మనసెరిగిన మాస్టారు.. విద్యార్థి కోసం బార్బర్‌గా మారిన ప్రిన్సిపల్, స్కూల్‌లోనే హెయిర్ కట్

మనసెరిగిన మాస్టారు.. విద్యార్థి కోసం బార్బర్‌గా మారిన ప్రిన్సిపల్, స్కూల్‌లోనే హెయిర్ కట్

Principal helps student with haircut issue: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పడం వరకే మా కర్తవ్యం, అంతటితో మా పని అయిపోయిందని ఫీల్ అయ్యే టీచర్లు చాలామంది ఉన్నారు. పాఠాలు చెప్పేసి చేతులు దులుపేసుకుంటారు. ఆ గురువు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన మరో అడుగు ముందుకేశాడు. స్టూడెంట్స్ కు విద్యా బుద్ధులు నేర్పడమే కాదు.. వారి మనసు చదివి.. వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం కూడా గురువుల కర్తవ్యమేనని తెలియజెప్పాడు. అంతేకాదు, విద్యార్థి కోసం ఏకంగా బార్బర్ అవతారం ఎత్తాడు. స్కూల్‌లోనే విద్యార్థికి నచ్చినట్లుగా జుట్టు కత్తిరించి అతడితో పాటు అందరి మనసులు గెల్చుకున్నాడు.

Photo Of Principal Fixing Student's Haircut Goes Viral

అమెరికాలోని ఇండియానాకు చెందిన ఆంథోనీ మూరే అనే విద్యార్థి స్టోనీ బ్రూక్‌ ఇంటర్ మీడియెట్ అండ్‌ మిడిల్‌ స్కూల్లో చదువుతున్నాడు. అతడు క్యాప్ పెట్టుకుని స్కూలుకు వస్తున్నాడు. దీన్ని స్కూల్ డీన్ గమనించాడు. స్కూల్ నిబంధనల ప్రకారం.. విద్యార్థి క్యాప్ పెట్టుకుని రావడం డ్రెస్‌కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని, వెంటనే క్యాప్ తీసేయాలని విద్యార్థిని ఆదేశించాడు. అయితే, మూరే మాత్రం.. ఆ క్యాప్ ఎట్టిపరిస్థితిలో తీసేది లేదని తేల్చి చెప్పాడు. సుమారు అరగంట సేపు డీన్‌తో వాదించాడు. దీంతో ఆ డీన్ ఈ విషయాన్ని ప్రిన్సిపల్ జాసన్ స్మిత్‌ దృష్టికి తీసుకెళ్లాడు.

Principal restores student's confidence in unusual way - he fixed his haircut - al.com

రంగంలోకి దిగిన ప్రిన్సిపల్.. ఆ విద్యార్థితో మాట్లాడాడు. అతడి సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నించాడు. ‘‘ఎందుకు నువ్వు టోపీ పెట్టుకుంటున్నావు? కారణం ఏంటి?’’ అని మూరేని అడిగాడు. ‘నా జుట్టు పెరిగినట్లు అనిపిస్తే మా అమ్మానాన్న హెయిర్‌ కట్‌ చేయించారు. ఆ హెయిర్‌ కట్‌ చాలా దారుణంగా ఉంది. అది నాకు అస్సలు నచ్చలేదు. అందుకే క్యాప్ పెట్టుకున్నా’ అని మూరే తెలిపాడు. దీంతో బాగా ఆలోచించిన జాసన్‌ తానే ఆంథోనికి హెయిర్‌ కట్‌ చేయటానికి పూనుకున్నాడు.

Indianapolis principal goes viral for haircut photo | 13wmaz.com

‘‘నేను నీ అంత వయసున్నప్పటి నుంచి హెయిర్‌‌ కట్‌ చేస్తున్నా. నా కొడుక్కి కూడా నేనే చేస్తా. నేనింటికెళ్లి ట్రిమ్మర్‌ తెచ్చి నీకు అందంగా హెయిర్‌ కట్‌ చేస్తాను. సరేనా!’’ అని మూరేని అడిగాడు. ఆ విద్యార్థి మొదట ఇందుకు ఇబ్బందిపడ్డా.. తర్వాత సరేనన్నాడు. ప్రిన్సిపల్ జాసన్ ఇంటికెళ్లి ట్రిమ్మర్ తీసుకొచ్చాడు. బార్బర్ అవతారం ఎత్తి స్కూల్ లోనే ఆంథోనికి హెయిర్‌ కట్‌ చేశాడు. జుట్టును అందంగా కత్తిరించాడు. కొత్త హెయిర్ కట్ లో అద్దంలో తనని తాను చూసుకుని ఆంథోనీ మురిసిపోయాడు. ఆ తర్వాత క్యాప్ తీసేసి, ఆత్మవిశ్వాసంతో క్లాస్‌రూమ్‌కు వెళ్లాడు. తన జుట్టు గురించి ఆలోచించకుండా బుద్ధిగా టీచర్ చెబుతున్న పాఠాలు విన్నాడు. ఆ తర్వాత హ్యాట్‌ పెట్టుకోవటం మానేశాడు.

ఈ విషయం తెలిసి విద్యార్థి పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. తన కొడుకుని స్కూల్ నుంచి సస్పెండ్ చేయకుండా.. పరిస్థితిని చాలా చక్కగా సరిదిద్దారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీరు సూపర్ సార్.. అంటూ ప్రిన్సిపల్ జాసన్ కు వారు థ్యాంక్స్ చెప్పారు. పిల్లల మనసెరిగిన గురువుగా అందరి మన్ననలు పొందాడు ప్రిన్సిపల్ జాసన్ స్మిత్.

స్కూల్లో విద్యార్థులు నిబంధనలు అతిక్రమిస్తే.. టీచర్ వారిని దండిస్తారు లేదా వార్నింగ్ చేస్తారు. అలా చెబితేనే పిల్లలు వింటారని అంతా అనుకుంటారు. అయితే, ప్రిన్సిపల్ జాసన్ మాత్రం పిల్లల మనసెరిగిన మాస్టారు అనిపించుకున్నాడు. గురువంటే.. శిక్షణ.. క్రమశిక్షణే కాదు.. పిల్లలను సంతోషంగా ఉంచడం కూడా గురువు బాధ్యతే అని నిరూపించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఈ ప్రిన్సిపల్ కి నెటిజన్లు హ్యాట్సాప్ చెబుతున్నారు.