Japan’s Princess: యువరాణి పెళ్లికి వేళాయే.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తులు వదిలేసి!

జపాన్ యువరాణి మాకో ఈ నెలలో తన చిరకాల ప్రేమికుడుని వివాహం చేసుకోబోతోంది.

Japan’s Princess: యువరాణి పెళ్లికి వేళాయే.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తులు వదిలేసి!

Princess

Japan’s Princess: జపాన్ యువరాణి మాకో ఈ నెలలో తన చిరకాల ప్రేమికుడుని వివాహం చేసుకోబోతోంది. అయితే, పెళ్లి వేడుకకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్లానింగ్ చేయలేదని యువరాణి తరుపువారు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ వివాహంపై దృష్టి పెట్టారు. ఎందుకంటే యువరాణి వివాహం చేసుకునే వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి. అతని పేరు కీ కొమురో. కీ కొమురో రాజవంశానికి చెందినవాడు కాకపోవడమే ఈ వివాహంపై ఆసక్తి పుట్టించింది.

తన ప్రేమ కోసం త‌న వార‌స‌త్వ సంప‌ద‌గా వచ్చే పెద్ద మొత్తాన్ని వ‌దులు కోవడానికి సిద్ధపడి వార్తల్లో నిలిచిన మాకో.. ఎట్టకేలకు వివాహానికి సిద్ధం అవుతోంది. ఈ వివాహం 3 సంవత్సరాలకు పైగా ఆలస్యం అవగా.. అక్టోబర్ 26వ తేదీన పెళ్లి చేసుకోబోతుంది. పలు విమర్శలు, నిశిత పరిశీలన తర్వాత జపాన్‌ రాజకుటుంబ వ్యవహారాలు చూసే ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.

జపాన్ యువరాణి మాకో ఈ వివాహంతో 150 మిలియన్ యెన్($1.35 మిలియన్లు) తిరస్కరించిందని, దాంతో పాటు ఆమె రాజ కుటుంబాన్ని విడిచిపెట్టడానికి కూడా సిద్ధం అయ్యిందని ప్యాలెస్ అధికారులు చెబుతున్నారు. అలాగే, యువరాణి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతోందని, దాన్నుంచి కోలుకునేందుకు ఇంత సమయం పట్టిందని ప్రకటించింది ప్యాలెస్.

యువరాణి నిర్ణయంతో రాజ వివాహానికి తగ్గట్టుగా వేడుకలు జరగవని స్పష్టం చేసింది ప్యాలెస్. జపనీస్ రాయల్ వెడ్డింగ్‌తో పాటు ఏ ఆచారమూ జరగదని చెప్పారు ప్యాలెస్ అధికారులు. ప్రజలు ఎవరూ ఈ పెళ్లికి సపోర్ట్ చెయ్యట్లేదని, అందువల్ల పెళ్లికి ఎవరూ హాజరు కావట్లేదని, ఈ జంట కోసం వివాహ విందులు కూడా ఏర్పాటు చెయ్యట్లేదని చెప్పింది ప్యాలెస్. వాస్తవానికి వచ్చే ఏడాది వివాహం చేసుకుంటామని వారు సెప్టెంబర్ 2017లో ప్రకటించారు. కానీ రెండు నెలల తర్వాత ఆర్థిక వివాదం తెరపైకి వచ్చింది మరియు వివాహం జరగలేదు.