US Anti Gun : తుపాకి నియంత్రణ చట్టంపై సంతకం చేసిన బైడన్..బిల్లుకు లభించిన ఆమోదం

అమెరికన్ల ఉసురుతీస్తున్న ఆయుధానికి ఒక్క సంతకంతో చెక్‌ పెట్టారు అధ్యక్షుడు బైడన్. టెక్సాస్‌లో పారిన చిన్నారుల నెత్తురు సాక్షిగా తుపాకి సంస్కృతిని తుదముట్టిద్దామని పిలుపునిచ్చిన బైడన్ చెప్పినట్టుగానే ఆయుధం అరాచకానికి చరమగీతం పాడేందుకు కీలక అడుగు వేశారు. కొన్ని దశబ్దాలుగా అమెరికన్లకు నెరవేరని కలలా ఉన్న తుపాకి నియంత్రణ చట్టానికి ఆమోద ముద్ర వేశారు.

US Anti Gun : తుపాకి నియంత్రణ చట్టంపై సంతకం చేసిన బైడన్..బిల్లుకు లభించిన ఆమోదం

Biden Signs Most Sweeping Gun Control Law In Decades

Biden signs most sweeping gun control law in decades : బైడన్ అన్నట్టుగా ఇక బతుకులకు భరోసా ఉన్నట్టేనా…? మనుషులకన్నా ఆయుధాలు ఎక్కువగా ఉండే దేశంలో ఇకముందయినా..ఇష్టానుసారం తుపాకులు పేలకుండాఉంటాయా…? కొత్త చట్టంతో అయినా ఆయుధం చేసే హత్యలకు బ్రేక్ పడుతుందా..? గన్ కంట్రోల్ చట్టంపై అధ్యక్షుడు చేసిన చరిత్రాత్మక సంతకం అమెరికన్ల జీవితాలకు రక్షణ కవచంగా మారుతుందా..?

హత్యలు, ఆత్మహత్యల రూపంలో రోజుకు 50 మందికి పైగా అమెరికన్ల ఉసురుతీస్తున్న ఆయుధానికి ఒక్క సంతకంతో చెక్‌ పెట్టారు అధ్యక్షుడు బైడన్. టెక్సాస్‌లో పారిన చిన్నారుల నెత్తురు సాక్షిగా తుపాకి సంస్కృతిని తుదముట్టిద్దామని పిలుపునిచ్చిన బైడన్ చెప్పినట్టుగానే ఆయుధం అరాచకానికి చరమగీతం పాడేందుకు కీలక అడుగు వేశారు. కొన్ని దశబ్దాలుగా అమెరికన్లకు నెరవేరని కలలా ఉన్న తుపాకి నియంత్రణ చట్టానికి ఆమోద ముద్ర వేశారు. బిల్లును గురువారం సెనేట్ ఆమోదించగా, శుక్రవారం తుది ఆమోదం లభించింది. బైడన్ సంతకంతో ఇది అమల్లోకి వచ్చింది.

Also read : US SC Judgment Abortions : అబర్షన్ హక్కును రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు…ఇతరదేశాలపై ప్రభావం

తుపాకి నియంత్రణ చట్టం ప్రకారం ఆయుధాలు ఇష్టానుసారం కొనుగోలు చేయడం కుదరదు. 21 ఏళ్లలోపు వయసున్న వారు ఆయుధాలు కొనాలంటే అధికారులు వారి నేపథ్యాన్ని ఆరా తీస్తారు. వారి గురించి సమస్త సమాచారం సేకరిస్తారు. దీనివల్ల హింసకు పాల్పడే వారికి ఆయుధాలు అందకుండా అడ్డుకునే అవాకశముంది. అలాగే కొత్త చట్టం ప్రకారం ప్రమాదకరంగా భావించే వ్యక్తుల దగ్గరనుంచి ఆయుధాలు సులువుగా స్వాధీనం చేసుకోవచ్చు. అలాగే గృహ హింస వంటి నేరాలకు పాల్పడిన వారు ఇకపై తుపాకులు పొందడం అత్యంత కష్టంగా మారనుంది. టెక్సాస్‌ స్కూళ్లో 19 మంది చిన్నారుల హత్య అమెరికాను కుదిపేసింది. ఈ అమానుషంపై బైడన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు మిగిలిన దేశాల్లో అత్యంత అరుదుగా జరుగుతాయని, అమెరికా ప్రజలు మాత్రం అనునిత్యం ఇలాంటి కాల్పుల మధ్యే జీవితాలు వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తుపాకి చేస్తున్న హత్యలకు ఇకనైనా ముగింపు పలికేందుకు కఠిన చర్యలు తీసుకుందామని పిలుపునిచ్చారు.

