UK PM Rishi Sunak Pongal Lunch : తన స్టాఫ్‌కి అరిటాకుల్లో సంక్రాంతి విందు ఇచ్చిన రిషి సునక్

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసంలో తన కార్యాలయం ఉద్యోగులకు సంప్రదాయ రుచులతో విందు ఏర్పాటు చేశారు. అరటి ఆకుల్లో వడ్డించిన భారతీయ వంటకాలను ఆరగిస్తున్న ఉద్యోగుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

UK PM Rishi Sunak Pongal Lunch : తన స్టాఫ్‌కి అరిటాకుల్లో సంక్రాంతి విందు ఇచ్చిన రిషి సునక్

UK PM Rishi sunak Pongal lunch : భారతీయులు ఏదేశంలో ఉన్నా వారి మర్యాదలు మర్చిపోరు. ఏ స్థాయికి చేరుకున్నా భారతీయత ఉట్టిపడే సంప్రదాయాన్ని మర్చిపోరని బ్రిటన్ ప్రధాని భారతీయ మూలాలున్న రిషి సునక్ మరోసారి నిరూపించారు. అనూహ్య పరిణామాలతో బ్రిటన్ ప్రధాని అయిన రిషి సునక్ తన కార్యాలయ సిబ్బందికి సంక్రాంతి రుచులతో అరిటాకుల్లో భోజనాలు పెట్టి మరోసారి భారతీయతను చాటుకున్నారు. భారతీయులకు ముఖ్యంగా దక్షిణాదివారికి సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండగ.

అటువంటి సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసంలో తన కార్యాలయం ఉద్యోగులకు సంప్రదాయ రుచులతో విందు ఏర్పాటు చేశారు. అరటి ఆకుల్లో వడ్డించిన భారతీయ వంటకాలను ఆరగిస్తున్న ఉద్యోగుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా బ్రిటీష్ వారు స్పూన్లు, ఫోర్కులతోనే తింటారు. చేత్తో తినరు. కానీ రిషి స్టాఫ్ (కొందరు) మాత్రం సంక్రాంతి రుచులను చేతులతో తింటూ ఆస్వాదించటం వీడియోలో కనిపిస్తోంది. కొంతమంది వేళ్లు నాక్కుంటూ తినటం చూస్తే ఆ వంటకాలు వారికి ఎంతగా నచ్చాయో తెలుస్తోంది. అంతేకాదు రిషి కార్యాలయం వద్ద భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.

రిషి సునక్ ఇచ్చిన సంక్రాంతి విందులో సంప్రదాయపు రుచులు ఘుమఘుమలాడాయి. బెల్లపు పాయసం, ఇడ్లీ, చట్నీ, అరటిపళ్లను సిబ్బంది ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ ఆరగించారు. సంప్రదాయిక దుస్తుల్లో ఓ వ్యక్తి ‘‘ఇంకాస్త వడ్డించమంటారా’’ అని ఉద్యోగులను అడగటం భారతీయ మర్యాదలకు నిదర్శనంగా కనిపిస్తోంది. వంటకాలు భలే రుచిగా ఉన్నాయంటూ కొందరు ప్రశంసించడం.. వైరల్‌గా మారాయి. రిషి సునక్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఈ శుభసందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ పర్వదినం దేశంలోని అనేక కుటుంబాలకు ఎంత విశిష్టమైనదో నాకు తెలుసు. బ్రిటన్‌ ప్రజలతో పాటూ వివిధ దేశాల్లో పొంగల్ జరుపుకుంటున్న వారందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్యర్యం, శాంతిసౌభాగ్యాలు కలగాలని ఆశిస్తున్నా’’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు.