Russia ukraine : war @ 2నెలలు..యుక్రెయిన్ పై యుద్ధంతో రష్యా ఏం సాధించింది…?

యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఏం సాధించింది...? యుద్ధంలో సర్వస్వం కోల్పోతున్నా యుక్రెయిన్ ఎందుకోసం పోరాడుతోంది...? యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా సహా పాశ్చాత్యదేశాలు తీసుకుంటున్న చర్యలేంటి..? ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పర్యటన తర్వాతైనా పరిస్థితి మారుతుందా..?

Russia ukraine : war @ 2నెలలు..యుక్రెయిన్ పై యుద్ధంతో రష్యా ఏం సాధించింది…?

Russia-Ukraine war

Russia ukraine : war @ 2నెలలు..: యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఏం సాధించింది…? యుద్ధంలో సర్వస్వం కోల్పోతున్నా యుక్రెయిన్ ఎందుకోసం పోరాడుతోంది…? యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా సహా పాశ్చాత్యదేశాలు తీసుకుంటున్న చర్యలేంటి..? ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పర్యటన తర్వాతైనా పరిస్థితి మారుతుందా..? రష్యా…యుక్రెయిన్‌లో స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్న వేళ కలుగుతున్న సందేహాలివి.

యుద్ధం సృష్టించేది పెనువిధ్వంసమే. ఆ యుద్ధం రెండు రోజులు జరిగినా..రెండు వారాలు దాటినా..రెండు నెలల పాటు సాగినా..విధ్వంస రచన మరింత భీతావహంగా ఉండడం తప్ప…మరే ప్రయోజనమూ ఉండదు. ఎవరు గెలిచినా..ఎవరు ఓడినా అంతిమంగా పొందేదేమీ ఉండదు. సైనికులు, సాధారణ ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం, వికలాంగులుగా మారడం, ఇల్లూవాకిళ్లూ పోగొట్టుకుని, విడిచిపెట్టి లక్షల మంది నిరాశ్రయులవ్వడం వంటివి యుద్ధం వల్ల కలిగే దుష్పరిణామాలు. అందుకే అసలు యుద్ధం జరగకూడదనే అందరూ కోరుకుంటారు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో అది జరిగినా..ఎంత త్వరగా ముగిసిపోతుందా అని ఎదురుచూస్తుంటారు. రెండు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తూ…ప్రజలందరి జీవనంపై ప్రభావం చూపిన రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలోనూ ఇదే జరుగుతోంది. యుద్ధం ముగిసిందన్న వార్త ఎప్పుడు వింటామా అని అందరూ ఆతృతగా గమనిస్తోంటే..అటు రష్యా, ఇటు యుక్రెయిన్ మాత్రం…యుద్ధాన్ని ఎంత సాగదీద్దామా అన్న తరహాలో ముందుకు పోతున్నాయి. భారీ ప్రాణనష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని లెక్కచేయకుండా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. రష్యాపై కోపంతో, తమ ప్రభావాన్ని చాటాలన్న ఉద్దేశంతో అమెరికా సహా ఇతర దేశాలు ఆయుధాలు అందిస్తూ యుక్రెయిన్‌ను వీలయినంతగా ఎగదోస్తున్నాయి.

Also read : America Warns China Again : రష్యాకు పట్టిన గతే పడుతుంది- చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్

ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్టు పుతిన్ ప్రకటించిన సమయంలో యుద్దం ఇంత సుదీర్ఘంగా జరగుతుందని ఎవరూ భావించలేదు. రెండు, మూడు రోజుల్లో యుక్రెయిన్ ను రష్యా ఆక్రమించుకుంటుందని, కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ.. ఆ దేశ పౌరులు రష్యా బలగాలను…ప్రపంచం ఊహించని స్థాయిలో ప్రతిఘటిస్తుండడంతో రెండు నెలలు దాటినా యుద్ధం కొలిక్కిరావడం లేదు. అమెరికా, యూరప్ దేశాలు అందించిన ఆయుధాలతో రష్యా ప్రతిష్టాత్మక యుద్ధనౌక మాస్క్‌ వాతో పాటు అనేక విమానాలను కూల్చివేసింది యుక్రెయిన్. రష్యాకు లొంగేదిలేదని తేల్చిచెబుతోంది.

