తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు..వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి

  • Published By: bheemraj ,Published On : December 2, 2020 / 11:07 AM IST
తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు..వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి

road accidents 11 people kill : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబాల్లో విషాధ చాయలు అలుముకున్నాయి.



రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్కాపూర్ గేట్ సమీపంలో ఇన్నోవా, బోర్వెల్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఆరేళ్ల చిన్నారి హర్షబాను కూడా ఉంది. మరో ఐదుగురు గాయాలతో బయటపడ్డారు. కారులో మరికొంతమంది ఇరుక్కుపోవడంతో వారిని పోలీసులు బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.



గాయపడిన వారిని హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్‌ తాడ్‌బండ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిని అసిఫ్‌ఖాన్‌, నజియాబేగం, నజియాబాను, హర్ష, మహేష్‌ శాని, హర్షబాబనుగా గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి కర్నాటకలోని గురిమిట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.



కర్నూలు జిల్లాలోని గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరెంట్ సబ్ స్టేషన్ దగ్గర బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతులు బ్రాహ్మణ దొడ్డి గ్రామానికి చెందిన కృష్ణ, గజ్జెలమ్మ, జానకమ్మగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టూ వీలర్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. కామేపల్లి మండలం పండితాపురం వద్ద జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న టిప్పర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే చనిపోయారు.



హైదరాబాద్ శంషాబాద్‌ పరిధిలోని బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వెనక నుంచి ఓ కారు ఢీకొట్టడంతో ముందు ఉన్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ముందు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.



తొండపల్లి దగ్గర ముందు వెళ్తున్న కంటెయినర్‌ సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల ఉన్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముందు ఉన్న కారు మొత్తం ధ్వంసమయింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.