అయితే టెక్సాస్ దారుణం తర్వాత అమెరికా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. వరుసగా కాల్పుల ఘటనలు జరుగుతూనే వచ్చాయి. దీనికి తోడు తుపాకి నియంత్రణ చట్టంపై నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అయితే…అమెరికన్లకు ఆయుధం కావల్సిందేనని వాదించారు. జాతీయ రైఫిల్ అసోసియేషన్ వార్షికోత్సవానికి హాజరైన ఆయన ఆయుధాన్ని ఆయుధంతోనే ఎదుర్కోగలమని, చెడ్డ వ్యక్తుల బారి నుంచి తప్పించుకునేందుకు మంచి వ్యక్తి ఆయుధాన్ని పట్టుకోవాలని, అమెరికన్లకు మరిన్ని తుపాకులు కావాలని వితండ వాదన చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు, అక్కడి పరిస్థితులు, అమెరికా రాజకీయాలపై దశాబ్దాలుగా జాతీయ రైఫిల్ అసోసియేషన్‌కు ఉన్న పట్టు గమనించిన వారు ఇక ఆ దేశంలో తుపాకిని నియంత్రించడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చారు. ఆ దేశ సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో విచిత్రంగా స్పందించింది. మహిళలకు అబార్షన్ హక్కు లేదన్న సుప్రీంకోర్టు…అమెరికన్లకు ఆయుధం హక్కు మాత్రం ఉందని వ్యాఖ్యానించింది. బహిరంగంగా తుపాకి కలిగి ఉండే హక్కు అమెరికన్లకు ఉందని, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, బోస్టన్ సహా అన్ని నగరాలు, ఇతర ప్రాంతాల్లో ప్రజలు తమ వెంట ఆయుధాలు తీసుకెళ్లొచ్చని తెలిపింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగినప్పటికీ….అమెరికా సెనేట్ మాత్రం సమయోచితంగా వ్యవహరించింది. దేశంలో విషసంస్కృతిలా పేరుకుపోయిన ఆయుధాన్ని నియంత్రించకపోతే..అమెరికన్ల భవిష్యత్ ప్రమాదంలో పడిపోయే ప్రమాదముందని గుర్తించిన సెనేట్‌ తుపాకికి బ్రేక్ వేసింది.

Alos Read : Abortion Rights: అబార్షన్ హక్కుల కోసం మహిళల పాదయాత్ర

తుపాకి నియంత్రణ చట్టంపై సంతకం చేసిన తర్వాత బైడన్ భావోద్వేగంగా స్పందించారు. అమెరికన్ల జీవితాలకు రక్షణ దొరుకుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. స్కూళ్లో పిల్లలు, కమ్యూనిటిలలో ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు. తాను కోరుకున్నవన్నీ జరిగాయని అనుకోవడం లేదని, ఆ దిశగా చర్యలు మొదలయ్యాయని బైడన్ సంతృప్తి వ్యక్తంచేశారు. చేయాల్సింది చాలా ఉందని, అయినప్పటికీ ఇది చరిత్రలో నిలిచేపోయేరోజని వ్యాఖ్యానించారు. తుపాకి నియంత్రణ బిల్లుకు మెజార్టీ డెమోక్రట్లు అనుకూలంగా ఉండగా, రిపబ్లికన్ల నుంచి ఆ స్థాయిలో మద్దతు లభించలేదు.