US SC Judgment Abortions : అబర్షన్ హక్కును రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు…ఇతరదేశాలపై ప్రభావం

50 ఏళ్ల క్రితమే మహిళలకు అబార్షన్ హక్కు కల్పించిన అగ్రరాజ్యం ఇప్పుడు మాత్రం అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే అవకాశాన్ని దూరం చేసింది. మహిళలకు అబార్షన్ హక్కు లేకుండా చేసింది.

US SC Judgment Abortions : అబర్షన్ హక్కును రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు…ఇతరదేశాలపై ప్రభావం

U.s. Supreme Court Sensational Judgment On Abortions

U.S. Supreme Court Sensational Judgment on Abortions : అన్నింటా అగ్రగామి అని చెప్పుకునే అమెరికా వెనకడుగులు వేగంగా వేస్తోంది. 50 ఏళ్ల క్రితమే మహిళలకు అబార్షన్ హక్కు కల్పించిన అగ్రరాజ్యం ఇప్పుడు మాత్రం అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే అవకాశాన్ని దూరం చేసింది. పిల్లల్ని నవమాసాలు మోసి, కని, పెంచే మహిళలకు తల్ల్లవ్వాలో, వద్దో నిర్ణయించుకునే హక్కును తీసివేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తిరోగమన తీర్పుపై ప్రగతిశీల, ప్రజాస్వామ్యవాదులు భగ్గుమంటున్నారు. ఆ దేశంలోనే కాదు..యావత్ ప్రపంచమూ ఈ తీర్పు చూసి ఉలిక్కిపడింది. మరోవైపు కార్పొరేట్ సంస్థలు సైతం ఈ తీర్పును తప్పుబడుతున్నాయి. తమ ఉద్యోగినిలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అబార్షన్లు చేయించుకోవాలనుకుంటే…ప్రయాణఖర్చులు చెల్లిస్తామని గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు ప్రకటించాయి.

ఊహించినట్టే అబార్షన్ హక్కు మహిళలకు లేకుండా చేసింది అమెరికా సుప్రీంకోర్టు. కొన్నివారాల క్రితం లీకయిన ప్రతిలో ఉన్నట్టే..రో వర్సెస్ వేడ్ కేసు తీర్పును ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అబార్షన్ హక్కను కల్పించే నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు వదిలేసింది. సుప్రీంకోర్టే గర్భవిచ్ఛిత్తి హక్కును తొలగిండంతో ఈ తీర్పును అమలుచేయడానికి రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఫలితంగా ఇష్టమున్నా లేకపోయినా పిల్లలను కనాల్సిన అనివార్యతలోకి మహిళలు వెళ్లిపోవాల్సిన దుస్థితి దాపురించింది. అవాంఛిత గర్భాన్ని తొలగించే అవకాశం లేకపోవడంతో మహిళలు, వారికి పుట్టే పిల్లలు జీవితమంతా కష్టనష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Alos Read : Abortion Rights: అబార్షన్ హక్కుల కోసం మహిళల పాదయాత్ర

వివాహేతర సంబంధాలను, అమెరికా సమాజంలో విస్తృతంగా పాతుకుపోయిన విచ్చలవిడితనాన్ని అడ్డుకునేందుకు అబార్షన్ హక్కు రద్దు ఉపయోగపడుతుందని సంప్రదాయవాదులంటున్నారు. నిజానికి అమెరికా అంటేనే ఆధునికత, స్వేచ్ఛా జీవితం అన్న భావన ఉంటుంది. ఇలాంటి దేశంలో సంప్రదాయం అనే మాటకే విలువ లేదు. కానీ సంప్రదాయవాదుల పేరుతో కొందరు ఇలా యువతులు, మహిళల జీవితాలను పెను ప్రమాదంలోకి నెడుతున్నారని, సమాజంలో నేరాల తీవ్రత పెరగబోతోందని ప్రగతిశీలవాదులంటున్నారు. అనుకోకుండా వచ్చిన గర్భాన్ని తొలగించుకునే వీలు లేక పిల్లలను కనాల్సి వస్తే….ఆర్థిక, సామాజిక పరిస్థితులు అనుకూలించని మహిళలు..పుట్టిన పిల్లలను పెంచలేక వారిని అనాథలుగా వదిలేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ తీర్పు అమెరికా సమాజాన్ని రెండుగా చీల్చింది. సంప్రదాయవాదులు తీర్పును స్వాగతిస్తుంటే, ప్రగతిశీలవాదులు వ్యతిరేకిస్తున్నారు.

