Layoffs 2023 : ఉద్యోగాల ఊచకోత.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు గడ్డు కాలం, వేలాది జాబ్స్ తొలగిస్తున్న టెక్ కంపెనీలు, కారణం ఏంటి?

గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్.. ఇలా ఒక్కటేమిటి.. చాలా టెక్ దిగ్గజాలన్నీ ఎంతో సింపుల్ గా ఓ మెయిల్ పంపి మీ సేవలు చాలు అనేస్తున్నాయి. క్షణాల్లో సెటిల్ మెంట్లు చేసేసి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నాయి. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలన్నీ ఎందుకిలా చేస్తున్నాయి. ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే వారి పరిస్థితి ఏంటి?

Layoffs 2023 : ఉద్యోగాల ఊచకోత.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు గడ్డు కాలం, వేలాది జాబ్స్ తొలగిస్తున్న టెక్ కంపెనీలు, కారణం ఏంటి?

Layoffs 2023 : అవన్నీ దిగ్గజ టెక్ కంపెనీలే. నష్టాల్లో లేవు. కొన్ని నెలల్లో నష్టపోతాయనే అంచనాలూ లేవు. పైగా గడిచిన కొన్నేళ్లలో భారీ లాభాలను ఆర్జించాయి. ఇప్పుడు కూడా వాటి దగ్గర భారీగానే నగదు నిల్వలు ఉన్నాయి. అయినా సరే, ఉద్యోగుల సంక్షేమం గురించి అస్సలు ఆలోచించడం లేదు. తాజా పరిస్థితుల్లో కాస్త ఆదాయం తగ్గుతుందనే హెచ్చరికలతో ఎడాపెడా ఉద్యోగాలు పీకేస్తున్నాయి దిగ్గజ ఐటీ కంపెనీలు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్.. ఇలా ఒక్కటేమిటి.. చాలా టెక్ దిగ్గజాలన్నీ ఎంతో సింపుల్ గా ఓ మెయిల్ పంపి మీ సేవలు చాలు అనేస్తున్నాయి. క్షణాల్లో సెటిల్ మెంట్లు చేసేసి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నాయి. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలన్నీ ఎందుకిలా చేస్తున్నాయి. ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే వారి పరిస్థితి ఏంటి?

అమెజాన్-18వేల ఉద్యోగాలు.. గూగుల్-12వేల ఉద్యోగాలు.. మెటా-11వేల ఉద్యోగాలు.. మైక్రోసాఫ్ట్-10వేల ఉద్యోగాలు.. ట్విట్టర్-5వేల ఉద్యోగాలు.. ఇవన్నీ దిగ్గజ టెక్ కంపెనీలు ఇవ్వాలనుకుంటున్న ఉద్యోగాలు కాదు. తొలగించాలని అనుకుంటున్న జాబ్స్. ఇప్పటికే చాలామందిని ఇంటికి పంపేశారు. లేఆఫ్స్ లో భాగంగా.. మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్న ఓ భారతీయుడిపైనా వేటు పడింది. సంస్థ కోసం 21ఏళ్లు సేవలు అందించిన ప్రశాంత్ కమానీకి చివరికి దక్కిన బహుమానం ఇది. ఉద్యోగం నుంచి తొలగించాక అతను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అందులో అతడు రాసిన విషయాలు ఉద్యోగులందరి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి.

Also Read..IT Jobs Cut : ఊడుతున్న ఉద్యోగాలు.. ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం, ముందు ముందు మరింత దారుణం.. కోతలకు కారణం అదేనా?

తన కాలేజీ చదువు తర్వాత తొలి ఉద్యోగం మైక్రోసాఫ్ట్ లోనే వచ్చిందని, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ సంస్థలోనే కొనసాగానని తెలిపాడు ప్రశాంత్. 21ఏళ్ల పాటు వేర్వేరు హోదాల్లో పని చేశాడు. ఇప్పుడు తనను సంస్థ తొలగించడంతో భావోద్వేగానికి లోనయ్యాడు. అతడు రాసిన పోస్టులో తన ఫ్యామిలీ గురించి కూడా ప్రస్తావించాడు. ఇదే అందరి హార్ట్స్ ను టచ్ చేసింది.

ఆఫీస్ పనిలో బిజీగా ఉంటూ కుటుంబంతో సరిగా గడపలేకపోయానన్నాడు. అయినా వాళ్లు తనను అర్థం చేసుకుని ఎంతో మద్దతిచ్చారని తెలిపాడు. తాను ఉద్యోగం కోల్పోవడం తనకు ఎంత బాధ కలిగిస్తుందో, ఈ వార్త తన కుటుంబానికి కూడా అదే స్థాయిలో బాధిస్తుందన్నాడు. కంపెనీతో ఉన్న 21ఏళ్ల ప్రశాంత్ అనుబంధం ఒక్క ఈమెయిల్ తో కట్ అయిపోయింది.

