Russia Covid-19 Deaths : రష్యాలో రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు

రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

Russia Covid-19 Deaths : రష్యాలో రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు

Russia

Russia Covid-19 Deaths రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఆ దేశంలో గత ఎనిమిది రోజులుగా రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,378 కోవిడ్ పాజిటివ్ కేసులు, 737 కోవిడ్ మరణాలు నమోదైనట్లు మంగళవారం రష్యా ప్రకటించింది.

అయితే దేశంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన అత్యధిక కోవిడ్ మరణాలు ఇవేనని రష్యా తెలిపింది. రాజధాని మాస్కోలోనే గత 24 గంటల్లో 114 కోవిడ్ మరణాలు నమోదైనట్లు తెలిపింది. ఇక మొత్తంగా రష్యాలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 5,658,672గా ఉండగా, కోవిడ్ మరణాల సంఖ్య 1,39,316కి చేరింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,101,852గా ఉంది.

మరోవైపు, కరోనాకు కేంద్రంగా ఉన్న మాస్కోలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని నగర మేయర్ సెర్గియి సోబ్యానిన్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగుల్లో మూడొంతుల మందిని ఇంటికి పంపాలని కార్యాలయాలను మేయర్ ఆదేశించారు. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిని, గత ఆరు నెలల్లో కరోనా బారినపడి కోలుకున్న వారిని మాత్రమే అనుమతించాలని రెస్టారెంట్లను కోరారు. ఆగస్టు మధ్యనాటికి సేవారంగంలో ఉన్న వారిలో 60 శాతం పూర్తిగా వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబరు నాటికి దేశంలోని 60 శాతం మందికి టీకాలు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశంలో చాలా మంది వెనకాడుుతున్నారని,అయితే వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం అని ఇటీవల అధ్యక్షుడు పుతిన్ కూడా దేశ ప్రజలకు సూచించారు.

మంగళవారం(జులై-6,2021)నాటికి 1కోటి 20 లక్ష జనాభా ఉన్న మాస్కోలో 18లక్షల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి అయింది. రష్యా మొత్తం జనాభా 14.6 కోట్లు కాగా..ఇప్పటివరకు 1కోటి 82 లక్షల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి అయింది.