చాలా దేశాల కంటే ముందుగా 1973లోనే రో వర్సెస్ వేడ్ కేసులో అబార్షన్ హక్కును కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 50 ఏళ్లగా దేశంలో అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ…అనధికారంగా చేయించుకునే అబార్షన్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇష్టం లేని గర్భం తీసివేయించుకునే అనుమతి ఉన్నప్పుడే దొంగచాటు అబార్షన్లు ఎక్కువగా ఉండే అమెరికాలో ఇప్పుడిక ఏ స్థాయిలో అనధికారికంగా ఇవి జరుగుతాయో అర్ధం చేసుకోవచ్చు. ఎవరికీ తెలియకుండా, వీలయినంత వేగంగా అబార్షన్ ప్రక్రియ ముగిసిపోయాలని భావించే పరిస్థితుల్లో సరైన వైద్యం అందక, చికిత్స సౌకర్యాలు లేక మహిళలు మృత్యువాత పడే ప్రమాదముంది.

రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేయబోతోందన్న వార్తలు లీకయిన దగ్గర నుంచి అమెరికా వ్యాప్తంగా భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మహిళలు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రగతిశీలవాదులు భారీ సంఖ్యలో వీధుల్లోకొస్తున్నారు. పిల్లలను కనాలో లేదో నిర్ణయించుకునే హక్కును ఆడవాళ్లకు దూరం చేయొద్దని నినదిస్తున్నారు. గర్భాశయం లేదు, అభిప్రాయం లేదు అన్న ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శలు చేస్తున్నారు. పెద్దసంఖ్యలో నిరసనకారులు అమెరికా సుప్రీంకోర్టు భవనాన్ని ముట్టడించారు. పింక్ హౌస్‌గా పిలిచే జాక్సన్ విమెన్స్ హెల్త్ ఆర్గనైజేషన్ బయట కొందరు యువతులు కన్నీళ్లు పెట్టుకుంటోంటే మరికొందరు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మహిళలపై యుద్ధం చేస్తున్నారని, తదుపరి లక్ష్యం ఎవరని ప్రశ్నిస్తున్నారు.

Also Read : Abortions: మగబిడ్డ కోసం 8 అబార్షన్లు.. 1500 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించిన భర్త

తల్లి కావాల్సిందే అని నిర్బంధించడం సరికాదంటున్నారు. అబార్షన్ మా హక్కు అని ప్రతిఘటిస్తున్నారు. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ సహా అనేక నగరాల్లో ఈ నిరసనలు జరుగుతున్నాయి. పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.అబార్షన్ హక్కు రద్దు నిర్ణయం రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యక్షుడు జో బైడన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నిర్ణయం విని షాక్‌కు గురిచేసిందన్నారు. రాష్ట్రాలు కూడా రెండుగా విడిపోనున్నాయి. కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టును తీర్పును అమలుచేసేందుకు సిద్ధమవుతుండగా, మరికొన్నిరాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.

అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ తీర్పుపై నిరసనలు చెలరేగుతున్నాయి. అదే సమయంలో కొన్ని దేశాలు అమెరికాను అనుసరించే అవకాశముందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. రో వర్సెస్ వేడ్ తీర్పు తర్వాత అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన ఇటలీ వంటి దేశాలు…ఇప్పుడు అమెరికాను అనుసరించాలని అక్కడి సంప్రదాయవాదులంటున్నారు. ఈ తీర్పుపై ఐర్లాండ్‌లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అబార్షన్ చేయడానికి డాక్టర్లు నిరాకరించడంతో 2012లో మృతిచెందిన భారత సంతతి మహిళ సవిత హలప్పనవార్ ఫొటోను ఐర్లాండ్‌లోని ప్రగతిశీల వాదులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో అమెరికా ఇలాంటి మరణాలను భారీ సంఖ్యలో చూడాల్సివస్తుంనది హెచ్చరిస్తున్నారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇది సిగ్గుపడాల్సిన తీర్పు అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ తీర్పును వినాశకరమైన ఎదురుదెబ్బగా కెనడా ప్రధాని అభివర్ణించారు. మహిళలకు ఇది అత్యంత భయానకమైనదన్నారు. అమెరికాను ప్రపంచ మోడల్‌గా భావించే అనేక దేశాలు ఈ తీర్పును అనుసరిస్తే…పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ వంటి దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఇష్టం లేకుండా పుట్టే పిల్లల జీవితం కష్టనష్టాల మధ్య సాగుతుందని, వారు పేదరికంలో మగ్గిపోవాల్సిన దుస్థితి ఉంటుందని మానవ హక్కుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశమూ అబార్షన్ హక్కు రద్దు విషయంలో అమెరికాను అనుసరించకూడదన్నది అంతర్జాతీయ నిపుణులు ఇస్తున్న సలహా.