Leaders of Indian Origin in the World : ప్రపంచ దేశ రాజకీయాలను శాసిస్తున్న మన భారతీయులు .. పలు దేశాల్లో భారత సంతతి వ్యక్తులదే కీ రోల్..

భారత్‌ను మాత్రమే కాదు ప్రపంచాన్నే ఏలుతున్నారు మన భారతీయులు. ఈ క్రమంలో ఇప్పుడు  రిషి సునక్ గెలుపుతో బ్రిటన్ పాలనా పగ్గాలు మన సంతతికి చెందిన వ్యక్తికి దక్కాయి. కానీ.. ఇప్పటికే మరికొన్ని దేశాలను మన మూలాలున్న వాళ్లే పాలిస్తున్నారు.

Leaders of Indian Origin in the World : ప్రపంచ దేశ రాజకీయాలను శాసిస్తున్న మన భారతీయులు .. పలు దేశాల్లో భారత సంతతి వ్యక్తులదే కీ రోల్..

Rishi Sunak Joins List Of India-Origin World Leaders In Key Roles

Leaders of Indian Origin the World : భారత్‌ను మాత్రమే కాదు ప్రపంచాన్నే ఏలుతున్నారు మన భారతీయులు. ఈ క్రమంలో ఇప్పుడు  రిషి సునక్ గెలుపుతో బ్రిటన్ పాలనా పగ్గాలు మన సంతతికి చెందిన వ్యక్తికి దక్కాయి. కానీ.. ఇప్పటికే మరికొన్ని దేశాలను మన మూలాలున్న వాళ్లే పాలిస్తున్నారు. అంతేకాదు.. పెద్ద పెద్ద కంపెనీలకూ.. మనోళ్లే సీఈవోలుగా ఉన్నారు. బ్రిటన్‌కు చెందిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ లాంటి పెద్ద కంపెనీలను కొన్నది కూడా మనోళ్లే. అందులో కొందరు మాత్రమే మనకు బాగా తెలుసు. మిగతా వాళ్ల గురించి.. కచ్చితంగా తెలుసుకోవాలి.

కొన్ని దశాబ్దాల కిందట భారత్‌ను.. బ్రిటీషర్లు పాలించారు. వాళ్లను తరిమికొట్టి.. స్వాతంత్ర్యం సాధించాం. ఒకప్పుడు మన దేశంలో మనమే పరాయివాళ్లుగా బతికాం. ఇప్పుడు మన దేశాన్ని మనమే పాలించుకుంటున్నాం. ఇదో రకం కిక్. దీనికి తిరుగులేదు. కానీ.. దీనిని మించిన కిక్ మరొకటుంది. దాని పేరే రిషి సునక్. ఒకప్పుడు ఇదే భారతదేశాన్ని పాలించిన బ్రిటన్‌కు.. ఇప్పుడు భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని అయ్యాడు. అప్పుడు.. ఇండియన్స్‌కి పాలన చేతకాదన్న నోళ్లే.. ఇప్పుడు అదే భారత మూలాలున్న వ్యక్తిని ఎన్నుకొని మరీ… మమ్ము పాలించు మహాప్రభో అంటూ పీఎంగా ఎంపిక చేసుకున్నాయ్.

రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవడమే ఓ చరిత్ర. దానిని మించిన విశేషాలు మరెన్నో ఉన్నాయ్. గడిచిన రెండు వందల ఏళ్లలో.. బ్రిటన్‌లో 42 ఏళ్లకే ప్రధాని అయిన తొలి వ్యక్తి రిషి సునక్. బ్రిటన్‌లో కాకలుతీరిన పొలిటీషియన్స్ ఎంతో మంది ఉన్నారు. వాళ్లకెంతో రాజకీయ అనుభవం ఉంది. అయినప్పటికీ.. 42 ఏళ్ల రిషినే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు తమ నాయకుడిగా ఎంపిక చేసుకున్నారంటే.. అతనెంత గ్రేట్ పర్సనో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. యూకే చరిత్రలోనే తొలిసారి ఓ తెల్లజాతీయేతర వ్యక్తి ప్రధాని పీఠంపై కూర్చున్నాడు. అంతేకాదు.. బ్రిటన్ పాలనా పగ్గాలు చేపట్టిన తొలి హిందువు కూడా సునక్‌ మాత్రమే. బ్రిటన్ ఆర్థిక మంత్రిగా అతను అందించి సేవలు, కోవిడ్ సమయంలో.. ఎకనమిక్ రెస్క్యూ ప్యాకేజీ ప్రకటించడంతో రిషికి ఫిదా అయిపోయారు. బ్రిటన్ పీఎం పగ్గాలు అతని చేతికి అందించారు.

Indian origin CEOs : సీఈవోల ఫ్యాక్టరీగా భారత్ .. ప్రపంచ వ్యాప్తంగా పలు కార్పోరేట్ కంపెనీల్లో భారతీయుల హవా..

రిషి సునక్ మాత్రమే కాదు.. భారత సంతతికి చెందిన ఎందరో వ్యక్తులు ప్రపంచ దేశాలను ఏలుతున్నారు. అందులో.. మొదటగా చెప్పుకోవాల్సింది కమలా హ్యారిస్ గురించే. ఆమె ఒక లాయర్ మాత్రమే కాదు అమెరికాలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన పొలిటీషియన్ కూడా. అగ్రరాజ్యం అమెరికాకు 49వ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు కమలా దేవి హ్యారిస్. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలోనే.. తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్ కమల. అలాగే.. వైస్ ప్రెసిడెంట్ లాంటి అత్యున్నత స్థాయి పదవికి చేరిన తొలి ఆఫ్రికన్ అమెరికన్, ఏషియన్ అమెరికన్ కూడా కమలానే. అంతేకాదు.. యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి తెల్లజాతీయేతర వ్యక్తి కూడా ఆమె. గతంలో.. కాలిఫోర్నియా సెనేటర్‌గానూ, అటార్నీ జనరల్ ఆఫ్ కాలిఫోర్నియాగానూ పనిచేశారు. భారత మూలాలున్న కమలా హ్యారిస్.. అమెరికా లాంటి దేశానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం.. ఎంతో గర్వకారణం.

