Bjp Target 12 : తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. టార్గెట్ ఎన్ని సీట్లో తెలుసా?

మోదీని మళ్లీ ప్రధానిని చేస్తే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందన్నారు అమిత్‌షా.

Bjp Target 12 : తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. టార్గెట్ ఎన్ని సీట్లో తెలుసా?

Bjp Focus On Telangana

Bjp Target 12 : తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. 17 ఎంపీ స్థానాల్లో కనీసం 12 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు కమలనాథులు. అందుకోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇక బీజేపీ అగ్రనేతలు వరుస పెట్టి తెలంగాణలో పర్యటించనున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహం అమలు చేస్తోంది. తెలంగాణలో సింగిల్‌గానే పోటీ చేస్తున్న కమలం పార్టీ.. 12సీట్లు గెలుచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 14శాతం ఓటింగ్‌ కంటే ఎంపీ ఎన్నికల్లో ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు కమలనాథులు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల సెగ్మెంట్లపై బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. మహబూబ్‌నగర్, మెదక్, భువనగిరి, జహీరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ సీట్లను గెలుచుకుంటామంటున్నారు బీజేపీ లీడర్లు. 14 సీట్లలో తమకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు.

అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న బీజేపీ.. ఇప్పుడు ప్రచారంపై ఫోకస్ పెట్టింది. థర్డ్ ఫేజ్‌ ఎన్నికల ప్రచారం ముగియగానే తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఈనెల 30న తెలంగాణకు వస్తున్నారు. మే 3, 4 తేదీల్లో మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 30న జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు మోదీ. ఆ తర్వాత ఆందోల్ నియోజకవర్గం సుల్తాన్‌పూర్‌లో బహిరంగసభకు హాజరవుతారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లో ఐటీ ఎంప్లాయిస్, ఇంటలెక్చువల్స్‌తో సమావేశం అవుతారు. మే 3న వరంగల్ సెగ్మెంట్‌ పరిధిలో ఒక సభ.. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాలకు కలిపి మరో సభలో పాల్గొంటారు. మే 4న మహబూబ్‌నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు.

ఇక కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా మెదక్ సెగ్మెంట్‌లో పర్యటించి.. సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొన్నారు. 12సీట్లు గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరారు. బీజేపీకి మెజార్టీ సీట్లు ఇచ్చి.. మోదీని మళ్లీ ప్రధానిని చేస్తే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందన్నారు అమిత్‌షా.

ఈనెల 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. 29న ఉదయం కొత్తగూడెం, మధ్యాహ్నం మహబూబాబాద్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం ఉప్పల్‌లో నిర్వహించే రోడ్‌షోలో నడ్డా పాల్గొననున్నారు.

భారీ సభలు, సమావేశాల కంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కమలనాథులు. అన్ని పోలింగ్ బూత్‌లల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటికే అభ్యర్థులు, రాష్ట్ర నేతలకు ఆదేశాలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే ప్రతీ ఓటరును కలిసి.. మోదీ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు బీజేపీ నేతలు.

Also Read : నేను గెలిస్తే ఒక్కొక్కరి ఖాతాలో 15లక్షలు వస్తాయన్నారు మోదీ.. మరి వచ్చాయా?- కేసీఆర్ ఫైర్