Russia-Ukraine War : రష్యా సైనికుల్ని అడ్డుకోవటానికి గ్రామాన్ని నీటితో ముంచేసిన యుక్రెయిన్ వాసులు

తమదేశంపై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా సైనికుల్ని అడ్డుకోవటానికి యుక్రెయిన్ వాసులు తమ ప్రాణాల్ని కూడా పణ్ణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో వరద నీటితో ఓ గ్రామాన్ని ముంచేశారు.

Russia-Ukraine War : రష్యా సైనికుల్ని అడ్డుకోవటానికి గ్రామాన్ని నీటితో ముంచేసిన యుక్రెయిన్ వాసులు

Village Flooded By Villagers To Stop Russian Soldiers (2)

Village Flooded By Villagers To Stop Russian Soldiers : తమదేశంపై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా సైనికుల్ని అడ్డుకోవటానికి యుక్రెయిన్ వాసులు తమ ప్రాణాల్ని కూడా పణ్ణంగా పెడుతున్నారు. యుద్ధ ట్యాంకులకు ఎదురెళ్లటం..దారిలో ఉన్న ల్యాండ్ మైన్లను ఒట్టి చేతులతో వెలికి తీసి పారేసిన ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. రష్యా సైనికులపై ఇంట్లోనే పెట్రోల్ బాంబులు తయారు చేసి విసరటం వంటి ఎన్నో సాహసాలు చేశారు యుక్రెయిన్ ప్రజలు. ఓ రైతు అయితే ఏకంగా రష్యా సైన్యానికి సంబంధించి ఓ యుద్ధ ట్యాంకునే ఎత్తుకుపోయాడు. ఓ ట్రాక్టర్ కు యుద్ధ ట్యాంకును కట్టి పట్టుకుపోయాడు. ఇటువంటివి ఎన్నో ఎన్నెన్నో చేసిన యుక్రెయిన్ వాసులు తాజాగా మరో సాహసం చేశారు.

Image

రష్యా సైనికులను అడ్డుకోవటానికి నది నీటిని మళ్లించి ఓ గ్రామాన్ని నీటితో నింపేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామాన్ని వరదతో ముంచేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాంబులు, రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్న రష్యా సైనికులను అడ్డుకోవటానికి యుక్రెయిన్ వాసులు దెమిదివ్ అనే గ్రామాన్ని వరదతో ముంచేశారు.ఓ వైపు ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతున్నా.. బాంబులతో పెను విధ్వంసం సృష్టిస్తున్నా యుక్రెయిన్ మాత్రం పట్టు వదలకుండా మొదటిరోజు ఉన్న స్ఫూర్తితో పోరాడుతూనే ఉంది. ఇప్పటికే పలు నగరాలను రష్యా చేజిక్కించుకున్నా.. దేశాన్ని కాపాడుకునే ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రజలూ పెద్ద సాహసాలే చేస్తున్నారు.

Image

దాంట్లో భాగంగానే ఊర్లను కావాలనే జనాలు వరదల్లో ముంచేస్తున్నారు. పొరుగున పారే నదుల్లో మోటార్లు వేసి నీటిని తోడి గ్రామాల్లోకి మళ్లిస్తున్నారు. అలాంటి ఘటనే రాజధాని కీవ్ కు సమీపంలోని దెమిదివ్ గ్రామంలో జరిగింది. రష్యా యుద్ధ ట్యాంకులు వెళ్లలేకుండా ఊరు మొత్తాన్ని గ్రామస్థులు వరద నీటితో ముంచేశారు. దినిప్రో నది నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడిపోస్తున్నారు.ఉక్రెయిన్ పై రష్యా చేసిన దండయాత్ర కన్నా ఈ నష్టం కష్టం తమకు పెద్దదేమీ కాదని గ్రామస్థులు తల ఎత్తుకుని సగర్వంగా చెబుతున్నారు. రష్యాను మట్టికరిపించేందుకు ఏదైనా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఊరిని వరదల్లో ముంచేసినందుకు ఏ ఒక్కరికీ బాధ లేదని గ్రామస్థులు చెబుతున్నారు. రష్యా నుంచి తమ దేశాన్ని, ప్రాంతాన్ని, భూభాగాన్ని కాపాడుకునేందుకు ఇదో చిన్న ప్రయత్నమని చెప్పుకొచ్చారు.

Image

ఇక, గత నెలలో వచ్చిన వరదల కారణంగా పలు ప్రాంతాల నుంచి రష్యా తన బలగాలను వెనక్కు రప్పించుకుంది. అంటే రష్యా వెనకడుగు వేయడంలో వరదలు కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే దెమిదివ్ గ్రామస్థులు ఉడుతాభక్తిగా తమ ఊరిని ముంచేసుకున్నారు. ధైర్యం అనేది ఉక్రెయిన్ ప్రజల డీఎన్ఏల్లోనే ఉందని ఉక్రెయిన్ ప్రభుత్వాధికారి మిఖాయిల్ ఫెడోరోవ్ చెప్పారు. ఊరిని వరదలతో ముంచేసిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. ఈ నిర్ణయం వల్ల రాజధాని కీవ్ లో బలగాలు డిఫెన్సివ్ చర్యలను చేపట్టేందుకు అవకాశం దొరికినట్టయిందన్నారు. సాధారణ పౌరులు కూడా హీరోల్లామారి విజయం కోసం పోరాడుతున్నారని కామెంట్ చేశారు.