కరోనా కరాళ నృత్యం: ఆమె అంచనా నిజమైంది.. అమెరికాలో 2లక్షల మంది మృతి

  • Published By: raju ,Published On : September 20, 2020 / 08:02 AM IST
కరోనా కరాళ నృత్యం: ఆమె అంచనా నిజమైంది.. అమెరికాలో 2లక్షల మంది మృతి

జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా ప్రపంచంలో తగ్గలేదు. అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు గజగజ వణికిపోతుంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అమెరికా, భారతదేశం మరియు బ్రెజిల్‌ మూడు దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. భారతదేశంలో కరోనా కేసులు మరియు మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో అమెరికా, ఇండియా, బ్రెజిల్ దేశాల్లో వరుసగా 42525, 30913, 92755 కేసులు నమోదయ్యాయి. వరుసగా 657, 708, 1149 మరణాలు నమోదయ్యాయి.

ఆది నుంచి కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితం అవుతున్న దేశాలతో పోలిస్తే.. ప్రతి రోజు భారతదేశంలో అత్యధిక కరోనా కేసులు వస్తున్నాయి. భారతదేశంలో వేగంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా వరల్డ్ మెట్రోమీటర్ ప్రకారం, సెప్టెంబరు 20 ఉదయం నాటికి అమెరికాలో కరోనా వైరస్ రోగుల సంఖ్య 69 లక్షల 67 వేలకు పెరిగింది. అందులో 2 లక్షల 3 వేల మంది మరణించారు. ఇక భారతదేశంలో 54 లక్షలకు పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. వీరిలో 86 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో, బ్రెజిల్‌లో మొత్తం సోకిన వారి సంఖ్య 45 లక్షల 28 వేలు దాటింది, ఇక్కడ లక్షా36 వేల మంది మరణించారు. బ్రెజిల్‌లో అత్యధిక మరణాల రేటు ఉంది.



అమెరికాలో ఇప్పటివరకు 42 లక్షల 23 వేల మంది కోలుకోగా.. 25 లక్షల 39 వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. భారతదేశంలో రికవరీ రేటు 79 శాతంగా ఉంది. అంటే మొత్తం సోకిన వారిలో 43 లక్షల మంది కోలుకున్నారు. 10 లక్షల 11 వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో, ప్రపంచంలో మూడవ అత్యంత ప్రభావితమైన దేశం బ్రెజిల్‌లో 5.71 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య 38.20 లక్షలుగా ఉంది. వరల్డ్‌మీటర్ ప్రకారం, 3కోట్ల మందికి(30,982,249) ఇప్పటివరకు కరోనా సోకింది. వీరిలో 9 లక్షల 60 వేల మంది(961,373) ప్రాణాలు కోల్పోగా, 2 కోట్ల 25 లక్షల మంది(22,582,580) కోలుకున్నారు. మొత్తం ప్రపంచంలో 74 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి.

మార్చి 30కు ముందు అమెరికాలో డాక్టర్ డెబోరా బిర్క్స్ వైట్ హౌస్‌ ముందు మాట్లాడుతూ.. కరోనావైరస్ గురించి భయంకరమైన అంచనా వేశారు, అప్పటికి, యునైటెడ్ స్టేట్స్‌లో 3వేల కంటే తక్కువ కేసులు ఉన్నాయి. అప్పుడు దాదాపుగా, 100,000 నుండి 200,000 వరకు మరణాలు సంభవించవచ్చు అని ఆమె అన్నారు. బిర్క్స్ అంచనా ఇప్పడు నిజమైంది. ఎందుకంటే యుఎస్‌లో కోవిడ్ -19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 200,000 కు చేరుకుంది.