అవినీతి బయటపడుతుందని భయపడి అలా చేశారు: బండి సంజయ్

అవినీతి సామ్రాజ్యానికి అధిపతి కేసీఆర్ అని, కాళేశ్వరం డీపీఆర్ ఇవ్వకుండా, దానికి జాతీయ హోదా రాకుండా...

అవినీతి బయటపడుతుందని భయపడి అలా చేశారు: బండి సంజయ్

Bandi Sanjay Kumar

బీఆర్ఎస్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణములోని ఓ కల్యాణ మండపములో నియోజక వర్గ బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

అవినీతి సామ్రాజ్యానికి అధిపతి కేసీఆర్ అని, కాళేశ్వరం డీపీఆర్ ఇవ్వకుండా, దానికి జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నారని బండి సంజయ్ చెప్పారు. అవినీతి బయట పడుతుందని భయపడ్డారని బండి సంజయ్ మండిపడ్డారు. తామిచ్చిన నిధుల విషయంలో చర్చకు రావాలని అన్నారు.

కరీంనగర్ స్మార్ట్ సిటి కోసం కేంద్రం నుంచి నిధులను తీసుకొచ్చానని, కానీ, తడిగుడ్డతో గొంతులు కోసే రకం వారి వల్ల మేలు జరగలేదని అన్నారు. కరీంనగర్ లో వినోద్ రావు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని నాటకాలు ఆడుతున్నాయని తెలిపారు.

ఆ పార్టీలు రెండూ.. రెండవ స్థానం కోసం రెండు పోటీ పడుతున్నాయని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో దాదాగిరి, గూండాగిరి చేసి అధికారం చెలాయించారని అనుకుంటున్నారని చెప్పారు. బతుకమ్మ చీరల బకాయిలు పెండింగ్ పెట్టి, ముప్పుతిప్పలు పెట్టింది ఆయన కాదా అని నిలదీశారు. సమస్యలు పరిష్కరించకుండా, కాలయాపన చేశారని అన్నారు.

తాను దీక్ష చేస్తానన్న తరువాతే స్పందించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ, సిరిసిల్ల నేతన్నలను మోసం చేయరని నమ్మకమేమిటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ను మించిన బ్లాక్ మైలర్ దేశంలో ఎవ్వరూ లేరని అన్నారు.

Also Read: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్