తీవ్రమైన అనారోగ్యంతో రాజీనామా చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

  • Published By: vamsi ,Published On : November 6, 2020 / 02:32 PM IST
తీవ్రమైన అనారోగ్యంతో రాజీనామా చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

రష్యాలో దాదాపు 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయవచ్చునని ఆ దేశంలో నివేదికలు చెబుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్‌కు తీవ్రమైన పార్కిన్సన్ వ్యాధి ఉందని, ఈ క్రమంలో పుతిన్ 37 ఏళ్ల ప్రేయసి ఎలెనా కబెవా, ఆమె ఇద్దరు కుమార్తెలు మరియా వోర్ట్సోవా (35), కాటెరినా టిఖోనోవా (34) అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు.



అందుకే వచ్చే ఏడాది జనవరిలో పుతిన్ అధికారాన్ని వేరొకరికి అప్పగించవచ్చని మాస్కో రాజకీయ శాస్త్రవేత్త వాలెరి సోలోవే వెల్లడించారు. పుతిన్ పార్కిన్సన్‌తో పోరాడుతున్నాడని, ఇటీవలి ఫుటేజ్ అతని అనారోగ్య సంకేతాలను చూపించిందని ఆయన చెప్పుకొచ్చారు.



ఇటీవల వీడియో ఫుటేజ్‌లలో పుతిన్ కాళ్ళు నిరంతరం వణుకుతున్నట్లు కనిపించాయి. ఈ ఫుటేజీలో, పుతిన్ వేళ్లను కూడా కదుపుతున్నట్లుగా కనిపించాడు. అతను చేతిలో ఒక కప్పు కూడా పట్టుకుని ఉండగా.. అందులో కొన్ని మందులు ఉన్నాయి. ఈ క్రమంలో అతనిపై వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నదని అర్థం అవుతుంది. 68 ఏళ్ల పుతిన్‌ పార్కిన్సన్‌ (మెదడులోని నాడీ వ్యవస్థ దెబ్బతినడం) వ్యాధితో బాధపడుతున్నారని, ఇటువంటి సమయంలో పదవీ బాధ్యతలను నిర్వర్తించడం కరెక్ట్ కాదని, డాక్టర్లు చెప్పినట్లుగా తెలిస్తుంది.



అయితే బతికున్నంతకాలం అధ్యక్ష పదవిలో కొనసాగే విధంగా రాజ్యాంగంలో సవరణలు తీసుకువచ్చిన పుతిన్‌.. అనుహ్యంగా తప్పుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అనారోగ్యం కారణంగా పుతిన్ ప్రస్తుతం తన విధులను ఇంటి నుంచే నిర్వర్తిస్తున్నారు. భవిష్యత్‌లో వ్యాధి మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉండడంతో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



పుతిన్‌ తొలుత 1999 నుంచి 2000 వరకు ప్రధాన మంత్రిగా కొనసాగారు. అనంతరం 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా, 2012 వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు. ఆ తరువాత మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పెద్ద ఎత్తున రాజ్యాంగ సవరణలు చేసి, బతికునేంత వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగే విధంగా చట్టంలో మార్పులు చేశారు పుతిన్‌. పుతిన్ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024లో ముగియనుండగా.. పుతిన్‌ రాజీనామా వార్తలపై అధ్యక్ష కార్యాలయం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు.