సూయజ్ కెనాల్ లోతు, వెడల్పు పెంచేందుకు ఈజిప్ట్ నిర్ణయం

అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సూయజ్‌ కాలువలో ఈ ఏడాది మార్చిలో భారీ కంటైనర్ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ వారం రోజులు ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయి ముప్పుతిప్పలు పెట్టిన నేపథ్యంలో ఈజిప్టు కీలక నిర్ణయం తీసుకుంది.

సూయజ్ కెనాల్ లోతు, వెడల్పు పెంచేందుకు ఈజిప్ట్ నిర్ణయం

Suez Canal Chief Proposes Widening Deepening Vital Waterway

Suez Canal అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సూయజ్‌ కాలువలో ఈ ఏడాది మార్చిలో భారీ కంటైనర్ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ వారం రోజులు ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయి ముప్పుతిప్పలు పెట్టిన నేపథ్యంలో ఈజిప్టు కీలక నిర్ణయం తీసుకుంది. సూయజ్ కాలువ లోతు, వెడల్పు పెంచేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు మంగళవారం ఇస్మాయిలియా నగరంలో జరిగిన సమావేశంలో సూయిజ్ కాలువ పర్యవేక్షణ అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రాబీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫతే అల్-సీసీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సూయజ్‌ కాలువ దక్షిణ భాగంలో 30 కిలోమీటర్ల మేర దాదాపు 40 మీటర్ల(131 అడుగులు) వెడల్పును పెంచనున్నారు. అదేవిధంగా, కాలువ ప్రస్తుతం ఉన్న లోతు 66 అడుగుల నుంచి 72 అడుగుల వరకు పెంచనున్నారు. 2015లో ప్రారంభించిన కాలువ రెండో వరుస ఇప్పటివరకు 30 కిలోమీటర్ల పొడవును మాత్ర‌మే కలిగి ఉండగా..ఈ పొడ‌వును మ‌రో 10 కి.మీ విస్తరించ‌నున్నారు. దీనికి రెండేళ్లు పడుతుందని ఒసామా రాబీ తెలిపారు.

ఇదే సమావేశంలో పాల్గొన్న ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతే అల్-సీసీ మాట్లాడుతూ.. గతంలో సూయజ్ కాలువ విస్తరణ సమయంలో ప్రభుత్వం చేసిన మాదిరిగానే ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్టు కోసం “భారీ” ప్రజా నిధులను సమీకరించట్లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టుని తొందరగా పూర్తి చేసేయాలన్న ఆత్రుత తమకు లేదని సృష్టం చేశారు.

మరోవైపు.. మార్చి నెలలో సూయిజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి భారీ నష్టాన్ని కలిగించిన ఎవర్ గివెన్ నౌకను ఈజిప్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవర్ గివెన్ నౌక సూయిజ్‌ కాల్వలో చిక్కుకోవడం వల్ల వాణిజ్య పరంగా భారీ నష్టం వచ్చిందని ఈజిప్టు​ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన పరిహారాన్ని యజమాని చెల్లించే వరకు నౌకను వదిలిపెట్టేది లేదని సూయిజ్​ కాలువ చీఫ్​ లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రాబీ తేల్చిచెప్పారు. ప్రభుత్వం విధించిన మొత్తాన్ని చెల్లించేందుకు ఓడ యజమాని సిద్ధంగా లేరని తెలిపారు. ఈ రాకాసి ఓడపై ప్రభుత్వం సుమారు 900 మిలియన్​ డాలర్లు జరిమానా విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఎవర్‌ గివెన్‌… జపాన్‌కు చెందిన షోయీ కిసెన్‌ కైసా లిమిటెడ్‌ది కాగా, తైవాన్‌కు చెందిన ఎవర్‌ గ్రీన్‌ సంస్థ నడుపుతోంది.