సడన్ పవర్ కట్.. అంధకారంలో పాకిస్తాన్‌.. ఎటూ చూసినా చీకట్లే… అసలేమైంది?

సడన్ పవర్ కట్.. అంధకారంలో పాకిస్తాన్‌.. ఎటూ చూసినా చీకట్లే… అసలేమైంది?

Major power outage plunges Pakistan into darkness : దయాది పాకిస్తాన్‌ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఎటు చూసినా చీకట్లే.. భారీగా విద్యుత్ అంతరాయం కారణంగా పాక్‌లోని అనేక నగరాలు చీకట్లో మునిగిపోయాయి. అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఒకేసారి భారీగా పవర్ నిలిచిపోవడంతో ఏమవుతుందో అర్థం కాలేదు. భయం గుప్పిట్లోనే పాక్ ప్రజలంతా చీకట్లోనే గడిపేశారు. పాకిస్తాన్ లోని పలు నగరాలు, పట్టణాల్లో దాదాపు ఒకేసారి విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.

ఆదివారం అర్ధరాత్రికి ముందు ఈ భారీ విద్యుత్ అంతరాయం సంభవించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. పాక్ లోని కరాచీ, రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్, ముల్తాన్ ఇతరుల నివాసితులు విద్యుత్ అంతరాయం సమస్యను ఎదుర్కొన్నారని నివేదికలు పేర్కొన్నాయి.

నేషనల్ ట్రాన్స్మిషన్ డెస్పాచ్ కంపెనీ (NTDC) కరెంట్ లైన్లు పడిపోవడంతో అంతరాయం ఏర్పడిందని ఇస్లామాబాద్ డిప్యూటీ కమిషనర్ హంజా షఫ్కాత్ ట్వీట్ చేశారు. అంతా సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని అన్నారాయన. జాతీయ పంపిణీ వ్యవస్థ ఫ్రీక్వెన్సీ క్షీణించడం వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి NTDC బృందాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.

విద్యుత్ మంత్రి ఒమర్ అయూబ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఫ్రీక్వెన్సీ అకస్మాత్తుగా 50 నుండి సున్నా(0)కి పడిపోయిందని, అందుకే అంతరాయానికి కారణమైందని ట్వీట్ చేశారు. ఫ్రీక్వెన్సీ తగ్గడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. అందరూ సంయమనాన్ని పాటించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.