Russia-Ukraine war: 18 క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసిన ఉక్రెయిన్
రష్యా 18 గగనతల, సముద్ర, భూతల క్షిపణులను వాడిందని ఉక్రెయిన్ ఆర్మీ దళాల చీఫ్ వాలెరి జలుజ్నీ కూడా తెలిపారు.

Russia-Ukraine war
Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా (Russia) మరోసారి భీకరదాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ (Kyiv) ను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణులతో దాడులు జరిపింది. దీనిపై ఉక్రెయిన్ అధికారులు స్పందిస్తూ.. కీవ్ పైకి దూసుకొస్తున్న 18 క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేశామని చెప్పారు.
రష్యా దాడులను గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా ఉక్రెయిన్ తిప్పికొట్టే ప్రయత్నాలు చేసింది. ఈ దాడులు చేయడానికి రష్యా డ్రోన్లను కూడా వాడింది. రష్యా దాడుల్లో ముగ్గురికి గాయాలయ్యాయని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. కీవ్ లో భారీ ఎత్తున శబ్దాలు వినపడ్డాయి.
రష్యా 18 గగనతల, సముద్ర, భూతల క్షిపణులను వాడిందని ఉక్రెయిన్ ఆర్మీ దళాల చీఫ్ వాలెరి జలుజ్నీ కూడా తెలిపారు. అతి తక్కువ సమయంలో భారీగా క్షిపణులతో దాడులు చేయడానికి రష్యా ప్రయత్నించిందని అధికారులు చెప్పారు. రష్యా ప్రయోగించిన క్షిపణులను ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ వెంటనే గుర్తించి, వాటిని ధ్వంసం చేయడంతో నష్టం తప్పింది.
ఈ దాడుల్లో రష్యా కింజల్ హైపర్‌సోనిక్ క్షిపణులను కూడా వాడిందని ఉక్రెయిన్ గుర్తించింది. హైపర్‌సోనిక్ క్షిపణులు ధ్వని వేగం కంటే 5 రెట్ల అధిక వేగంతో ప్రయాణించగలుగుతాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా నెల వ్యవధిలో ఎనిమిది సార్లు దాడులు చేసింది. ఇటీవల తమ దేశ అధ్యక్షుడు పుతిన్ ను చంపేయడానికి ఉక్రెయిన్ దాడులు చేసిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో రష్యా ప్రతీకార దాడులు చేసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ మరింత అప్రమత్తమైంది.
Guinness World Record : 90 గంటలు.. 110 వంటలు.. ప్రపంచ రికార్డు కోసం నాన్ స్టాప్‌గా వంట చేసిన చెఫ్