Ruchira Kamboj : రుచిరా కాంబోజ్ అరుదైన ఘనత..ఐక్యరాజ్య సమితిలో తొలి మహిళా రాయబారిగా నియామకం

ఐక్యరాజ్య సమితిలో భారతదేశ రాయబారిగా రుచిరా కాంబోజ్ బాధ్యతలు స్వీకరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు తన ఆధారాలను సమర్పించారు. ఈ విషయాన్ని రుచికా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

Ruchira Kamboj : రుచిరా కాంబోజ్ అరుదైన ఘనత..ఐక్యరాజ్య సమితిలో తొలి మహిళా రాయబారిగా నియామకం

Ruchira Kamboj 1st Woman to Take Over India’s Permanent Representative to UN : ఐరాసలో భారత రాయబారి రుచిరా కాంబోజ్‌ అరుదైన ఘనత సాధించారు. ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధిగా గత జూన్ నెలలో నియమితులయ్యారు. భారత్ నుంచి ఈ రికార్డు సాధించిన మొదటి మహిళ రుచికానే కావడం విశేషం. ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధిగా నియామకానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌కు సమర్పించారు. ఈ శుభ సందర్భాన్ని రుచిక సోషల్ మీడియా వేదికపై షేర్ చేశారు.

ట్విట్టర్ లో ఆమె ‘ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రస్‌కు శాశ్వత ప్రతినిధిగా నా పేపర్స్ సమర్పించాను. భారత్‌కు చెందిన ఒక మహిళకు తొలిసారి ఈ పదవి దక్కడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ నేను చెప్పేదొక్కటే.. మనం ఏదైనా సాధించగలం’ అని సూచిస్తూ బాధ్యతలు స్వీకరిస్తోన్నఫోటోని షేర్ చేశారు.

రుచిరా కాంబోజ్ (58) 1987 సివిల్ సర్వీస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా మహిళా టాపర్. 1989-1991 వరకు ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో మూడవ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత విదేశాంగ శాఖలో పని చేశారు. అనంతరం మారిషస్, దక్షిణాఫ్రికా, భూటాన్ సహా మరిన్ని దేశాల్లో కూడా సేవలందించారు.

ఈ సందర్భంగా ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా పనిచేసిన లక్ష్మీరాయ్.. రుచిరా కాంబోజ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంబోజ్ నియామకాన్ని UNలో మహిళల నాయకత్వానికి కొత్త మైలు రాయి అని అన్నారు. ఈ సందర్భంగా 1953లోనే యూఎన్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ విజయ లక్ష్మి పండిట్ గురించి ప్రస్తావిస్తూ..193 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీ దాదాపు 76 ఏళ్ల చరిత్రలో కేవలం నలుగురు మహిళా అధ్యక్షులే ఉన్నారని అన్నారు.కాగా..రుచిరా కాంబోజ్‌(58).. టీఎస్ తిరుమూర్తి స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టారు.