బీ రెడీ.. నవంబర్ 1 కల్లా కరోనా వ్యాక్సిన్, పంపిణీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు ట్రంప్ సందేశం

  • Published By: naveen ,Published On : September 3, 2020 / 10:27 AM IST
బీ రెడీ.. నవంబర్ 1 కల్లా కరోనా వ్యాక్సిన్, పంపిణీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు ట్రంప్ సందేశం

అగ్రరాజ్యం అమెరికాలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందు అంటే నవంబర్ 1 కల్లా వ్యాక్సిన్ పంపిణీకి సిద్దంగా ఉండాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రాష్ట్రాలకు సందేశం వచ్చింది. డల్లాస్ బేస్డ్ హోల్ సేలర్ మెక్ సన్ కార్పొరేషన్ ఫెడరల్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక పంపిణీ చేయడానికి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆ సంస్థ అనుమతి కోరింది.



”ఈ అనుమతులను పొందటానికి అవసరమైన సాధారణ సమయం ఈ అత్యవసర ప్రజారోగ్య కార్యక్రమం విజయవంతం కావడానికి గణనీయమైన అవరోధంగా ఉంది” అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఆగస్టు 27 న రాసిన లేఖలో తెలిపారు.

“పంపిణీ సౌకర్యాల కోసం దరఖాస్తులను వేగవంతం చేయడంలో మీ సహాయాన్ని సిడిసి అత్యవసరంగా అభ్యర్థిస్తుంది” అని రెడ్ ఫీల్డ్ అన్నారు. నవంబర్ 1, 2020 నాటికి ఈ సౌకర్యాలు పూర్తిగా పనిచేయకుండా నిరోధించే మాఫీ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రాలను కోరారు. వ్యాక్సిన్ రోల్ అవుట్ ప్రణాళిక వివరాల పత్రాలను రాష్ట్రాలకు అందించింది. అవి లైసెన్స్ పొందిన వ్యాక్సిన్‌లుగా లేదా అత్యవసర వినియోగ అధికారం కింద ఆమోదించబడతాయి.



తొలి డోస్ టీకా తీసుకున్న కొన్ని వారాల తర్వాత రెండో బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నివేదిక ద్వారా తెలుస్తోంది. ”కోవిడ్-19 టీకా ప్రొవైడర్లను నమోదు చేయడానికి ఎటువంటి ఖర్చు లేకుండా టీకాలు మరియు సహాయక సామాగ్రిని ఫెడరల్ ప్రభుత్వం సేకరించి పంపిణీ చేస్తుంది” అని పత్రాల ద్వారా తెలిసింది. టీకా ముందుగా అత్యవసర సిబ్బంది, జాతీయ భద్రతా అధికారులు, బలహీన జాతుల సభ్యులకు ఇవ్వనున్నారు.

ప్రస్తుతం మూడు వెస్ట్రన్ డ్రగ్ మేకర్స్ వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నం అయ్యాయి. ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ట్రయల్స్ లో భాగంగా వేలాది మందిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ మూడింటిలో ఒకటి ఆస్ట్రాజెనెకా(ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ), మోడర్నా(అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థలు), పిఫిజర్/బయోటెక్ అలయన్స్. ట్రయల్స్ తీరు చూస్తుంటే కచ్చితమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయనేది అంచనా వేయడం కష్టం అని నిపుణులు తెలిపారు. ట్రయల్స్ లో భాగంగా దాదాపు సగం మందిపై ప్రయోగాత్మక టీకా ఇచ్చారు. ఇతరులకు ప్లేస్ బో(ప్రభావం లేని మందు) ఇచ్చారు.

సాధారణ విధానం ప్రకారం.. ప్రయోగాత్మక వ్యాక్సిన్ ఇచ్చాక కొన్ని నెలల పాటు ఆగాల్సి ఉంటుంది. ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ట్రయల్స్ పూర్తి కాక ముందే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వొచని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) చెబుతోంది. కాగా ఎఫ్ డీఏపై ఆరోగ్య సంస్థల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రంప్ ఒత్తిడికి ఎఫ్ డీఏ తలొగ్గి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.

అమెరిక అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారని, ఆ ఒత్తిడితో ఎఫ్ డీఏ నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడుతున్నారు. గతంలో కొవిడ్ 19 చికిత్స కోసం వాడిన హైడ్రాక్సీ క్లోరో క్విన్ విషయంలో ఇదే జరిగింది. క్లోరో క్విన్ అద్భుతంగా పని చేస్తుందని ట్రంప్ పదే పదే చెప్పారు. దీంతో క్లోర్ క్విన్ ని కోవిడ్ 19 చికిత్సలో వినియోగించ వచ్చని ఎఫ్ డీఏ అత్యవసర అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత జూన్ లో తన ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది. హైడ్రాక్సీ క్లోరో క్విన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయి. దీంతో ఎఫ్ డీఏ వెనక్కి తగ్గింది.

ప్రపంచంలో కరోనా దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది అగ్రరాజ్యం అమెరికానే. అక్కడ కరోనా విలయతాండవం చేసింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు అమెరికాలో చోటు చేసుకున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 61 లక్షల 13వేల 510 కేసులు నమోదయ్యాయి. లక్షా 85వేల 720మంది కరోనాతో చనిపోయారు. ఆ తర్వాత బ్రెజిల్ లో 39 లక్షల 97వేల 865 కేసులు నమోదవగా, లక్షా 23వేల 780మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత భారత్ లో 38 లక్షల 53వేల 406 కేసులు నమోదవగా, 67వేల 376మంది కరోనాకు బలయ్యారు.

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే అత్యధికంగా 11.70లక్షల శాంపిల్స్‌ను పరీక్షించగా 83వేల 883 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒకేరోజులో 80వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే ప్రథమం. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకాలేదు. దీంతో గురువారం(సెప్టెంబర్ 3,2020) నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 38లక్షల 53వేలకు చేరింది.

ఇప్పటికే 29.70లక్షల మందికి పైగా కోలుకోగా.. మరో 8లక్షలకు పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. నిన్న మరో 68వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.1శాతానికి చేరింది. కొవిడ్‌ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా మరో 1043 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 67వేల 376కు చేరింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది.