Russia Gas : ‘గ్యాస్‌ అస్త్రం’తో యూరప్ దేశాలపై పుతిన్ ప్రతీకారం..నాకూ టైమ్ వచ్చిదంటూ..గ్యాస్‌ సరఫరా నిలిపివేత

రష్యా గ్యాస్ యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. యుక్రెయిన్‌పై యుద్ధం తర్వాత తమ దేశంపై ఆంక్షలు విధించడంపై గుర్రుగా ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.... ఇప్పుడు రివేంజ్‌ తీర్చుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా రష్యా చేతిలో ఉన్న గ్యాస్‌ అస్త్రంతో యూరప్ దేశాల పని పడుతున్నారు.

Russia Gas : ‘గ్యాస్‌ అస్త్రం’తో యూరప్ దేశాలపై పుతిన్ ప్రతీకారం..నాకూ టైమ్ వచ్చిదంటూ..గ్యాస్‌ సరఫరా నిలిపివేత

Russia Gazprom Halts Gas Supplies To Latvia

Russia Gazprom halts gas supplies to Latvia : యుక్రెయిన్‌తో యుద్ధం తర్వాత తమపై ఆంక్షలను సీరియస్‌గా తీసుకున్నారు పుతిన్. దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా యూరోప్‌ విషయంలో తగ్గేదే లేదంటున్నారు పుతిన్. అందుకు గ్యాస్‌ను అస్త్త్రంగా వాడుకుంటున్నారు. మరోవైపు గ్యాస్‌ విషయంలో రష్యా మరింత కఠినంగా వ్యవహరించడంతో ఇంధన పొదుపునకు చర్యలు మొదలుపెట్టాయి ఐరోపా దేశాలు.

రష్యా గ్యాస్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. యుక్రెయిన్‌పై యుద్ధం తర్వాత తమ దేశంపై ఆంక్షలు విధించడంపై గుర్రుగా ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్…. ఇప్పుడు రివేంజ్‌ తీర్చుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా రష్యా చేతిలో ఉన్న గ్యాస్‌ అస్త్రంతో యూరప్ దేశాల పని పడుతున్నారు. ఇప్పటికే పలు యూరప్ దేశాలకు గ్యాస్‌ సరఫరా నిలిపివేసిన రష్యా… తాజాగా లాత్వియాకు షాక్ ఇచ్చింది. రష్యా గ్యాస్ సరఫరా దిగ్గజం గ్యాజ్‌ప్రోమ్‌ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. గ్యాస్‌ కొనుగోలు నిబంధన ఒప్పందాలను లాత్వియా ఉల్లంఘించిందంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బాల్టిక్‌ దేశమైన లాత్వియా గ్యాస్‌ అవసరాల కోసం 27 శాతం గ్యాస్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు రష్యా గ్యాస్‌ సప్లై కట్ చేయడంతో.. లాత్వియా ఇబ్బందుల్లో పడింది.

అయితే గ్యాస్‌ను రష్యా ఓ ఆయుధంలా వాడుతోందని లాత్వియా ఆరోపించింది. తాజాగా గ్యాజ్‌ప్రోమ్‌ నిర్ణయంతో తమపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని లాత్వియా ప్రకటించినప్పటికీ…. భవిష్యత్‌లో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి. యుక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి బల్గేరియా, ఫిన్లాండ్‌, పోలాండ్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌లకు రష్యా నుంచి గ్యాస్‌ సరఫరా నిలిచిపోయింది. ఆయా దేశాలు రూబుళ్లలో చెల్లించేందుకు నిరాకరించడంతో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.

గ్యాస్‌పై పుతిన్ కఠిన ఆంక్షలు విధిస్తుండటంతో యూరప్ దేశాలు సైతం అప్రమత్తమయ్యాయి. గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కరవుతున్న యూరప్ దేశాల్లో వేడి నుంచి ఉపశమన చర్యల కారణంగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని పిలుపునిచ్చారు స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్. తాత్కాలికంగా ప్రజలు టై ధరించడం మానేయాలన్నారు. మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ రంగ సిబ్బంది సైతం ఇదే పని చేయాలని కోరారు. టై ధరించకపోతే శరీరానికి ఉక్కపోత కాస్త తగ్గుతుందని.. తద్వారా ఏసీల వినియోగం తగ్గి, ఇంధన ఖర్చులు ఆదా అవుతాయని వివరించారు స్పెయిన్ ప్రధాని.

కొన్ని వారాలుగా యూరప్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలోనే దేశంలో ఇంధన ఖర్చులు పెరిగాయి. వేడిగాలుల కారణంగా స్థానికంగా గత రెండు వారాల వ్యవధిలో 500 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు.. ఇంధన వనరుల పెంపు, రష్యా గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు యూరోపియన్ కమిషన్.. 21 వేల కోట్ల డాలర్లతో ప్రత్యేక ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇటీవల ఫ్రాన్స్‌లో.. ఎయిర్ కండిషనింగ్ వృథాను నిరోధించేందుకు వీలైన చోట్ల ఇళ్లు, కార్యాలయాల తలుపులు మూసి ఉంచాలనే నిబంధనలు పెట్టారు. మొత్తంమ్మీద రష్యా కఠిన ఆంక్షలతో యూరప్‌ దేశాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెడుతూనే భవిష్యత్‌లో ఏర్పడబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నాయి. మరి రష్యా-యూరప్ దేశాల మధ్య గ్యాస్‌ వార్ ఇంకెంత కాలం కొనసాగుతుందో చూడాలి.