ఒకే సంస్థలో 21ఏళ్ల పాటు ఉద్యోగం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా సంస్థ కోసం సర్వం ధారపోస్తే చివరికి దక్కిన గౌరవం ఇది. ఇన్నేళ్లు ఒకే చోట ఉద్యోగం చేసి కూడా అతడు పెద్దగా సంపాదించుకున్నది ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నపళంగా ఉద్యోగం పీకేస్తే అతడు ఏమైపోతాడు? అతడి కుటుంబం ఏమైపోతుంది? ఇది ఒక్క మైక్రోసాఫ్ట్ ఉద్యోగి కథే కాదు.. దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోతున్న అందరి పరిస్థితి ఇదే.

Also Read..Google Layoffs 12,000 Employees : 12,000 మంది గూగుల్ ఉద్యోగుల తొలగింపు..క్షమాపణలు చెప్పిన సీఈవో సుందర్ పిచాయ్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొంత మందగమనం కనిపించినా.. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ముందుగా చేసే పని ఉద్యోగాల్లో కోత పెట్టడమే. చిన్న కుదుపు వచ్చినా ముందుగా వేటు పడేది ఉద్యోగులపైనే. నిజానికి ఈ కంపెనీలేవీ లాస్ లో ఉండవు. పైగా గడిచిన కొన్నేళ్లలో భారీగా లాభాలు సంపాదించుకున్నవే. ఇప్పుడు కూడా టెక్ కంపెనీలకు మంచి లాభాలు వస్తున్నాయి. నగదు నిల్వలు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి.

ఆర్థిక మందగమన పరిస్థితులతో పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలన్నీ తమ వర్క్ ఫోర్స్ ను తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాయి. అందులో భాగంగానే వేలాది ఉద్యోగాలు పీకేసి ఇంటికి పంపించేస్తున్నాయ్. ట్విట్టర్ తో మొదలైన లేఆఫ్స్ నెమ్మదిగా మిగతా కంపెనీలకు విస్తరించింది. ఒక్కొక్కొ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు వేలాది మంది ఉద్యోగుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ గ్లోబర్ వర్క్ ఫోర్స్ 2లక్షల 20వేలు. అయితే కంపెనీలోని 5శాతం మంది ఉద్యోగులపై వేటు వేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. అంటే మొత్తంగా 11వేల మంది దాకా ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నారు. ఇప్పటికే తొలగింపులు కూడా మొదలయ్యాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆర్థిక మాంద్యం భయాలతో పెద్ద పెద్ద టెక్ కంపెనీలు కాస్ట్ కటింగ్స్ పేరుతో ఉద్యోగాల కోతకు దిగుతున్నాయి. ఈ లిస్ట్ లో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా చేరిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాల కోత తప్పడం లేదన్నారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. తమకున్న గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 12వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపారు. అమెజాన్ సైతం 18వేల ఉద్యోగాలకు కోత పెడుతోంది. మెటా కూడా 11వేల మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ట్విట్టర్ ఇప్పటికే 5వేల మంది ఉద్యోగులను తీసేసింది. ఇక స్నాప్ చాట్ కూడా 1200 మంది ఉద్యోగులను తొలగించింది. మంచి అభివృద్ధితో, లాభాలతో దూసుకెళ్తున్న దిగ్గజ టెక్ కంపెనీలు.. కొన్ని నెలల కిందటే భారీగా నియామకాలు జరిపాయి. అయితే తాజా పరిణామాలతో అన్ని కంపెనీలు ఒకే బాటలో నడుస్తున్నాయి. ఉద్యోగులపై వేటు వేస్తున్నాయ్.

మొత్తంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గడ్డు కాలం నడుస్తోంది. టెక్ ఉద్యోగులు బాగా టెన్షన్ పడుతున్నారు. ఏ క్షణం ఉద్యోగం ఊడుతుందో చెప్పలేని పరిస్థితి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉండటం టెన్షన్ పెడుతోంది. భారత్ లో ఈ ఏడాది తొలి 15 రోజుల్లోనే 91 టెక్ కంపెనీలు 24వేల మంది ఉద్యోగులను తొలగించేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచమంతా మళ్లీ ఆర్థిక మాంద్యం దిశగా నడుస్తోందన్న వరల్డ్ బ్యాంక్ హెచ్చరికలే ఇందుకు కారణమని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.