జోలాలీ: పార్లమెంటులో ఎంపీ బిడ్డకు పాలుపట్టిన స్పీకర్

  • Published By: veegamteam ,Published On : August 22, 2019 / 03:56 AM IST
జోలాలీ: పార్లమెంటులో ఎంపీ బిడ్డకు పాలుపట్టిన స్పీకర్

పార్లమెంట్ లో అయినా..అసెంబ్లీలోనైనా స్పీకర్ సభను నిర్వహిస్తుంటారు. అధికార ప్రతిపక్షాలను సమన్వయపరుస్తు సభను సక్రమంగా నిర్వహిస్తుంటారు. కానీ పార్లమెంట్ స్పీకర్ మాత్రం సభ జరుగుతుండగానే సభాపతి స్థానంలోనే కూర్చున్న ఆయన ఓ పసిబిడ్డకు పాలు పడుతు కూర్చున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పాపను జోకొడుతూ..పాలు పడుతున్న దృశ్యాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అది ఎక్కడా..అనుకుంటున్నారు కదూ..ఈ అరుదైన దృశ్యం న్యూజిలాండ్ పార్లమెంటులో కనిపించింది. కనువిందు చేసింది. 

న్యూజిలాండ్ పార్లమెంట్ స్పీకర్ ట్రెవర్ మలార్డ్. ట్రెవర్ కు మంచి వ్యక్తి అనే పేరుంది.  స్పీకర్ వంటి  ఉన్నత స్థానంలో ఉన్నా.. సాధారణ పౌరుడిలాగానే వ్యవహరిస్తూ అందరితో ప్రశంసలు అందుకుంటు సదా వార్తల్లో నిలుస్తుంటారు ట్రెవర్ మలార్డ్. స్పీకర్ చైర్ లో నే కూర్చుని  ఓ బిడ్డకు పాలు పట్టిస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. 

ఎంపీ టామాటి కఫే బుధవారం (ఆగస్టు 21)న తన నెలల బిడ్డతో పార్లమెంటు సమావేశాలకు హజరయ్యారు. సభ జరుగుతుండగా ఆ చిన్నారికి ఆకలేసిందో ఏమో ఏడ్చింది. అది స్పీకర్ గమనించారు. వెంటనే ఏమాత్రం ఆలోచించలేదు..తానో స్పీకర్ ని అనీ..దర్పం ప్రదర్శించాలని అనుకోలేదు. వెంటనే ఆ పసిబిడ్డను ఎత్తుకున్నారు. స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టుకుని బాటిల్‌తో పాలు పట్టారు. ఈ అరుదైన ఫొటోలను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. 

సాధారణంగా సభా బాధ్యతలు కలిగిన అధికారులు మాత్రమే స్పీకర్ స్థానంలో కూర్చుంటారు. అయితే.. ఈ రోజు ఓ వీఐపీ నాతో సభాపతి స్థానంలో కూర్చున్నారు. మీ కుటుంబంలో కొత్త సభ్యుడు చేరినందుకు శుభాకాంక్షలు టిమ్’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. స్పీకర్ ఆ బిడ్డకు పాలు పట్టించి, లాలించడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
దేశానికి రాజైన ఓ తల్లికి బిడ్డేకదా. ట్రెడర్ మలార్డ్ స్పీకర్ అయినా ఓ మనిషే కదా..పసిబిడ్డ ఏడుస్తుంటే చూడలేకపోయారు. ఆయన తలచుకుంటే వెంటనే సిబ్బందికి ఆదేశించి బిడ్డను ఎత్తుకోమనో లేదా పాలు పట్టమనో ..లేదా తల్లి వచ్చేంత వరకూ ఆ బిడ్డ బాధ్యతలు చూసుకోవమనో చెప్పవచ్చు. కానీ ట్రెబర్ మలార్డ్ ప్రత్యేకత అదే.