అనుకున్నంత వేగంగా యుద్దాన్ని ముగించలేకపోయిన మాస్కో..కొత్త కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. అయితే ఇప్పటిదాకా యుక్రెయిన్ లోని ఏయే నగరాలను రష్యా ఆక్రమించుకుందనేదానిపై స్పష్టత లేదు. రెండు దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నాయి. అయితే రష్యాకు అత్యంత కీలకమైన..యుద్ధం ప్రారంభానికిముందు పుతిన్ స్వతంత్రంగా గుర్తించిన డాన్ బాస్ ప్రాంతానికి పక్కనే ఉన్న మరియుపోల్‌ మాత్రం మాస్కో హస్తగతం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా పుతిన్ ప్రకటించారు. యుక్రెయిన్‌లోని ఓ నగరం ఆక్రమించుకున్నామని పుతిన్ ప్రత్యక్షంగా ప్రకటించడం ఇదే మొదటిసారి.

Also read : UN Chief Antonio Guterres : రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఆగేనా? త్వరలో పుతిన్, జెలెన్ స్కీతో UN చీఫ్ కీలక భేటీ

అక్కడి ఓ స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులను బంధించిన రష్యా..వారిని విడిచిపెట్టడం లేదు. ఈ నగరంలో యుక్రెయిన్ సైనికులను సైతం రష్యా బందీలను చేసింది. దీనిపై జెలన్‌స్కీ రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. యుక్రెయిన్ సైనికులకు, పౌరులకు ఎలాంటి హాని తలపెట్టినా, రష్యా స్వాధీనం చేసుకున్న ఖేర్సన్‌లో ఎలాంటి రెఫరెండం నిర్వహించినా..శాంతి చర్చల నుంచి వైదొలుగుతామని జెలన్‌స్కీ ప్రకటించారు. యుద్ధం నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై పుతిన్‌తో చర్చలకు సిద్ధమన్నారు జెలన్‌స్కీ. మరోవైపు యుద్దం మొదలయినదగ్గరనుంచి మరియుపోల్‌పై బాంబులతో విరుచుకుపడిన రష్యా…అక్కడ మారణహోమం సృష్టించిందని అంతర్జాతీయ మీడియా ఆరోపిస్తోంది. రష్యా బలగాల దాడుల్లో 20వేల మంది మరియుపోల్ పౌరులు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. తమ యుద్ధ నేరాలు బటయపడకుండా ఉండేందుకు సామూహిక సమాధుల్లో సాధారణ ప్రజల మృతదేహాలను రష్యా బలగాలు పూడ్చిపెట్టాయని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.
తూర్పు యుక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.

అటు యుద్ధం మొదలయిన దగ్గర నుంచి భద్రతామండలి సమావేశాలు, ఓటింగ్ వంటివాటితో సరిపెట్టిన ఐక్యరాజ్యసమితి తొలిసారి యుద్ధ నివారణకోసం ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతోంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రస్ రష్యా, యుక్రెయిన్, శాంతి చర్చలకు వేదికగా ఉన్న టర్కీలోనూ పర్యటించనున్నారు. ముందుగా టర్కీ వెళ్లే గుట్రస్ తర్వాత మాస్కో వెళ్లి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమవుతారు. అనంతరం కీవ్ వెళ్తారు. అయితే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి యుక్రెయిన్ కంటే ముందు మాస్కో వెళ్లడాన్ని జెలన్‌స్కీ తప్పుపట్టారు. యుద్దం జరుగుతోంది యుక్రెయిన్‌లోనని, మాస్కోలో యుద్ధ బాధితులు లేరని, మరి గుట్రస్ ఆ నగరానికి ఎందుకు వెళ్తున్నారని జెలన్‌స్కీ ప్రశ్నించారు.

Also read : Ukraine War : తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్.. రష్యా సైనికులు ఎంతమంది హతమయ్యారంటే?

యుద్ధం మూడో నెలలోకి ప్రవేశించిన సమయంలో పుతిన్ వైఖరే కాదు..జెలన్‌స్కీ వ్యవహారశైలిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు ఓ వైపు శాంతిచర్చలంటూనే మరోవైపు మరిన్ని ఆయుధాలు అందించాలని అమెరికా, యూరప్ దేశాలను కోరుతున్నారు. రెండువారాల క్రితం కీవ్‌లో పర్యటించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తోనూ, ఇప్పుడు పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి, రక్షణమంత్రితోనూ ఆయుధాల గురించే చర్చలు జరిపారు. అటు పుతిన్, ఇటు జెలన్‌స్కీ ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం ఎలా ముగుస్తుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. అటు యుక్రెయిన్ ప్రజల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు నెలల కాలంలో 65లక్షల మంది శరణార్థులుగా యుక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు తరలివెళ్లారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.