యూఎస్ కేపిటల్ భవనం వద్ద దాడి ఘటనలో పోలీస్ అధికారి మృతి..జాతీయ జెండా అవనతం

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. భవనం ఆవరణలో ఓ కారు బీభత్సం సృష్టించింది.

యూఎస్ కేపిటల్ భవనం వద్ద దాడి ఘటనలో పోలీస్ అధికారి మృతి..జాతీయ జెండా అవనతం

Us

US flags at half అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. భవనం ఆవరణలో ఓ కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నాం క్యాపిటల్ భవనం వెలుపల ఉన్న చెక్​పోస్ట్ వద్ద బ్లూ సెడాన్ కారు వేగంగా దూసుకురావడాన్ని గమనించిన కేపిటల్ సెక్యూరిటీ పోలీసులు.. “హేయ్ ఆగు” అంటుంటే… ఆ కారు దూసుకొచ్చి… పోలీసుల మీద నుంచి వెళ్లిపోయి కాంప్లెక్స్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ పోలీస్ చనిపోగా, మరో పోలీస్ గాయపడ్డారు.

అనంతరం వాహనంలోంచీ కిందకు దూకిన దుండగుడు… కత్తితో మిగతా సెక్యూరిటీ పోలీసులపైకి దూసుకొస్తుంటే… పోలీసులు కాల్పులు జరిపి అతన్ని కాల్చి చంపారు. దుండగుడు ఇండియానాకు చెందిన 25 ఏళ్ల నల్లజాతీయుడు నోహ్‌ గ్రీన్‌ గా యూఎస్‌ అధికారులు గుర్తించారు. అతనికి బ్లాక్ నేషనలిస్ట్ నేషన్ ఆఫ్ ఇస్లామ్ ఉద్యమంతో సంబంధం ఉందని గుర్తించారు. నోవా గ్రీన్… కొన్నాళ్లుగా అమెరికా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. అతనో నిరుద్యోగి, అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. అమెరికాను నల్లజాతీయలకు ప్రధాన శత్రువుగా అతను తన పోస్టుల్లో చెబుతున్నాడు.

ఈ ఘటనలో తీవ్రవాదులకు సంబంధముందని భావించట్లేదని వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ రాబర్ట్ కాంటె పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఘటనతో క్యాపిటల్‌ హిల్స్‌ భవనాన్ని మూసివేశారు. క్యాపిటల్‌ భవన సముదాయం వద్ద నేషనల్‌ గార్డ్స్‌ను మోహరించారు. కాగా, జనవరి 6న ట్రంప్‌ మద్దతుదారులు కేపిటల్ భవనంపై దాడి తర్వాత ఆ తరహా ఘటన ఇదేనని అధికారులు తెలిపారు. ఆ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు చనిపోయారు. దానితో ప్రస్తుత దాడికి సంబంధం ఉందని ఇప్పడే చెప్పలేమని అధికారులు తెలిపారు.

ఇక, దుండగుడి దాడిలో చనిపోయిన పోలీస్ అధికారి “విలియం ఎవాన్స్‌” 18 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. చనిపోయిన పోలీసు విలియం ఇవాన్స్ కుటుంబానికి అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. జిల్ బైడెన్, నేను ఆ హింసాత్మక ఘటన గురించి తెలుసుకొని ఎంతో భారమైన హృదయంతో ఉన్నాం అని బైడెన్ తన స్టేట్‌మెంట్‌లో తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన అధికారికి సంతాప సూచకంగా శ్వేతసౌధంలో జాతీయ జెండాను అవనతం(సగానికి దింపడం) చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 6 వరకు శ్వేతసౌధంలో జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు.