E-Scooters Ban: సెప్టెంబర్ 1 నుంచి పారిస్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల నిషేధం.. ఎందుకంటే..

ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వినియోగాన్ని పారిస్ నగర పాలక సంస్థ నిషేధించింది. ఇది మరో నాలుగు నెలల్లో అమలులోకి రానుందని పారిస్ మేయర్ వెల్లడించారు.

E-Scooters Ban: సెప్టెంబర్ 1 నుంచి పారిస్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల నిషేధం.. ఎందుకంటే..

E-Scooters (Pic: Google)

E-Scooters Ban: వాతావరణ కాలుష్యం నివారణ.. పర్యావరణహితం కోసం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపైనే దేశాలు దృష్టి సారించాయి. దీంతో వీటి వినియోగం పెరుగుతోంది. భారత్ తో సహా ప్రపంచ దేశాలు E వాహనాలపైపే ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్ అయితే ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ సంస్థలకు ప్రోత్సహకాలు కూడా అందిస్తోంది. దీనికి పూర్తి భిన్నంగా ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ మాత్రం ఈ-స్కూటర్ల (e-scooters)పై నిషేధం విధించింది.

నగరవాసులు అత్యంత ఈజీగా వినియోగించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లను పారిస్ నగర పాలక సంస్థ నిషేధించింది. ఇది వచ్చే సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. ఇది కేవలం తమ నిర్ణయం కాదని ప్రజల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది పారిస్ పాలక సంస్థ. నగరంలో ఈ-స్కూటర్ల వినియోగం ఉండాలా? వద్దా? అనేదానిపై ఓటింగ్ నిర్వహించింది పారిస్ నగరపాలక సంస్థ. ఈ ఓటింగ్ లో 89 శాతంమంది ప్రజలు నిషేధించాలని ఓటు వేశారు. దీంతో పారిస్‌ నగరపాలక సంస్థ ఈ-స్కూటర్ల వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇలా బుక్ చేసుకుని అలా నగరంలో పనులు ముగించుకునే వీలుండేలా ఉపయోగపడుతున్న ఈ స్కూటర్లను పారిస్ ప్రజలు ఎందుకు వద్దంటున్నారు? వాటి వినియోగాన్ని ఎందుకు నిషేధించాలంటున్నారు? వీటి వల్ల జరుగుతున్న నష్టాలేంటి? అంటే..

Also Read: ‘34 ఏళ్ల క్రితం మా అమ్మ డైరీ ’ గుండెలు మెలిపెట్టే తల్లి మానసిక వ్యథను కళ్లకు కట్టిన కూతురు

పారిస్‌ నగరంలో 2018లో మొదటిసారి అద్దెకు ఈ-స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్మార్ట్‌ఫోన్ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకుని నగరంలో వీటిపై ప్రయాణించవచ్చు. వీటిపై ప్రయాణించేటప్పుడు వీటి వేగం గంటకు 20 కి.మీ. దాటకూడదనే నిబంధన ఉంది. కానీ వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. మైనర్లు కూడా వీటిని వినియోగించటం.. నిబంధనలు పాటించకపోవటం వంటివి జరుగుతున్నాయి. ఈ స్కూటర్ల పార్కింగ్ విషయంలోనూ సమస్యలు తలెత్తాయి. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వినియోగం మితిమీరిపోయి ప్రమాదాలు ఎక్కువ కావడం.. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. అలా గత రెండేళ్లలో ఈ-స్కూటర్ల కారణంగా 2021లో 24, 2022లో 459 ప్రమాదాలు జరిగాయని పారిస్ పోలీసులు తెలిపారు.

దీంతో ఈ స్కూటర్లను నిషేధం విధించాలని ప్రజలే కోరగా.. పారిస్ నగర పాలక సంస్థ అంగీకరించింది.  సెప్టెంబర్ 1నుంచి ఈ స్కూటర్లను నిషేధిస్తున్నామని పారిస్‌ నగర మేయర్ అన్నే హిడాల్గో తెలిపారు. కానీ కొంతమంది మాత్రం వీటిని నిషేధించే కంటే వీటి కోసం ప్రత్యేక ట్రాక్ లు, పార్కింగ్ ప్లేసులు ఉపయోగించి తగిన జాగ్రత్తలు తీసుకుని కొనసాగించాలని కోరుతున్నారు. ఈ-స్కూటర్ల ఆపరేటర్లు మాత్రం ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని విన్నవించారు.

Also Read: యువతకు ‘ప్రేమపాఠాలు’ నేర్పుతున్న చైనా ప్రభుత్వం..! ప్రేమించుకోవటానికి విద్యార్ధులకు సెలవులు..!!