తెలంగాణలో వరుసపెట్టి బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన

Telangana: ఈ నెల 9న నర్సాపూర్‌, సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జనజాతర సభల్లో పాల్గొంటారు రాహుల్.

తెలంగాణలో వరుసపెట్టి బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన

Modi-Rahul

బీజేపీ అయినా..కాంగ్రెస్ అయినా..టార్గెట్ ఒక్కటే. తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యం. 17 సీట్లలో 10కి పైగా సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. దక్షిణాదిలో పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న కమలనాథులు..తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో 10 నుంచి 14 సీట్లకుపైగా విజయం సాధిస్తే..భవిష్యత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయెుచ్చని వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు బీజేపీ అగ్రనేతలందరూ పర్యటిస్తున్నారు.

జాతీయ నేతల సుడిగాలి పర్యటనలతో బీజేపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే సిద్దిపేట సభకు హాజరైన కేంద్రమంత్రి అమిత్‌ షా..బీజేపీ 10 నుంచి 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని కూడా తెలంగాణలో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

నడ్డా సుడిగాలి పర్యటన
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా మరోసారి సుడిగాలి పర్యటన చేశారు. మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నడ్డా ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ముస్లీం ఎజెండాను అమలు చేస్తున్నాయని విమర్శించారు నడ్డా. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓబీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. మతపరమైన రిజర్లేషన్లు ఉండొద్దని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు నడ్డా.

ప్రధాని నరేంద్రమోదీ 7న రాత్రి తెలంగాణకు వస్తున్నారు. రాజ్‌భవన్‌లో బస తర్వాత 8న వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత వేములవాడలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత వరంగల్‌ బహిరంగ సభకు హాజరవుతారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఎన్నికల‌ ప్రచారంలో పాల్గొన్నారు. ముషీరాబాద్‌, నర్సంపేటలో పుష్కర్ సింగ్ ధామీ ఎన్నికల ప్రచారం చేశారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో ఉత్తర భారతీయులతో రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ సమావేశం నిర్వహించారు.

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కరీంనగర్, నాగర్‌కర్నూల్‌, సనత్‌నగర్‌లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తెలంగాణలో దెయ్యం పాలన పోయి..భూతం పాలన వచ్చిందన్నారు అన్నామలై. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు కావడం లేదన్నారు.

కాంగ్రెస్‌ నుంచి?
బీజేపీ అగ్రనేతలే కాదు.. కాంగ్రెస్‌ నుంచి రాహుల్, గాంధీ ప్రియాంక తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే గద్వాల్‌, నిర్మల్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు రాహుల్. ఈ నెల 9న నర్సాపూర్‌, సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జనజాతర సభల్లో పాల్గొంటారు రాహుల్. ఈ నెల పదిన ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. కామారెడ్డి, తాండూరు జనజాతర సభలతో పాటు షాద్‌నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు ప్రియాంక.

ఇలా వరుస పెట్టి తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు. బీఆర్ఎస్ నుంచి గులాబీ బాస్ కేసీఆర్ బస్సుయాత్రతో అన్ని పార్లమెంట్‌ సెగ్మెంట్లను కవర్‌ చేస్తున్నారు. మాజీమంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్.. రోడ్‌షోలతో బిజీగా గడుపుతున్నారు.

ల్యాండ్ టైటలింగ్ చట్టానికి, వారి భూమి వివాదానికి సంబంధం ఏంటి?: పేర్ని నాని