మారిషస్ ప్రధాని కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే. ప్రవింద్ కుమార్ జుగ్నాథ్.. 2017 నుంచి మారిషస్ పీఎంగా ఉన్నారు. ఆయన.. 2003 నుంచి మిలిటెంట్ సోషలిస్ట్ మూవ్‌మెంట్‌కు నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రవింద్ జుగ్నాథ్ పూర్వీకులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చారు. అతను.. అహిర్స్ హిందూ కుటుంబంలో జన్మించారు. కొంతకాలం క్రితమే.. ఆయన భారత్‌లోనూ పర్యటించారు.మారిషస్ దేశాధ్యక్షుడు కూడా భారత సంతతికి చెందిన కుటుంబంలోనే జన్మించారు. ఆయనే.. పృథ్వీరాజ్ సింగ్ రూపన్. ఈయన 2019లో మారిషస్ ఏడో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. పృథ్వీరాజ్‌సింగ్‌ని.. ప్రదీప్ సింగ్ రూపన్ అని కూడా పిలుస్తారు. ఈయన.. భారత ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు.

ఇక.. పోర్చుగల్‌ పీఎం ఆంటోనియో కోస్టా కూడా భారత మూలాలున్న వ్యక్తే. అతను.. పోర్చుగల్‌ 119వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 2015 నుంచి ఆంటోనియో ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పోర్చుగీస్, భారతీయ దంపతులకు జన్మించిన సంతానం. ఆంటోనియో తండ్రి.. గోవా కుటుంబంలో జన్మించారు. కోస్టాను గోవాలో బాబూష్ అని ముద్దుగా పిలుస్తారు. పోర్చుగల్‌ ప్రధానిగా ఆంటోనియో అందిస్తున్న సేవలకు.. అక్కడి ప్రజలు ఎంతో సానుకూలంగా ఉన్నారు.

గయానా దేశ ప్రెసిడెంట్‌గా ఉన్న మహ్మద్ ఇర్ఫాన్ అలీ కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే. గయానా దేశానికి తొలి ముస్లిం అధ్యక్షుడు కూడా ఇర్ఫానే. 2020 ఆగస్టులో.. గయానా తొమ్మిదవ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా మహ్మద్ ఇర్ఫాన్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. అతను.. లియోనోరా, వెస్ట్ కోస్ట్ డెమరారాలో.. ముస్లిం ఇండో – గయానీస్ కుటుంబంలో జన్మించాడు. ఇక.. నూర్ హసన్ అలీ తర్వాత అమెరికాకు రెండో ముస్లిం హెడ్ ఆఫ్ స్టేట్ కూడా అలీనే.

సౌత్ అమెరికాలో ఉన్న సురినామ్ దేశాధ్యక్షుడు చాన్ సంతోఖి కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే. అతని పూర్తి పేరు చంద్రికాపర్సాద్. సురినామీస్ రాజకీయవేత్త మాత్రమే కాదు అతనో మాజీ పోలీస్ ఆఫీసర్ కూడా. 2020 నుంచి సురినామ్ దేశానికి తొమ్మిదో అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2020 ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. సురినామ్ ఏకైక అధ్యక్ష అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారంటే అర్థం చేసుకోవచ్చు.. ఆయన నాయకత్వం మీద ఆ దేశ ప్రజలకు ఎంత నమ్మకముందో. ఎలాంటి పోటీ లేకుండానే.. ఏకగ్రీవంగా ఆయన సురినామ్ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1959లో.. ఆయన సురినామ్‌లోని లెలీడోర్ప్‌లో జన్మించారు. ఇండో-సురినామీస్ హిందూ కుటుంబంలో ఆయన జన్మించారు.

ఐర్లాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సైతం భారత సంతతికి చెందిన వ్యక్తే. లియో ఎరిక్ వరద్కర్.. ఐర్లాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేస్తున్నారు. అదనంగా.. ఐర్లాండ్ ఎంటర్‌ప్రైజ్, ట్రేడ్, ఎంప్లాయ్‌మెంట్ శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017 నుంచి 2020 వరకు ఆ దేశ రక్షణమంత్రిగానూ పనిచేశారు. లియో తండ్రి మన ముంబైలోనే జన్మించారు. 1960ల ప్రాంతంలో.. ఆయన యూకేకు వెళ్లి డాక్టర్‌గానూ పనిచేశారు. అక్కడి నుంచి ఐర్లాండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

అమెరికా, బ్రిటన్ లాంటి అగ్ర దేశాలనే కాదు.. ఐర్లాండ్, సురినామ్ లాంటి చిన్న దేశాల దాకా భారత ఖ్యాతి విస్తరించిందని చెప్పడానికి.. ఇంతకంటే ఎగ్జాంపుల్స్ మరొకటి ఉండవు. అభివృద్ధి చెందిన దేశాలను.. సంక్షోభాల నుంచి గట్టెక్కించడమూ తెలుసు. చిన్న దేశాలను.. మరింత అభివృద్ధి చేయడమూ తెలుసు. ఇదంతా.. ఇండియా బ్లడ్‌లోనే ఉంది. అదెక్కడికి వెళ్లినా.. మరుగుతూనే ఉంటుంది. భారత ఖ్యాతిని పెంచుతూనే ఉంటుంది.