరియు రేడియో చానల్స్ లో మహిళల వాయిస్ పై కూడా బ్యాన్ విధించారు. కాబూల్ లోని నేషనల్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ లోని పియానో,డ్రమ్ సెట్ సహా సంగీత పరికారలను తాలిబన్లు ధ్వంసం చేసిన షాకింగ్ విజువల్స్ బయటికొచ్చాయి. ఆ తర్వాత ఆ ఫొటోలు సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయబడ్డాయి.

గాలిపటాలను ఎగురేయడంపై నిషేధం
గాలిపటాలను ఎగురవేయడంపై నిషేధం విధించారు. గాలిపటాలను ఎగురవవేయడమనేది..యువకులను ప్రార్థన మరియు ఇతర మతపరమైన కార్యకలాపాల నుండి దూరం చేస్తుందని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. అఫ్ఘాన్ రచయిత ఖలీద్ హోస్సేనీ యొక్క 2003 లో అత్యధికంగా అమ్ముడైన నవల “ది కైట్ రన్నర్” సినిమాగా మారిన తర్వాత, విదేశాలలో ఖ్యాతిని సంపాదించుకుంది. అప్ఘాన్ లోని వేలాది కుటుంబాలు గాలిపటాల తయారీ వ్యాపారం మీద ఆధాపరడి బతుకుతున్నాయి. దీనిపై నిషేధం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
గడ్డం షేవింగ్,ట్రిమ్మింగ్ పై బ్యాన్
దక్షిణ అప్ఘానిస్తాన్ ప్రావిన్సులోని బార్బర్ షాపుల్లో గడ్డం షేవింగ్ చేయడం, ట్రిమ్ చేయడాన్ని నిషేధించారు. ఇస్లామిక్ చట్టం షరియాకు అనుగుణంగా తాలిబన్లు ఈ ఆదేశాలు జారీ చేశారు.హెల్మాండ్ ప్రావిన్సులోని రాజధాని నగరమైన లష్కర్ గాహ్ లో క్షౌరశాలలకు తాలిబన్లు నో షేవ్ ఆదేశాలు జారీ చేశారు. గడ్డం షేవ్ చేసుకోవడంపై నిషేధ ఉత్తర్వుల గురించి తెలిసి నా గుండె పగిలింది అని లష్కర్ గాహ్ నివాసి బిలాల్ అహ్మద్ చెప్పారు. ఇక,నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవని తాలిబన్లు హెచ్చిరికలు జారీ చేశారు.

ALSO READ  తాలిబన్ల కిరాతకం.. చంపేసి క్రేన్‌కు వేలాడదీశారు!

కో ఎడ్యేకేషన్ బ్యాన్

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ అధికారికంగా జెండా ఎగురవేసిన మరుసటి రోజే తమ ఉన్నత విద్యా విధానాన్ని ప్రకటించింది. యూనివర్సిటీల్లో జెండర్ పరంగా వేర్వేరు తరగతులు నిర్వహిస్తారని, కొత్త డ్రెస్ కోడ్ కూడా ప్రవేశపెట్టనున్నామని తాలిబాన్ తెలిపింది. మహిళలు చదువుకునేందుకు అనుమతి ఉందిగానీ పురుషులతో కలిసి కాదని చెప్తూ, కో ఎడ్యుకేషన్ రద్దు చేస్తున్నట్లు అఫ్గానిస్తాన్‌కు కొత్తగా ఎన్నికైన ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ ప్రకటించారుఅలాగే, విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాలను పునఃసమీక్షించనున్నట్లు వెల్లడించారు. గతంలో, 1996 నుంచి 2001 వరకు తాలిబాన్ అధికారంలో ఉన్నప్పుడు బాలికల, మహిళల విద్యపై నిషేధం ఉండేది. కానీ, ఇప్పుడు అలా ఉండదని, మహిళలు చదువుకోకుండా, ఉద్యోగాలు చేయకుండా తాము అడ్డుకోబోమని తాలిబాన్ తెలిపింది. అయితే, ఆగస్టు 15న కాబుల్‌ను ఆక్రమించుకున్నప్పటి నుంచీ, ప్రజారోగ్య రంగంలో ఉన్న మహిళలు తప్ప మిగతావారంతా ఆఫీసులకు రాకూడదని, భద్రతా పరిస్థితి మెరుగుపడేవరకు ఇంటిపట్టునే ఉండాలని తాలిబాన్ ఆదేశించింది.
.
.